ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం.. ముందుగానే మేల్కొందాం!

by Ravi |   (  Updated:2026-04-08 01:15:22  IST  )

తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోవడం, యువత సంఖ్య తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం భవిష్యత్తు సామాజిక-ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం.. ముందుగానే మేల్కొందాం!
X

ఒకప్పుడు 'జనాభా నియంత్రణ’ ల‌క్ష్యంగా సాగిన ప్రభుత్వ విధానాలు, ఇప్పుడు 'జనాభా నిర్వహణ' వైపు మళ్లాల్సిన అసాధారణ పరిస్థితి ఏర్పడింది. జపాన్, చైనా వంటి దేశాలు ఎదుర్కొంటున్న 'వృద్ధాప్య జనాభా' సంక్షోభం ఇప్పుడు తెలంగాణ గడప తడుతోంది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి పడిపోతుండటం భవిష్యత్తు సామాజిక, ఆర్థిక భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

ఒక రాష్ట్ర జనాభా స్థిరంగా ఉండాలంటే సంతానోత్ప‌త్తి రేటు 2.1 శాతం ఉండాలి. కానీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.7 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఇది 1.5 శాతానికి చేరుకుందని అంచనా. అంటే, ప్రతి దంపతులు సగటున ఇద్దరు పిల్లలను కూడా కనడం లేదు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ రేటు 1.8 శాతం ఉండ‌గా, గ్రామీణ ప్రాంతాల్లో 1.7 శాతంగా న‌మోదైంది. ఆశ్చ‌ర్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే రేటు కొంచెం తక్కువగా ఉండటాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

తగ్గుతున్న జననాల సంఖ్య!

2019 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణాలో నమోదైన జననాల సంఖ్యలో 22.4 శాతం తగ్గుదల కనిపించింది. దేశంలో యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సంతానోత్ప‌త్తి రేటు పెరుగుతున్నా, తెలంగాణలో మాత్రం ఈ తగ్గుదల తీవ్రంగా ఉండటం ఒక 'రీజినల్ అవుట్‌ లయర్'గా నిపుణులు చెబుతున్నారు. జాతీయ సగటు సంతానోత్పత్తి రేటు సుమారు 2.0 శాతం ఉండగా, తెలంగాణలో అది 1. 6 నుండి 1.5 శాతానికి పడిపోయింది. 2035 నాటికి సంతానోత్ప‌త్తి రేటు 1.5 శాతం వద్దే ఉండిపోయి, జనాభా వృద్ధి రేటు దాదాపు ‘సున్నా’కి చేరుకుంటుందని అంచనా.

జనాభా పిరమిడ్ తలకిందులైతే..

సంతానోత్ప‌త్తి రేటు ఇలాగే ప‌డిపోతే.. భ‌విష్యత్తులో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగి 'జనాభా పిరమిడ్' తలకిందులయ్యే ప్రమాదం ఉంది. దీనికి కార‌ణం మహిళల్లో విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఆల‌స్యంగా వివాహాలు జ‌ర‌గ‌డం. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి వల్ల సంతానలేమి సమస్యలు ఎదురు కావడం. పిల్లల పెంపకం, నాణ్యమైన విద్య, కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి భారంగా మార‌డం. దశాబ్దాలుగా జరిగిన కుటుంబ నియంత్ర‌ణ‌ ప్రచారం వల్ల ‘ఒక్కరు లేదా ఇద్దరు’ అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవ‌డం. ఫ‌లితంగా సంతానోత్ప‌త్తి రేటు క్ర‌మంగా త‌గ్గుముఖం పట్టింది. ఏ దేశానికైనా యువ‌తే జాతీయ‌ సంప‌ద‌. జ‌నాభా పెరుగుదల‌, త‌గ్గుద‌ల అంటే కేవ‌లం కూడిక‌లు, తీసివేత‌లు మాత్ర‌మే కాదు.. జ‌నాభా పెరిగినా, త‌గ్గినా ఆర్థిక‌, రాజ‌కీయ‌, సామాజిక ప‌రిస్థితులు అసాధార‌ణంగా మారిపోతాయి. అందుకే జ‌నాభా స‌మ‌తుల్య‌త చాలా అవ‌స‌రం.

దక్షిణాది మొత్తంలో జనాభా సంక్షోభం!

తెలంగాణ‌తో పాటు ద‌క్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తమిళ‌నాడు, కేర‌ళ‌లోనూ సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుంది. అయితే, ఈ సంక్షోభాన్ని ముందే గుర్తించిన‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతోంది. దీని కోసం ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ (జనాభా నిర్వహణ విధానం) ముందుకు తెస్తోంది. ఈ విధానం 2026 ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. దీని కోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను లేదా 'గ్రామ, వార్డు సచి వాలయ' వ్యవస్థను ఉపయోగించనుంది. 'మూడో బిడ్డను కంటే పాతిక వేలిస్తాం' అంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక ఆసక్తికర ప్రతిపాదన చేశారు.

జాతీయ సంక్షోభంగా జనాభా తగ్గుదల..

చైనా, జ‌పాన్ దేశాల్లో జనాభా తగ్గుదల ఒక జాతీయ సంక్షోభంగా మారింది. ఈ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌ డేందుకు ఆయా దేశాలు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ ఆశించిన‌ స్థాయిలో ఫ‌లితాలు రావ‌డం లేదు.. జ‌పాన్ జ‌నాభాలో 30% వృద్ధులే. యువత లేక పరిశ్రమలు మూతబడుతున్నాయి. రోబోలపై ఆధారపడాల్సిన స్థితి వచ్చింది. చైనాలో 'వన్ చైల్డ్ పాలసీ' వల్ల అక్కడ పని చేసేవారి సంఖ్య త‌గ్గిపోయింది. ఇప్పుడు 'ముగ్గురు పిల్లల' విధానాన్ని తెచ్చినా, పెరిగిన జీవన వ్యయం వల్ల దంపతులు పిల్లలను కనేందుకు ముందుకు రావడం లేదు. చైనాలో పిల్లల పెంపకం, ముఖ్యంగా విద్య, వైద్యం, గృహ నిర్మాణం అత్యంత ఖరీదైనవిగా మారాయి.. నగరాల్లో నివసించే వారు పిల్లలను కనేందుకు ఇది అతిపెద్ద అడ్డంకిగా మారింది. అటు జపాన్‌లోనూ నిలకడలేని జీతాలు, పెరుగుతున్న ఖర్చుల వల్ల యువత పెళ్లి, పిల్లలను క‌నేందుకు దూరంగా ఉంటున్నారు.

సంతానోత్పత్తి రేటు తగ్గితే యమ డేంజర్!

చైనా, జపాన్ దేశాల చూశాకనైనా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాలి. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యా, వైద్యం, గృహ నిర్మాణం అత్యంత ఖరీదైనవిగా మారాయి. మెట్రో న‌గ‌రం హైద‌రాబాద్ లాంటి ప్రాంతాల్లో నివసించే దంపతులు కనీసం ఇద్దరు పిల్లలను కూడా కనే సాహసం చేయడం లేదు.. దీంతో దంప‌తులు ఒకరు లేదా ఇద్ద‌రికే ప‌రిమిత‌మైపోతున్నారు. సంతానోత్పత్తి రేటు తగ్గడం దేశ, రాష్ట్ర భవిష్యత్తు సామాజిక, ఆర్థిక పునాదులను ప్రభావితం చేసే విషయం. సంతానోత్పత్తి రేటు తగ్గుదలను అరికట్టాలంటే ఒక దీర్ఘకాలిక జనాభా వ్యూహాన్ని అమలు చేయడం అత్యవసరం. చైనా, జపాన్ తరహాలో అనేక ప్రోత్సాహాకాలు ప్ర‌వేశ‌పెట్టి, నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తే త‌ప్ప‌, రాబోయే విప‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం లేదు.

దంపతులకు ఆర్థిక భరోసా ఏది?

ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఎత్తివేయడం ప్రాథమిక అడుగు మాత్రమే. జనాభా పెరుగుదల అనేది కేవలం చట్టాలతో రాదు.. అది సామాజిక భద్రతతో ముడిపడి ఉంది. ‘మేము పిల్లలను కంటే, వారి భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అనే నమ్మకం ప్రజల్లో కలిగిం‌చాలి. అందుకోసం పిల్ల‌ల‌ను క‌నేందుకు ముందు కొచ్చిన దంప‌తుల‌కు ఆర్థిక భ‌రోసా క‌ల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తేనే, రాబోయే 'వృద్ధాప్య సంక్షోభం' నుండి రాష్ట్రాన్ని కాపాడుకోగలం.

-మేక‌ల క్రిష్ణ‌,

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

99485 56978

Next Story