- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు.. చట్టం ముందు నిలిచేనా..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285Aను సవరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285Aను సవరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేష న్లను 42 శాతానికి పెంచాలని నిర్ణయిం చింది. అయితే ఈ ప్రయత్నం రాజకీ యంగా ఆకర్షణీయమైనప్పటికీ, రాజ్యాంగబద్ధమైన పరిమితులు, సుప్రీంకోర్టు తీర్పులు, గత అనుభవాలు దీని చట్టపరమైన బలాన్ని సందేహాస్ప దంగా చేస్తున్నాయి.
ఈ వ్యాసం బీసీ రిజర్వేషన్ల చరిత్ర, రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు, తెలంగాణ జనాభా డేటా, తమిళనాడు మోడల్‌ను పరిశీలిస్తూ, సామాజిక న్యాయం కోసం సాధ్యమైన మార్గాలను సమగ్రంగా విశ్లేషిస్తుంది.
చారిత్రక నేపథ్యం..
భారత రాజ్యాంగం ఆర్టికల్ 38 ప్రకారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేయాలి. ఆర్టికల్ 15(4), 16(4)లు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తాయి. అయితే, బీసీ రిజర్వేషన్ల చట్టపరమైన ప్రయాణం అనేక సవాళ్లను ఎదు ర్కొంది. మొదటగా చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (1951), ఈ కేసులో తమిళనాడులో బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు చెల్లవని తేల్చింది. దీనివల్ల ఆర్టికల్ 15(4)ను చేర్చేందుకు మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. ఇక అనంతరామన్ కమిషన్ (1970), బీసీలకు రిజర్వేషన్ల అమలుకు శాస్త్రీయ ఆధారాలను సిఫారసు చేసింది. అలాగే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992) ప్రకారం, రిజర్వేషన్లు 50 శాతం సీలింగ్‌ను మించకూడదని, కులాన్ని బీసీల గుర్తింపుకు ప్రధాన ఆధారంగా పరిగణించ వచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమూర్తి కేసు (2010) ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లకు ‘ట్రిపుల్ టెస్ట్’ (సమగ్ర సర్వే, శాస్త్రీయ డేటా, 50% సీలింగ్) నిబంధనను పేర్కొంది. జై శ్రీలక్ష్మణరావు పాటిల్ వర్సెస్ స్టేట్ఆఫ్ మహా రాష్ట్ర (2021) ప్రకారం మహారాష్ట్రలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ 50% సీలింగ్‌ను మించినందున రద్దు చేయబడింది. మహారాష్ట్ర స్థానికసంస్థల కేసు (2021) 27 శాతం బీసీ రిజర్వేషన్ కూడా సీలింగ్‌ను మించినందున కొట్టివేయబడింది.
లేటైతే వీరికే ఎక్కువ నష్టం!
ప్రస్తుతం తెలంగాణరాష్ట్రంలో బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లు 29 శాతం. వాటిని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పచగా ఇచ్చిన హమి మేరకు 42 శాతం రిజర్వేషన్‌కు సవరణ ప్రయత్నం జరుగుతోంది, కానీ ఇది చట్టపరమైన సమీక్షలో నిలబడే అవకాశం తక్కువ. ఎందు కంటే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే పూర్తి చేసినప్పటికీ, డేటా బయట పెట్టలేదు. రాష్ట్రంలో బీసీలు జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. అయితే, ఈ కుల గణన డేటా బహిర్గతం కాకపోవడం వల్ల, అత్యంత వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను గుర్తించడం కష్టం. అలాగే తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్, ఎస్సీ (15.45%), ఎస్టీ (9.34%) రిజర్వేషన్లతో కలిపితే 66.79%కు చేరుతుంది, ఇది 50% సీలింగ్‌ను మించుతుంది. డేటా విడుదల చేయకపోవడంతో శాస్త్రీయ ఆధారాలు లేవని ఈ రిజర్వేషన్ చట్టపరమైన సమీక్షలో రద్దయ్యే ప్రమాదం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు 12,900 గ్రామ పంచాయతీలకు పరిమితం. కానీ ప్రభుత్వం 2026 నాటికి లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన చేసింది. ఆ లోపు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకపోతే బీసీలు తీవ్ర నష్టం చవి చూస్తారు. విద్య, ఉద్యోగ రంగాల్లో వేలాది బీసీలు అవకాశాలను కోల్పోతారు.
తమిళనాడు మోడల్ అమలు కావాలంటే..
తమిళనాడు 69 శాతం రిజర్వేషన్‌ను (ఎస్సీ18%, ఎస్టీ1%, బీసీ 50%) అమలు చేస్తోంది, ఇది 50% సీలింగ్‌ను అధిగమించింది. ఈ విజయం వెనుక కారణాలు.. అంబ శంకర్ కమిషన్ (1980). ఆ కమిషన్ నివేదిక ప్రకారం ఎం.జి. రామచంద్రన్ బీసీ రిజర్వేషన్‌ను 31% నుండి 50%కి పెంచారు. అగ్రకులాల నిరసనలు, సుప్రీంకోర్టు పిటిషన్ల తర్వాత, అంబశంకర్ కమిషన్ శాస్త్రీయ డేటాతో రిజర్వే షన్‌ను సమర్థించింది. ఇక జయలలిత చొరవతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీనివల్ల సుప్రీంకోర్టు సమీక్ష నుండి రక్షణ లభించింది. తెలంగాణలోనూ తమిళనాడు మాదిరిగా 42 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే కుల గణన డేటాను బహిర్గతం చేసి, అత్యంత వెనుకబడిన కులాల స్థితిగతులను శాస్త్రీయంగా నిర్ధారించాలి. అలాగే అంబ శంకర్ కమిషన్ తరహాలో రిజర్వేషన్‌ను సమర్థించే స్వతంత్ర కమిషన్ నివేదికను సిద్ధం చేయాలి. రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ సమైక్యతను ప్రదర్శించి అఖిలపక్ష సమావేశం బీఆర్ఎస్, బీజేపీతో సహా అన్ని పార్టీల మద్దతును సమీకరించి, ఏకాభిప్రాయం కుదర్చాలి. అన్నీ పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి ఈ రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు చొరవ తీసుకోవాలి. బీసీ సమాజం అప్రమత్తంగా ఉండి, రాజ్యాంగ బద్ధమైన ఉద్యమం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సాధించాలి.
- డాక్టర్ వై. శివ ముదిరాజ్
99632 40519






