వ్యవస్థకు వెన్నెముక.. బతుకుకే భద్రత లేదు!

by Ravi |   (  Updated:2026-04-10 00:46:01  IST  )

తెలంగాణలో గ్రామీణ ఆరోగ్య సేవలకు వెన్నెముకగా ఉన్న ఏఎన్ఎంలు కాంట్రాక్ట్ విధానంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనం, ఉద్యోగ భద్రత లేకపోవడం, రెగ్యులరైజేషన్ అవసరం వంటి కీలక అంశాలపై సమగ్ర విశ్లేషణ.

వ్యవస్థకు వెన్నెముక.. బతుకుకే భద్రత లేదు!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత, 2026 నాటికి రాష్ట్ర ఆరోగ్య ముఖ చిత్రం గణనీయంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.15 కోట్ల కుటుంబాలు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.. అయితే ఆ సేవల పునాది ఎక్కడుంది? అని ప్రశ్నిస్తే వినిపించే ఒకే ఒక్క సమాధానం ఏఎన్ఎంలు..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,000 నుంచి 10,000 మధ్య ఏఎన్‌ఎంలు పనిచేస్తుండగా, వీరిలో అత్యధిక శాతం మంది నేటికీ కాంట్రాక్ట్ లేదా ఔట్‌ సోర్సింగ్ విధానంలోనే కొనసాగు‌తున్నారు.. వ్యవస్థను నడిపిస్తున్న ఈ మహిళా శక్తిని 'కాంట్రాక్ట్' అనే అనిశ్చితి నీడలో ఉంచడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం.

ఆరోగ్య తెలంగాణ కోసం..

​2026 నాటి తాజా డేటా ప్రకారం, తెలంగాణలోని జనాభాలో సుమారు 60% పైగా నేటికీ ప్రాథమిక ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థపైనే ఆధారపడుతున్నారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల సంరక్షణ, శిశువులకు టీకాలు వేయడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో ఏఎన్‌ఎంల పాత్ర అగ్రగామి. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కాస్త అయిన మెరుగైన స్థానంలో ఉందంటే దానికి ప్రధాన కారణం క్షేత్ర స్థాయిలో ఎండనక, వాననక పనిచేసే ఏఎన్ఎంలే. అయితే వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే గుండె తరుక్కుపోతుంది. గ్రామాల్లో నామమత్రమైన వేతనంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు గత ఏడు ఎనిమిదేళ్లుగా కేవలం ₹27,000 వేతనంతోనే సరి పెట్టుకుంటున్నారు.. 2026 నాటి నిత్యావసర ధరలు, విపరీతంగా పెరిగిన జీవన వ్యయంతో పోలిస్తే ఈ వేతనం వారి కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోదు.. ఒకవైపు ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది, కానీ ఆ వ్యవస్థకు రక్తాన్ని అందిస్తున్న ఏఎన్ఎంల జీవన ప్రమా ణాలను మాత్రం విస్మరిస్తోంది.

ఇదో ఆధునిక శ్రమ దోపిడీ..!

ఒక ఏఎన్ఎం సగటున 3 నుంచి 5 గ్రామాల బాధ్యతను మోస్తోంది. అంటే దాదాపు 5,000 నుంచి 7,000 మంది జనాభా ఆరోగ్య బాధ్యత ఒకే ఒక్క మహిళా ఉద్యోగిపై ఉంటోంది. ఇంతటి భారీ బాధ్యతను మోస్తున్న వారికి ‘ఉద్యోగ భద్రత’ లేకపోవడం అత్యంత ఆందోళనకరం. రేపు మా ఉద్యోగం ఉంటుందో లేదో అనే భయం మధ్య వారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సి వస్తోంది. ఇది కేవలం అన్యాయం మాత్రమే కాదు, ఇది వ్యవస్థపరమైన లోపం. జీతాల విషయంలో తెలంగాణ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడి ఉందని ఫీల్డ్ స్థాయి వర్గాలు చెబుతున్నాయి.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ ప్రదంగా బతకాలంటే కనీసం ₹40,000 నుంచి ₹45,000 వేతనం ఉండాలి. దానికి తోడు విధి నిర్వహణలో ఎదురయ్యే రిస్క్ అలవెన్స్ గానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం గానీ లేకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది.

​రెగ్యులరైజ్ చేయాలి!

రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాల ఆరోగ్యం మెరుగు పడాలంటే, ముందుగా ఆ ఆరోగ్యాన్ని కాపాడే వారి బతుకులు బాగుపడాలి. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్య కేవలం ఒక ఉద్యోగ సమస్య కాదు, ఇది రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ మనుగడకు సంబంధించిన సమస్య. కొత్త పోస్టుల భర్తీ కంటే, ఏళ్ల తరబడి క్షేత్ర స్థాయిలో అనుభవం గడించిన వీరిని రెగ్యుల‌రైజ్ చేయడమే విజ్ఞత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని. అలాగే ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాన్ని కనీసం ₹40,000 పైగా పెంచాలి. వీటితో పాటు సామాజిక భద్రత, రిస్క్ అలవెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, పదవీ విరమణ ప్రయో జనాలు కల్పించాలి. అలాగే 2026 నాటి పెరిగిన జనాభా ప్రాతిపదికన, ప్రతి గ్రామానికి సరిపడా సిబ్బందిని నియమించి పని భారాన్ని తగ్గించాలి.

తగిన గుర్తింపు ఇవ్వాలి!

తెలంగాణ ఆరోగ్య వ్యవస్థ భవిష్యత్తు ఖరీదైన ఆసుపత్రుల గోడలలో లేదు, గ్రామాల్లో ప్రతి పేదవాడి గడప వరకు వెళ్లి వైద్యం అందిస్తున్న ఏఎన్ఎంల చేతుల్లో ఉంది. గణాంకాలు మనకు దారి చూపిస్తున్నాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి.. ఇక కావాల్సింది ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రమే. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు న్యాయం చేయని పక్షంలో, రాష్ట్ర ఆరోగ్య సౌధం పునాదులు బలహీనపడటం ఖాయం. సంఖ్యల వెనుక ఉన్న నిజాన్ని గుర్తించి, వారికి తగు గౌరవం, భద్రత అందించడమే రాష్ట్ర ప్రగతికి అసలైన అర్థం. నిర్ణయం ఇప్పుడు పాలకుల చేతుల్లోనే ఉంది!

-బండి దుర్గాప్రసాద్,

సామాజిక విశ్లేషకులు

79811 84205

Next Story