- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ.. ఆరు దశాబ్దాల ఆకాంక్ష!
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం సాధించినప్పటికీ, తెలంగాణ, మరాఠా, కన్నడ ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ సంస్థానం

1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం సాధించినప్పటికీ, తెలంగాణ, మరాఠా, కన్నడ ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొంతకాలం స్వతంత్ర రాజ్యంగా కొనసాగింది. ఈ ప్రాంత ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా 1946లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వాములై నిజాం సర్కారుపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఇది కాలక్రమేణా భూసంస్కరణలు, సామాజిక సమానత్వం కోసం ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారింది. భారత ప్రభుత్వం జరిపిన "ఆపరేషన్ పోలో" ద్వారా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైంది.
భాషా ప్రయుక్త రాష్ట్రంగా..
1955లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల కలయిక వల్ల కలిగే లాభ, నష్టాలతో కూడిన సిఫార్సులను కేంద్రానికి అందజేసింది. కానీ ఆనాడే తెలంగాణ ప్రజలు తమ సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ గుర్తింపును కోల్పోతామని భయపడి ఈ కలయికను వ్యతి రేకించారు. కానీ 1956 ఫిబ్రవరి 20న ఇరు రాష్ట్రాల నాయకులు తెలంగాణ ప్రాంతానికి రక్షణలు కల్పించే ఉద్దే శంతో “పెద్ద మనుషుల ఒప్పందం” చేసుకోవడం ద్వారా హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాలు, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న అవ తరించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒప్పందం ప్రకారం బడ్జెట్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాధాన్యత, నీటిపారుదల, ఉద్యోగ అవకాశాలలో సమానత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చినప్పటికీ, అది ఇవ్వకపోవడంతో రాజకీయ, ఆర్థిక అసమానతలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రజలు తమ ప్రాంతంలోని “నీళ్లు, నిధులు, నియామకాలు” ఆంధ్ర ప్రాంతం వారి ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు.
తొలి దశ తెలంగాణ ఉద్యమం..
1956 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం అనేక దశల్లో పోరాట రూపం మార్చుకున్నది. కానీ పోరాటాన్ని విరమించలేదు.. తెలంగాణవాదం నివురుగప్పిన నిప్పులా ఉండేది. నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ నియామకాలలో తెలంగాణకు తక్కువ ప్రాధాన్యత, బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడం పరిపాటి అయ్యింది. 1969లో ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తి "జై తెలంగాణ" ఉద్యమంగా రూపాంతరం చెందింది. 1970 దశకంలో ఉద్యమం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష రగులుతూనే ఉండేది. ముల్కీ (స్థానిక) నిబంధనలు పాటించకుండా అక్రమంగా వేలాది మంది సీమాం ధ్రులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడినట్టు జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టుతో బహిర్గతం అయింది. ఈ నేపథ్యంలో వచ్చిన 610 జీవోను అమలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీమాంధ్ర నాయకత్వం పట్టించుకోలేదు. తదనంతరం గిర్ గ్లాని కమిషన్ కూడా స్థానికత, ఉద్యోగాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా ఉల్లంఘించిందో సవివరంగా తెలిపింది. కానీ నాటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
మలిదశ తెలంగాణ ఉద్యమం..
ఈ నేపథ్యంలో 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని స్థాపించారు. 2009లో హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల విద్యార్థి, ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇక స్వరాష్ట్ర సాధనే పరిష్కార మార్గమని ఉద్యమించిన తెలంగాణ సమజానికి మద్దతుగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు ఉపక్రమించడం, తర్వాత డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభి స్తామని ప్రకటించారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ వివాదాల కారణంగా ప్రక్రియ కొంతకాలం వాయిదా పడింది.
రాష్ట్ర ఆవిర్భావం దిశగా..
2010లో కేంద్రం తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది కాలయాపన చేయడానికేనని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరోవైపు పోరాటాన్ని కొనసాగించారు. జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్, సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, సాగరహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసంఖ్యాక విద్యార్థుల ఆత్మ బలిదానాలు అందర్నీ కలిచి వేశాయి. సకల జనుల పోరాట ఫలితంగా 2013లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పున ర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. 2014 జూన్ 2న తెలంగాణ అధికారికంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
పోరాటాలకు చిరునామా..
తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలు.. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అసమానతలు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత, “నీళ్ళు, నిధులు నియామకాల” కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం, సాంస్కృతికంగా తెలంగాణ భాష, యాస, సంప్రదాయాలు, పండుగలు (బతుకమ్మ, బోనాలు) సీమాంధ్ర ఆధిపత్యంలో నిరాదరణకు గురయ్యాయనే భావన కలిగింది. ఈ అంశాలన్నీ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించాయి. రాజకీయ పార్టీలన్నీ జేఏసీగా ఏర్పడి రాష్ట్ర సాధనలో భాగస్వాములు కావడం, నాడు కేంద్రంలో అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వడం చారిత్రాత్మకం. ఆరు దశాబ్దాలుగా ప్రజల పోరాట ఫలితంగా, వందలాది మంది అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
డాక్టర్ అశోక్ మంద
ఉస్మానియా యూనివర్సిటీ
99590 46499






