- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యాహ్న భోజనం బాధ్యతలు టీచర్లకు వద్దు!
అధిక జనాభా ఉన్న భారతదేశంలో బడి ఈడు ఉంటూ బడికి రాని వారు పేదరికం కారణంగా లక్షల్లో ఉన్నారు. బడికి వచ్చే వారు పౌష్టికాహార

అధిక జనాభా ఉన్న భారతదేశంలో బడి ఈడు ఉంటూ బడికి రాని వారు పేదరికం కారణంగా లక్షల్లో ఉన్నారు. బడికి వచ్చే వారు పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్న వారు కోట్లల్లో ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజే షన్ ఒక నివేదికలో తెలిపింది. ‘తిండి తింటే కండ కలదొయ్, కండ కలవాడెను మనిషోయ్’ అన్నాడొక కవి. ఈసురోమని మనుషుకుంటే దేశమే గతి బాగు పడునోయ్ అన్నాడు. మన దేశ అభివృద్ధికి పిల్లల పౌష్టికా హారానికి సంబంధం ఉంది. అందుకే ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం అందిస్తున్నప్పటికీ, చాలినంత నిధులు సమకూర్చడం లేదు. బడి పిల్లలకు ఓటు లేకపోవడం కారణమా? అన్న సందేహం కలగక మానదు.
ప్రభుత్వ బడుల్లో చదివే బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్లడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం మధ్యాహ్న భోజనం. ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెడతారు. బాలబాలికలను ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఈ పథకం ముఖ్య లక్ష్యాలు.. కానీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదన్నది అక్షర సత్యం.
కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా..
ఈ పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వ్యయాన్ని భరిస్తున్నాయి. అయితే ఈ పథకంపై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. పెరిగిన ధరలకనుగుణంగా వంట ఏజెన్సీలకు ధరలు పెంచకపోవడంతో నాసిరకం భోజనమే విద్యార్థులకు అందుతున్న విషయం వాస్తవం. ఒకటి నుండి ఐదు తరగతుల వరకు ఒక్కో విద్యార్థికి రూ.5.45. ఆరు నుండి ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు రూ.8.17, తొమ్మిది, పది తరగతులకు గుడ్డు ధరతో కలుపుకుని రూ.10.67 అలాగే ఆరు నుండి ఎనిమిదవ తరగతులకు ఒక్కొక విద్యార్థికి గుడ్డు ఖర్చు ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు.
తక్కువ ధరలు చెల్లిస్తూ..
అలాగే ప్రాథమిక తరగతుల విద్యార్థులకు 100 గ్రాముల చొప్పున, ఉన్నత తరగతుల విద్యార్థులకు 150 గ్రాముల బియ్యాన్ని ప్రభుత్వమే పాఠశాలలకు పంపిణీ చేస్తున్నది. ఇవే కాకుండా మెనూ ప్రకారం వంటలో ఉపయోగించే నూనె, దినుసులు, కాయగూరల ఖర్చు ఏజన్సీ మహిళలే భరించాల్సి ఉంటుంది. అయితే ఇంత తక్కువ ధరలు చెల్లిస్తూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించమనడం ఎంతవరకు సమంజసమని వంట ఏజెన్సీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరలు తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని ఏజెన్సీలు వాపోతున్నాయి. ఆ చెల్లించే మొత్తం కూడా సకాలంలో చెల్లించకపోవడంతో తాము అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక వైపు మధ్యాహ్న భోజనం అమలౌతున్న పాఠశాలల్లో తమను మధ్యాహ్న భోజన బాధ్యతల నుండి తప్పించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ఇటీవల నారాయణపేట జిల్లా నగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలో హెచ్ఎంను విధుల నుండి తొలగించడం వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయా లన్న విద్యాహక్కు చట్టం నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని వారు కోరుతున్నారు.
ఇతర రాష్ట్రాల మాదిరిగా..
అందుకే ఇతర రాష్ట్రాల మాదిరిగా మధ్యాహ్న భోజన పథకం అమలుకు సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పెండింగ్ బిల్లులను ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న నాంది, అక్షయ పాత్ర వంటి సంస్థలు అందిస్తున్న నాణ్యమైన ఆహారం అందే మాదిరిగా ప్రణాళికలు రూపొందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు మొదలయ్యాయి. ఉదయం 8 గంటలకు బడికి వచ్చిన విద్యార్థులు సాయంత్రం ఐదు గంటల వరకు ఉండటంతో ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయంత్రం పూట స్నాక్స్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగించకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది.
పిల్లలను బడికి దూరం చేయొద్దు!
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న జాబితాలోకి చేరిన భారతదేశంలో తిండి కోసం ఇంకా జనం అల్లాడి పోవడం అతి పెద్ద సమస్యగా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి. వంట వాళ్ల పైసలు నెలలకు నెలలు పెండింగ్‌లో ఉండడం కాకుండా నెల రోజులు అడ్వా న్స్ చెల్లించే విధంగా ఉండాలి. లేదా కేంద్రీయ కిచెన్‌లు ఏర్పాటు చేసి అందరికీ రుచి, శుచికరమైన భోజనం అందించాలి. ఇటీవల అనేక సమస్యలు ఏర్పాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధా న్యత ఉన్న అంశంగా తీసుకొని పరిష్కారానికి పూనుకోవాలి. లేకుంటే ఈ ఘటనలు బడికి వస్తున్న కొద్దో గొప్పో పిల్లలను బడులకు దూరం చేసే ప్రమాదం ఉంది.
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS
90006 74747






