అధ్యాపకులకు ఈ గుణాత్మక విలువలుండాలి! తరగతి గదిలో చెప్పేదొకటి, బయట చేసేదొకటిగా ఉండకూడదు!

by Ravi |   (  Updated:2025-09-05 01:00:19  IST  )

ఉపాధ్యాయునిలోని చైతన్యశీలత అతని నైపుణ్యాలకు దోహదం చేస్తాయి. తద్వారా సమాజం అతనిని ఉత్తమ గురువుగా గుర్తిస్తుంది.

అధ్యాపకులకు ఈ గుణాత్మక విలువలుండాలి! తరగతి గదిలో చెప్పేదొకటి, బయట చేసేదొకటిగా ఉండకూడదు!
X

‘ఉపాధ్యాయునిలోని చైతన్యశీలత అతని నైపుణ్యాలకు దోహదం చేస్తాయి. తద్వారా సమాజం అతనిని ఉత్తమ గురువుగా గుర్తిస్తుంది.’ అంటారు మహాత్మా గాంధీ. ‘నా జీవితంలో నిపుణత, విలువలకు మార్గదర్శి నా గురువు. నా యీ స్థానం అతనిదే.. తర్వాత నా తల్లిదండ్రులది.’ అన్నారు నెహ్రూ. ఉపాధ్యాయునిలో నిక్కచ్చి తనం లోపిస్తే విద్యార్థులపై నూటికి నూరు శాతం దాని ప్రభావం పడి వారి భవిత దెబ్బతినే అవకాశం ఉంది. ‘విద్యార్థి బృందాలలో విలువలను ప్రోది చేయగలిగినది ఉపాధ్యాయుడే. ఇందుకు ఉత్సాహకరమైన మనోవైఖర్లు అతనికి అవసరం’ అంటూ కారల్ మార్క్స్ చెప్పిన మాటలు వాస్తవమని గుర్తించాలి.

‘నా దృష్టిలో అత్యంత గౌరవాస్పదుడు ఉపాధ్యాయుడు. విలువలు కలిగి ఉండేది కూడా అతనే’.. అని ఉపాధ్యాయులపై చలం చేసిన వ్యాఖ్య లోకంలో ఉపాధ్యాయునికి గల గౌరవాన్ని తెలుపుతుంది. విలువలతో కూడిన విద్యను అందించే క్రమంలో అధ్యాపకులు తగిన అర్హతలు (గుణాత్మకమైన) కూడా కలిగి ఉండాలి. అందుకు గాను కొన్ని సూత్రాలను అలవరచుకోవలసి ఉంటుంది. అవి అందరికి వర్తించేది, ఔచిత్యం, సహజసిద్ధ హేతుకత, సంపూర్ణం, సమతౌల్యతా దోహదం. వీనిని ప్రమాణంగా తీసుకొని దానికి అనుకూలంగా విద్యను విలువైనదిగా విద్యార్థికి అందజేసే నేపథ్యంలో ఈ ప్రమాణాలు అవసరం. పై అంశాలను పరిశీలిస్తే జాతి, కుల, మత, వర్ణ, వర్గ, సంబంధాలకు అతీతంగా అందరి విద్యార్థులకు ఒకే రకమైన విద్యను అందించగలిగే సౌహార్ధ్ర‌తతో ఉపాధ్యాయుడు ఉండగలగాలి. అప్పుడు ఆ విద్య విశ్వజనీనం అవుతుంది.

చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉండకూడదు..

తార్కికంగా, అందరూ ఇష్టపడేటట్లు ఉపాధ్యాయుడు చెప్పగలగాలి. బోధన జరుగుతున్న సందర్భంలో సమాజంలోని మంచి చెడుల ప్రస్తావన లేదా చర్చ వచ్చినపుడు ఆ తరగతి గదిలోనున్న విద్యార్థుల దృష్టి బోధిస్తున్న ఉపాధ్యాయునిపై కూడా పడుతుంది. ఎందుకంటే ఉపాధ్యాయుని నడవడిక కూడా విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. కనుక తరగతి గదిలో చెప్పేదొకటి, బయట చేసేదొకటిగా ఉపాధ్యాయుడు ఉండకూడదు. ఖచ్చితమైన మనచేతన కలిగి ఉండాలి. అప్పుడే ఆ బోధన సహజసిద్ధంగా సహేతుకంగా ఉంటుంది. కాలానుగుణంగా సమాజం ఎటువంటి మార్పులనైనా తనకు అనుకూలంగా మార్చేసుకుంటుంది. ఈ విషయంలోని లాభ నష్టాలను విద్యార్థులకు తగురీతిలో చెప్పగలగాలి.

సమయపాలన టీచర్‌కే అవసరం!

సత్యమును పలుకుము, పెద్దలను గౌరవించుము వంటివి ఏకాలంలోనైనా ఉన్నతాంశాలే. అయితే వీటిని బోధించే ముందు ఒక క్రమశిక్షణాయుతమైన బాధ్యత ఉపాధ్యాయునికి తనపై తనకు ఉండాలి. సమయపాలన, స్వీయ క్రమశిక్షణ, పఠనం, జ్ఞానం, నిరంతరం రాయడం వంటివి ఉపాధ్యాయునిలో నాణ్యమైన గుణాలు పెంపొందింపజేసే అంశాలే. ఇవి ఉపాధ్యాయునికి నిత్యకృత్యం కావాలి. ఉపాధ్యాయునిలో ఇటువంటి సుగుణాలన్నింటినీ విద్యార్థులు గమనిస్తూనే ఉంటారు. ఉపాధ్యాయుడు ఖచ్చితమైన కాలానికి తరగతి గదిలో ఉంటే విద్యార్థులు అంతకన్నా ముందే ఉంటారు. ఇరువర్గాలు సమయపాలనను పాటిస్తే నాణ్యమైన విద్య విద్యార్థులకు తప్పక అందుతుంది. అల్లరి విద్యార్థులూ లేకపోరు, కానీ వారి శాతం చాలా తక్కువ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల లక్ష్య సాధనకు ఉపాధ్యాయుడు ఆసరా కావాలి.

వినాలి.. మాట్లాడాలి.. రాయించాలి!

ఉపాధ్యాయులు కొత్త కొత్త ఆలోచనలు కల్పించే విధంగా బోధన చేస్తూ విద్యార్థులలోని సృజనను బయటకు తీసి వాటిని వ్యాసాలుగా దిన, వార, పక్షపత్రికలకు పంపించడం ద్వారా వారిలో మరింత సృజనను విద్యార్థుల నుంచి బయటకు తీయుటకు దోహదం చేయవచ్చు. అలాగే ఉపాధ్యాయుడు కూడా తనలోని సృజనను వ్యాసాలు, స్టడీ మెటీరియల్ రూపంలో పత్రికలకు పంపుతూ తద్వారా ఎందరో విద్యార్థులకు ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల రచనలకు లేదా సృజనకు ఉపయోగపడే సోపానాలు విద్యార్థులు తరగతి గదిలో చెప్పే తరగతి సదస్సులు, విద్యార్థులు వివిధ సదస్సులలో పాల్గొనడం, విద్యార్థులు అతిథి ఉపన్యాసాలు వినటం, విద్యార్థులు వివిధ పోటీలలో పాల్గొనటం వంటివి విద్యార్థులలో క్రియాశీలకమైన కొత్త భావనాశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి.

క్రియాశీలతే టీచర్ ఔన్నత్యం!

ఏది ఏమైనా ఉపాధ్యాయుడు ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండాలి. తన వృత్తి పట్ల, వ్యవస్థ పట్ల, వ్యక్తిత్వం పట్ల విలువలతో కూడి ఉండాలి. ఉన్నత విద్యా సంస్థ ఇచ్చిన మార్గ దర్శకాలను అనుసరిస్తూనే విద్యార్థులకు పాఠ్య బోధన చేయాలి. అయితే ఉన్నతమైన ఆశయాలు, జీవితపు భరోసా, జీవన భద్రత కలిగించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి అవసరమైన నిపుణత ఉపాధ్యాయునికి అవసరం.

(నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)

- భమిడిపాటి గౌరీశంకర్

తెలుగు ఉపన్యాసకులు

94928 58395

Next Story