TAPS.. ఉద్యోగ భద్రతకు సరికొత్త మార్గం!

by Ravi |   (  Updated:2026-01-29 01:01:19  IST  )

ప్రభుత్వ ఉద్యోగం అంటే పదవీ విరమణ తర్వాత కూడా భద్రమైన జీవితం ఉంటుందనే నమ్మకం. ఆ నమ్మకానికి ప్రధాన ఆధారం పెన్షన్. కానీ 2004 తర్వాత అమలులోకి వచ్చిన కొత్త పెన్షన్ విధానం ఉద్యోగుల్లో అనిశ్చితిని పెంచింది. ఈ పరిస్థితుల్లో పాత పెన్షన్ విధానం, కొత్త విధానాలు అయిన UPS, తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన Tamil Nadu Assured Pension Scheme (TAPS) వంటి పథకాలు ఉద్యోగి భద్రతపై మళ్లీ చర్చకు దారితీశాయి.

TAPS.. ఉద్యోగ భద్రతకు సరికొత్త మార్గం!
X

ప్రభుత్వ ఉద్యోగం అంటే పదవీ విరమణ తర్వాత కూడా భద్రమైన జీవితం ఉంటుందనే నమ్మకం. ఆ నమ్మకానికి ప్రధాన ఆధారం పెన్షన్. కానీ 2004 తర్వాత అమలులోకి వచ్చిన కొత్త పెన్షన్ విధానం ఉద్యోగుల్లో అనిశ్చితిని పెంచింది. ఈ పరిస్థితుల్లో పాత పెన్షన్ విధానం, కొత్త విధానాలు అయిన UPS, తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన Tamil Nadu Assured Pension Scheme (TAPS) వంటి పథకాలు ఉద్యోగి భద్రతపై మళ్లీ చర్చకు దారితీశాయి.

పాత పెన్షన్ విధానం, మార్కెట్ ఆధారిత కొత్త పెన్షన్ విధానం మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నాలుగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, తమిళనాడు పెన్షన్ స్కీమ్ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ విధానాల మధ్య తేడాలను తులనాత్మకంగా విశ్లేషించడం అవసరం..

OPS (పాత పెన్షన్ విధానం)

ఈ విధానం 2004కు ముందు అమల్లో ఉంది. ఉద్యోగి ఎలాంటి చందా చెల్లించాల్సిన అవసరం లేదు. పదవీ విరమణ తర్వాత చివరి జీతంలో 50% + డీఏ పెన్షన్‌గా లభిస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెట్ ప్రభావం లేకుండా హామీ పెన్షన్ ఉంటుంది.

NPS (న్యూ పెన్షన్ సిస్టమ్)

ఇది 2004 ఏప్రిల్ 1 తర్వాత నియమితులైన వారికి వర్తిస్తుంది. ఉద్యోగి 10%, ప్రభుత్వం 14% చందా చెల్లిస్తాయి. నిధులు మార్కెట్ పెట్టుబడుల్లో ఉంటాయి కాబట్టి పెన్షన్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో 60% మొత్తం తీసుకోవచ్చు, 40% యాన్యుటీగా మార్చాలి. ఆ యాన్యుటీ ద్వారా ఉద్యోగికి నెలవారీ పెన్షన్ లభిస్తుంది.

UPS (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్)

OPS, NPS మధ్యస్థ విధానం. ఉద్యోగి 10%, ప్రభుత్వం 18.5% చందా ఇస్తుంది. కనీస సేవా కాలం పూర్తి చేసిన వారికి చివరి జీతంలో 50% పెన్షన్ లక్ష్యం. కొంత భద్రత ఉంటుంది కానీ పూర్తిగా మార్కెట్ ప్రభావం నుంచి విముక్తి కాదు..

TAPS తమిళనాడు పెన్షన్ విధానం..

ఇక TAPS (Tamil Nadu Assured Pension Scheme) అనేది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రత్యేకమైన పెన్షన్ విధానం. ఇది OPSలోని భద్రతను, UPS/NPS లోని చందా విధానాన్ని కలిపిన ఒక సమతుల్య ప్రయత్నంగా చెప్పవచ్చు. ఈ కొత్త పెన్షన్ విధానం ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిర్ధారిత (గ్యారంటీ) పెన్షన్ కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఇది పాత పెన్షన్ విధానానికి పూర్తిగా తిరిగి వెళ్లక పోయినా, ఉద్యోగుల భద్రతను కాపాడేలా ఒక మధ్య మార్గంగా రూపొందించబడింది. దీని ద్వారా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక అస్థిరతకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశం స్పష్టంగా కని పిస్తుంది. TAPS విధానం ప్రకారం, ఉద్యోగి తన జీతంలో నుంచి 10 శాతం మొత్తాన్ని పెన్షన్ నిధికి చందాగా చెల్లించాలి.. మిగతా బాధ్యతను తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటుంది. పదవీ విరమణ అనంతరం ఉద్యోగికి తన చివరి జీతంలో 50 శాతం + డీఏను పెన్షన్‌గా నిర్ధారించి అందిస్తారు. ఇది పూర్తిగా మార్కెట్ లాభనష్టాలపై ఆధారపడని విధానం కావడం వల్ల ఉద్యోగులలో విశ్వాసాన్ని పెంచుతుంది.

ఇతర రాష్ట్రాలు అనుసరించాలి!

అంతేకాదు, ఈ కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగుల సామాజిక భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యోగి మరణించిన సందర్భంలో అర్హులైన కుటుంబ సభ్యులకు సుమారు 60 శాతం ఫ్యామిలీ పెన్షన్ అందించడంతో పాటు, పదవీ విరమణ సమయంలో గరిష్టంగా ₹25 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించే హక్కును కొనసాగించారు. ఈ విధానం 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చి, ప్రస్తుతం CPS/NPSలో ఉన్న తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం గత రెండు దశాబ్దాలుగా జరిగిన ఉద్యోగ సంఘాల ఉద్యమాలకు ఇది ఒక సానుకూల ప్రతిస్పందనగా భావించవచ్చు. మొత్తం మీద, OPS పూర్తి భద్రతకు ప్రతీకగా ఉండగా, UPS ఉద్యోగి–ప్రభుత్వం మధ్య బాధ్యతను పంచే సమతుల్య మార్గంగా, TAPS ఉద్యోగుల భద్రతను కాపాడుతూ ప్రభుత్వంపై భారం నియంత్రించే వినూత్న రాష్ట్ర స్థాయి నమూనాగా నిలుస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానాల పరిణామంలో ఇది ఒక కీలక దశగా చెప్పవచ్చు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని TAPS వంటి మోడళ్లను అనుసరించాలి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానాల పరిణామంలో ఇది ఒక కీలక దశగా భావించవచ్చు.

-జుర్రు నారాయణ యాదవ్

తెలంగాణ టీచర్స్ యూనియన్

94940 19270

Next Story