తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్.. సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది?

by Ravi |   (  Updated:2025-04-09 01:00:19  IST  )

తమిళనాడుకు చెందిన పది బిల్లులకు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదం తెలపకుండా నిలిపివేసినందుకు తమిళనాడు గవర్నర్

తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్.. సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది?
X

తమిళనాడుకు చెందిన పది బిల్లులకు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదం తెలపకుండా నిలిపివేసినందుకు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. నెలల తరబడి రాజకీయ, చట్ట పరమైన తగాదాల తర్వాత వచ్చిన ఈ తీర్పును, గవర్నర్ అధికార పరిధిని, సరిహద్దులను స్పష్టంగా నిర్వచించడం ద్వారా భారతదేశ న్యాయ ప్రక్రియ చరిత్రలో ఒక ముఖ్యమైన తీర్పుగా అభివర్ణించవచ్చు.

తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే బదులు.. ఆ రాష్ట్ర గవర్నర్ రవి వాటిని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడంతో తమిళనాడులో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ చర్యను ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భావించి ఇది ఎన్నికైన అసెంబ్లీ ఇష్టంపై రాజ్యాంగ విరుద్ధమైన వీటో గా పరిగణించి, పరిష్కారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు నిన్న గవర్నర్ చర్యను ఖండించి పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులను ఆమోదించింది.

ఈ తీర్పు ఓ దీపస్తంభం

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం, రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్‌కి పంపినప్పుడు గవర్నర్‌ ఆ బిల్లుకు ఆమోదముద్ర వేయడం, ఆమోదించకపోవడం (పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం) రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం వంటి మూడు అధికారాలు కలిగి ఉంటారు. అయితే పునఃపరిశీలనకు పంపాక, ఆ బిల్లును మరోసారి సభ ఆమోదిస్తే.. గవర్నర్ సమ్మతితో దానిని నిలిపివేయలేరు. కానీ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. అదీ కూడా రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తేనే.. కానీ ఇక్కడ అలా జరగలేదు. తమిళ‌నాడు శాస‌న‌స‌భ పంపిన ప‌ది బిల్లుల‌ను గ‌వ‌ర్నర్ రిజ‌ర్వ్‌లో పెట్టుకున్నారు. ఇది అక్రమం.. పైగా న్యాయ వ్యతిరేక‌మైంది. గవర్నర్ తన రాజ్యాంగ అధికారాన్ని అతిక్రమించారు. పార్లమెంట‌రీ ప్రజాస్వామ్యంలో గ‌వ‌ర్నర్లు ఒక దూతగా పనిచేయాలి. ఓ స్నేహితుడిగా, మార్గద‌ర్శిగా, త‌త్వవేత్తగా ఉండాలి. అంతేకానీ గవర్నర్ రాజ‌కీయ ప్రేర‌ణ‌తో ప‌నిచేయ‌రాదు. రాజ్యాంగ విలువ‌ల్ని గ‌వ‌ర్నర్లు ర‌క్షించాలి. ఈ తీర్పు అన్ని రాష్ట్రాలకు ఉపశమనం కలిగించింది. గవర్నర్ అధికార పరిధిని అతిక్రమించకుండా రక్షణ కల్పించిన ఈ తీర్పును న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ తీర్పు భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో ఒక దీప స్తంభంగా నిలుస్తుంది. ఏ పదవి అయినా, అది ఎంత ఉన్నతమైనదైనా, రాజ్యాంగం కంటే ఉన్నతమైనది కాదని గుర్తు చేస్తుంది.

వివాదాల సృష్టికర్తలు గవర్నర్లే!

దేశంలో గవర్నర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి వివాదాలు తారాస్థాయికి చేరి విమర్శలు దాటి ధర్నాలు, రాస్తారోకోలు చేసుకునే వరకు కూడా వెళ్లాయి. పుదుచ్చేరిలో కిరణ్‌బేడి, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ వర్సెస్‌ అక్కడి గవర్నర్‌ మధ్య వివాదం గతంలో నిత్యకృత్యంలా మారింది. ఇలా గవర్నర్ల వరుస వివాదాల నేపథ్యంలో గతంలో ఓ మాజీ న్యాయమూర్తి గవర్నర్‌ పదవి అనవసరమైందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం ఏ మేరకు సమంజసమనేది ఆయన వాదన. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు గవర్నర్‌ వ్యవస్థ అవసరమా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ పదవిని ‘వృద్థాప్య గృహాలు’గా రాజకీయ పరిశీలకులు అభివర్ణించారు. కేంద్రంలో ప్రభు త్వం మారిన ప్రతిసారి రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చడం, ఇష్టానుసారంగా గవర్నర్ల మార్పుపై ఆజ్ఞాపించడం వంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్‌ వ్యవస్థే ఇబ్బందికరంగా మారింది.

గవర్నర్లనూ తొలగించాలి!

గవర్నర్‌ పదవి వివాదాస్పదం కాకూడదంటే.. కొన్ని మార్పులు తప్పనిసరి అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తిని కాకుండా ప్రజా పరిపాలన రంగంలో నిష్ణాతులైన వ్యక్తులను నియమించడం, గవర్నర్‌ని నియమించే ముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సలహా కోరడం, సమకాలీన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండని వ్యక్తిని నియమించాలని సూచించిన సర్కారియా, పూంచీ కమిషన్‌ సిఫార్సులను పాటించే విధంగా ఉంటే బాగుంటుంది. రాష్ట్రపతిని ఎలా అయితే తొలగించడానికి మహాభియోగ తీర్మానం ఉందో అలాంటి పద్ధతిని గవర్నర్‌ విషయంలో తీసుకురావడం చాలా అవసరం.

- శివ

94944 12385

Next Story