- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాస్త్రీయ సంప్రదాయానికి గజల్ మాధుర్యం..
భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో కొన్ని గొంతులు తమ కాలాన్ని సున్నితంగా స్పృశిస్తాయి. అవి గుండెల్లో మృదువుగా కదిలి మనసును నింపుతాయి. విషాదం కూడా ఒక సౌందర్యమే..

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో కొన్ని గొంతులు తమ కాలాన్ని సున్నితంగా స్పృశిస్తాయి. అవి గుండెల్లో మృదువుగా కదిలి మనసును నింపుతాయి. విషాదం కూడా ఒక సౌందర్యమే. నిశ్శబ్దం కూడా ఒక సంగీతమే అని హిందీ చలనచిత్ర సీమలో తనదయిన రహదారి ఏర్పరుచుకున్న తలత్ మహమూద్ పాటలు చెబుతాయి.
కొన్ని స్వరాలు శ్రోతల్ని కేవలం ఆకట్టుకోవు మనసుల్లోనే నివసిస్తాయి. అవి బిగ్గరగా పాడవు గుండెను తడిమి తడిపి అలా వెళ్లిపోతాయి. అలాంటి మృదువైన స్వరానుభూతి పేరే తలత్ మహ్మూద్. ఆయన గాత్రం ఒక నిశ్శబ్ద వేదన. ఒక సంస్కారబద్ధమైన ప్రేమ, ఒక నియంత్రిత ఆవేదన.
గజల్ అయనకు గానం కాదు..
1924 ఫిబ్రవరి 24న లక్నోలో జన్మించిన తలత్ మహ్మూద్ బాల్యం నుంచే ఉర్దూ సాహిత్య సుగంధంలో పెరిగాడు. లక్నో నగరానికి వున్న ప్రత్యేకమైన తహజీబ్ ఆ మృదుత్వం, ఆ సంస్కారంలోని గంభీరత ఆయన గాత్రంలో సహజంగా కలిసిపోయాయి. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందినప్పటికీ ఆయన మనసు గజల్ వైపు మొగ్గింది. యువకుడిగా ఉన్నప్పుడే హెచ్‌ఎమ్‌వీ సంస్థ కోసం గజల్‌లు రికార్డు చేసి రేడియో ద్వారా ప్రజాదరణ పొందాడు. గానం ఆయనకు కేవలం వృత్తి మాత్రమే కాలేదు. ఒక సాహిత్య అనుభూతి. ఆయన కేవలం సినిమాలకు పాటలు పాడలేదు ఒక నాగరికతను ఆలపించాడు. ఉర్దూ పదాల పలకడంలో అతని నాలుక పూలరేకుల్లా జారుకునేది. గజల్ అతనికి గానం కాదు ఒక మౌన ప్రార్థన.
వెండితెరపై కన్నీటికి స్వరం
కలకత్తా వీధుల్లో మొదలైన తలత్ సంగీత ప్రయాణం, హిందీ చిత్రసీమలో ఓ మృదువైన అలగా మెల్లి మెల్లిగా విస్తరించింది. బిమల్ రాయ్ సుజాత లో “జల్తే హై జిస్కే లియే” అని ఆయన ఆలపించినప్పుడు అది కేవలం ఒక ప్రేమ గీతం కానే కాదు ప్రేమను పలకలేని మనసుల తరఫున వచ్చిన నిట్టూర్పు. చాయాలో “ఇత్నా నా ముఝ్‌సే తు ప్యార్ బఢా” అంటే అది ఒక హెచ్చరిక కాదు ప్రేమకు పరిమితి ఉండాలనే ఆత్మగౌరవపు స్వరంలా ధ్వనించింది. సుప్రసిద్ధ నటుడు మెథడ్ ఆక్టింగ్‌కి ఆద్యుడు దిలీప్ కుమార్ వెండి తెరపై కన్నీరు పెట్టుకుంటే, ఆ కన్నీటికి స్వరంగా నిలిచి ధ్వనించింది తలత్ మహమూద్ గాత్రమే. సంగీత దర్శకులలో మదన్ మోహన్ వంటి సంగీత శిల్పులు అతని స్వరాన్ని ఒక వెండి తీగలాగా వాడారు.
గాత్రంలో కంపనం ఓ అంతర్మథనం
ఆయన గాత్రంలో ఒక సహజ కంపనం ఉంటుంది. అది ఆయనకు అలంకారం కాదు. అది ఒక అంతర్మథనం. ప్రతి పదం పలుకుతున్నప్పుడు అతని స్వరం స్వల్పంగా కంపిస్తుంది. అది గాయకుడిగా తలత్ బలహీనత కాదు భావోద్వేగంలో తనని తాను దాచుకోలేని స్థితి. తలత్ ది ఒకరకమయిన సిల్కీ స్వరం. నిజానికి తలత్ మహ్మూద్ భారతీయ సినీ సంగీత చరిత్రలో శాస్త్రీయ గాన సంప్రదాయాన్ని గజల్ మాధుర్యంతో కలిపి చలనచిత్ర రంగంలోకి తీసుకొచ్చారు. ఆయన గానం ‘మెహ్ఫిల్’ సంస్కృతిని వెండితెరకు చేర్చిన ఒక అందమయిన వంతెన అని చెప్పవచ్చు. గజల్ పట్ల నేటి తరానికి ఉన్న మమకారంలో కూడా ఆయన సున్నిత ప్రభావం కనిపిస్తుంది. జగ్జీత్ సింగ్ లాంటి గాయకులలో ఆయన స్వరానుభూతి ప్రతిధ్వనిస్తుంది.
గాయకులే నటులు..
హిందీ చిత్రసీమలో 1940ల చివర్లో 1950ల ప్రారం భంలో గాయకులు నటులుగా మారడం సాధారణ పరిణా మం. నటుడిగా నిలబడాలంటే గాత్రం ఉండాల్సిందే. దానికి ఆ సంప్రదాయానికి ముందడుగు వేసినవాడు సైగల్. అదే మార్గంలో తలత్ మహ్మూద్ కూడా కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆయన తెరపై కనిపించినప్పుడు, అతని వ్యక్తిత్వంలో గంభీరత, సంయమనం, ఒక సున్నితమైన విషాదం స్పష్టంగా కనిపించేది. గాత్రంలో ఉన్న ఆ కంపనం, ముఖకవళికల్లోనూ ప్రతిఫలించేది. అయితే ఆయన నటనలో హంగూ ఆర్భాటం ఉండేది కాదు. దాదాపు ఆయన వేసిన అన్ని పాత్రలు గంభీరంగా వుండి నిశ్శబ్దంగా బాధపడతాయి.
సంస్కార బద్ధమైన ప్రేమకు ప్రతిరూపం..
తలత్ మహ్మూద్ నటనను అర్థం చేసుకోవాలంటే, ముందుగా ఆయన గాత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన నటుడిగా మాట్లాడే తీరు కూడా గీతంలా మృదువుగా ఉండే ది. నాటకీయ సన్నివేశాలలో కూడా ఆయన పలికిన సంభాషణల్లో ఆవేశం కంటే ఆవేదన ఎక్కువగా కనిపించేది. రొమాంటిక్ పాత్రలు వేసినప్పుడు ఆయనలో ఒక సంస్కారబద్ధమైన ప్రేమ వ్యక్తమయ్యేది. అందుకే ఆయన నటించిన చిత్రాలు వాణిజ్యపరంగా పెద్ద విజయం సాధించలేదు. తలత్ తెరపై కనిపించిన ప్రతి సన్నివేశం ఒక సాహిత్య రేఖ లా అనిపించేది. వ్యాపార పరంగా తలత్ ఒక విఫల నటుడు.
గానం ఆయన అస్తిత్వం!
1950ల మధ్య నుంచి హిందీ చిత్ర సంగీత ప్రపంచం వేగంగా మారింది పాటల విస్తృత శ్రుతి, శక్తివంతమైన స్వరంతో సినీ సంగీతం ముందుకొచ్చింది.వేగం పెరిగింది. ఆ స్థితిలో తలత్ నటుడిగా కంటే గాయకుడిగానే నిలబడ్డాడు. అందుకే నటన ఆయనకు ఒక ప్రయోగం, గానం ఆయన అస్థిత్వంగా మారిపోయాయి. ఆయన 1998 మే 9న ఆయన ఈ లోకాన్ని విడిచినా, ఆయన స్వరం ఇప్పటికీ నిశ్శబ్దపు సంగీతపు మెట్లపై నడుస్తూనే ఉంది.
- వారాల ఆనంద్
94405 01281






