- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షేక్‌స్పియర్ ఇంట్లో టాగోర్ విగ్రహం. భారతీయుడిగా మనకెంత గర్వం!
నేడు రవీంద్రనాథ్ టాగోర్ జయంతి. ఆ విశ్వకవిని స్మరించుకుంటూ ఆయన సృజననీ, సృజనాత్మక జీవితాన్ని పలు విధాలుగా

నేడు రవీంద్రనాథ్ టాగోర్ జయంతి. ఆ విశ్వకవిని స్మరించుకుంటూ ఆయన సృజననీ, సృజనాత్మక జీవితాన్ని పలు విధాలుగా గుర్తు చేసుకోవడం చాలా సంతోషం కలిగించే కవితాత్మక విషయం. అది ఒక రకంగా ఉద్వేగంగా కూడా వుంది. టాగోర్ గురించి ఇటీవల తెలిసిన ఒక విషయం భారతీయుడిగా కవిగా ఎంతగానో గర్వాన్ని కూడా కలిగించింది.
షేక్‌స్పియర్ పుట్టిన ఊరిలో (స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్) షేక్‌స్పియర్ ఇంట్లో వారి ఇంటి తోట చివరి మూలల్లో ఒక మూలన, మెరిసిపోతూ రబీంద్రనాథ్ టాగోర్ విగ్రహం వుంది. అది తెలిసి పట్టలేనంత ఆనందం కలిగింది. గొప్ప భావోద్వేగానికి లోనయ్యాను. టాగోర్ విగ్రహం మీద రబీంద్రనాథ్ ఠాగూర్ – ‘కవి, చిత్రకారుడు, నాటక రచయిత, చింతనా పరుడు, బోధకుడు’ మరియు ‘భారతదేశపు స్వరం’. ఈ వాక్యాలు రాసారని చదివి ఓహ్ అనుకున్నాను. 1995లో షేక్‌స్పియర్ బర్త్ ప్లేస్ ట్రస్ట్‌కు సమర్పించిన ప్రతిమ ఇది.
టాగోర్ అంటే గీతాంజలే కాదు
‘గొప్ప కళ ముఖ్యంగా కవిత్వం వినోదం కాదు, అనుభవం’ అన్నాడు చలం. ఒక రచనను పాఠకుడు చదివి అర్థం చేసుకుని జీర్ణించుకుని తనలో సంలీనం చేసుకున్నప్పుడే ఆ కవితకు సార్థకత చేకూరుతుంది. అదే పనిని కవిగా టాగోర్ పరిపూర్ణంగా నిర్వహించాడు. టాగోర్ అనగానే అందరికీ గీతాంజలి గుర్తొస్తుంది. జనగణమన గీతం మనసులో మెదులుతుంది. అయితే టాగోర్ గీతాంజలితో పాటు, గార్డెనర్, స్ట్రే బర్డ్స్ లాంటివి అనేకం రాశారు. కేవలం కవిత్వమే కాదు తాను నవలలు, కథలు, వ్యాసాలూ, నాటకాలూ, పర్యాటక రచనలు, వేలాది పాటలూ రాశారు. డ్రాయింగ్, పెయింటింగ్, పిల్లల కోసం అనేక రచనలు చేశారు. ఆయన సృష్టించిన సంగీతం రబీంద్ర సంగీతంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. టాగోర్ రచనలు ఇంతకు ముందు చదివినవే అయినా మళ్ళీ చదవడం గొప్ప అనుభవం. ఒక కవిని, కవితని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. ఆ కవి కొత్తగా దర్శనమిస్తాడు. కవితా పంక్తుల మధ్య ఆ కవి మనతో సరికొత్తగా మాట్లాడతాడు. ఆ సృజన కారుడు మన ముందు ఒకింత లోతుగానూ మరింత విస్తృతంగా ఆవిష్కృతమవుతాడు. మనల్ని మనం తరచి చూసుకునేలా చేస్తాడు. టాగోర్‌ని మళ్ళీ మళ్ళీ చదవడం ఎవరికయినా సరికొత్త అనుభవమే. అది కూడా చలం అనువాదాల్లోనూ, గుల్జార్ అనుసృజనల్లోనూ దర్శించడం మరింత ఆనందాన్నిస్తుంది.
గుల్జార్ జీవితాన్నే మార్చిన 'గార్డెనర్'
ఒక రాత్రి టాగోర్ ‘గార్డెనర్’ చదవడంతో తన జీవితమే మారిపోయింది అంటాడు గుల్జార్. ఆయన టాగోర్‌ని అనువదించి అందించిన పుస్తకమే ‘GULZAR translates TAGORE… THE GARDENER’ (బాగ్ బాన్). బెంగాలీ తెలిసిన వాడు కనుక గుల్జార్ టాగోర్ మౌలిక రచనల్ని సేకరించి హిందీలోకి అనువదించాడు. మొత్తంగా పుస్తకం టాగోర్ రాసిన బెంగాలీ మూల కవితలు, టాగోర్ స్వయంగా ఇంగ్లీష్‌లోకి చేసిన అనువాదాలు, గుల్జార్ చేసిన హిందీ అనువాదాలతో కలిపి త్రిభాషా సంగమంగా వెలువడింది.
టాగోర్ పునర్దర్శనం
నాకు బెంగాలీ రాదు కాని టాగోర్‌ని ఇంగ్లీష్‌లో చదివి, తిరిగి హిందీలో గుల్జార్ ద్వారానూ, చలం ద్వారా తెలుగులోనూ చదివినప్పుడు మనిషి, మనసు, ప్రకృతి, మానవత్వం ఇట్లా అనేక కోణాల్లో అటు టాగోర్‌ని, చలాన్ని, గుల్జార్‌ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. చదువరికి తనను తాను, తనలోకి తాను తరచి, తరచి చూసుకునే అవకాశం లభిస్తుంది. టాగోర్‌ని తిరిగి దర్శించడం.. అదీ గొప్ప కవి గుల్జార్, గొప్ప రచయిత చలం అనే ప్రకాశవంతమైన టార్చ్ లైట్ వెలుగుల్లో చూడడం గొప్ప అనుభవం. టాగోర్ ప్రేమికులు గుల్జార్ అభిమానులు మొత్తంగా కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళంతా చదవాల్సిన పుస్తకం ‘ GULZAR translates TAGORE… THE GARDENER” (బాగ్ బాన్). అట్లే చలం చేసిన అనువాద కవిత్వం ‘గీతాంజలి’ అందులో గీతాంజలితో పాటు వనమాలి, ఫలసేకరణ, ఉత్తరణ, కాన్క, ఫ్యుజిటివ్, రుబాయీలు కూడా ఉన్నాయి. ఇంకా "నీ జీవితం కాలపు అంచులపై తేలికగా నర్తించాలి, ఆకు చివర నున్న మంచు బిందువులా’ అంటూ టాగోర్ ఆయన రాసిన Stray birds (దారి తప్పిన పక్షులు) లాంటి గ్రంధాల్ని చదవడమే టాగోర్ జయంతి సందర్భంగా ఆయనకు మనమిచ్చే నివాళి.
(నేడు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ 164వ జయంతి)
వారాల ఆనంద్
94405 01281
- Tags
- Shakespeare






