సర్వమతాలలో ఏకత్వ బోధకుడు..

by Ravi |   (  Updated:2025-01-11 18:55:10  IST  )

ఈ శరీరమేమైనమేమి జనులకు పదునైదువందల సంవత్సరముల పర్యంతం సరిపోవు సందేశము నొసగియున్నాను, సమస్త శక్తి మీలోనే వుంది.

సర్వమతాలలో ఏకత్వ బోధకుడు..
X

ఈ శరీరమేమైనమేమి జనులకు పదునైదువందల సంవత్సరముల పర్యంతం సరిపోవు సందేశము నొసగియున్నాను, సమస్త శక్తి మీలోనే వుంది. లేవండి.. మేల్కోండి..! మీ ఆశయం సిద్ధించే వరకు అవిశ్రాంతంగా పోరాడండి..! అంటూ నిద్రాణమైన బానిసత్వంలో వున్న మన దేశానికి, నేటి ఆధునిక యువతరానికి ప్రేరణ, అనంత ఉత్సాహాన్ని, వ్యక్తిత్వ వికాసపు పాఠాలను అందించి మన భారతీయ ప్రాచీన ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన భారతీయ ఆత్మ స్వామి వివేకానంద. ఎందరో మహానుభావులను ప్రభావితం చేసిన అనంత శక్తి స్వరూపం వివేకానంద.

భగవంతునితో ప్రత్యక్ష అనుభవం కావాలని..

కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించిన వివేకానంద వేదాంత, యోగ, తత్వశాస్త్రాలతో పాటు వివిధ మత గ్రంధాలు, విజ్ఞాన శాస్త్రంలోని నూతన పోకడలను సైతం అధ్యయనం చేసి, శోధించి, తన బోధనలతో సమాజంపై అత్యంత ప్రభావం చూపారు. ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచే పేదల పట్ల సేవాభావం, పెద్దల పట్ల వినయ విధేయత ప్రదర్శించేవారు. భగవంతునితో ప్రత్యక్ష అనుభవం కావాలని నిరంతరం తపించిన నరేంద్రుని జీవితంలో రామకృష్ణ పరమహంస రావడంతో ఎన్నో మలుపులు, చరిత్రలో మెరుపులు వచ్చాయి.

గురుబోధ చేసిన పరమహంస

మన దేశాన్ని ఆకలి, అజ్ఞానం నుంచి కాపాడి యావత్ ప్రపంచానికి వేలాది సంవత్సరాల మన సంస్కృతి సాంప్రదాయాలు, విభిన్న భాషలు, విభిన్న మతాల జీవన విధానాలలోని ఏకత్వాన్ని చాటి చెప్పాలనే గురుతర బాధ్యతను వివేకానందకు ఇచ్చారు. తన గురువు ఆశయాన్ని నిలబెట్టాలనే సంకల్పం బలంగా వున్న సందర్భంలోనే తన తండ్రి చనిపోయి కుటుంబం మొత్తాన్ని పేదరికం వరిం చింది. కుటుంబం కోసం కొన్నాళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఆ తరుణంలోనే రామకృష్ణ తన ఆధ్యాత్మిక శక్తులన్నింటిని వివేకానందకు ధారపోసి అస్తమించారు. తన గురువు చెప్పిన భారతీయ పునర్ వైభవం గురించి తన బోధనలతో దేశంలో ప్రభావితం చేశాక, మనం స్వాతంత్ర్యం సాధించాలని దేశ ప్రజలకు ఉద్భోదించి, ప్రపంచానికి చెప్పడానికి విరాళాలు స్వీకరించి ప్రపంచ సర్వమత సభలో ప్రసంగించడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే సభికుల నుంచి విశేష స్పందన లభించింది. మనలోని సోదరత్వపు మానవత్వానికి యావత్ ప్రపంచం సెల్యూట్ చేసింది. అలా తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించి స్వదేశానికి వచ్చాక 1897లో రామకృష్ణ మఠం స్థాపించారు. ఈ మఠం నేటికీ ఎన్నో సామాజిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. మన భారత ప్రభుత్వం 1985 నుంచి ప్రతి సంవత్సరం వివేకానందా జన్మదినమైన జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తుంది.

మానవాళికి సహాయం చేయండి!

ఆన్ లైన్ సాక్షిగా ఆధునికతతో పరుగులు పెడుతూ పర్యావరణం, మతాధిపత్యం, పేదరికం, యుద్ధ వాతావరణం వంటి పలు సమస్యలతో సతమతమవుతున్న నేటి ప్రపంచానికి వివేకానంద చెప్పిన సందేశాలే పరిష్కారాలు..సిద్ధాంతాలు, పిడివాదాలు, సాంప్రదాయాలు, దేవాలయాలు మున్నగు వాటి గురించి ఆలోచించకు. ఆధ్యాత్మిక శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను ఎంతోకొంత మంచి ఉంటుం ది. సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించండి. మానవాళికి సాయం చేయండి. ఆకలితో ఉన్నవాడికి వేదాంత బోధనలు ఎందుకు పట్టెడన్నం చాలు అంటారు వివేకానంద. అందుకే నేటి భారతం వివేకానంద వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆకలి చావులు లేని అభివృద్ధి భారతంలో నిర్మాతలమై యావత్ ప్రపంచానికి మన గొప్పతనాన్ని చాటి చెబుదాం. విశ్వగురువుగా రామకృష్ణ, వివేకానంద శిష్యులుగా మన పునర్ వైభవాన్ని శతకోటి తారల తళుకుల మధ్య సగర్వంగా మన జాతీయ త్రివర్ణ పతాకపు స్ఫూర్తినందిద్దాం.

(నేడు జాతీయ యువజన దినోత్సవం)

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story