- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్క కాటుకి తీర్పు దెబ్బ
సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్న వీధి కుక్కల్ని తరలించి రక్షిత కేంద్రాల్లో ఉంచాలని తీర్పునిచ్చింది. వీధి కుక్కల బారిన పడి గాయాల

సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్న వీధి కుక్కల్ని తరలించి రక్షిత కేంద్రాల్లో ఉంచాలని తీర్పునిచ్చింది. వీధి కుక్కల బారిన పడి గాయాల పాలైన, ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఈ విధంగా ఆదేశాలిచ్చింది. అయితే ఈ తీర్పు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నా, కారణాలు పరిశీలిస్తే ధర్మాగ్రహమే అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇది ఢిల్లీకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దేశమంతా ఎదుర్కొంటున్నదే. ఈ తీర్పు వచ్చిన వారంలోనే నాలుగైదు కుక్క కాట్లు, ఒక మరణం సంభవించిన వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క రాజధాని నగరంలోనే అవి పది లక్షలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రేబీస్ మరణాల్లో 37 శాతం భారత్‌లోనే. ఇవి నమోదైన లెక్కలు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో జరిగి, రికార్డ్ కానివి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. మనిషికి నేస్తమైన కుక్క, వాటి జనాభా, ఆరోగ్యం విషయా ల్లో నిర్వహణా లోపం వల్ల శత్రువుగా పరిణమిస్తోంది. అదుపు లేని స్థితికి, ప్రజారోగ్యానికి సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటోంది. అయితే వీటి జనాభా, ఆరోగ్యం అన్నవి రాష్ట్ర పరిధిలోని అంశాలు.. ముఖ్యంగా స్థానిక సంస్థల పాత్ర అధికం. కేంద్రం చట్టాల్ని, కొంత నిధుల సాయాన్ని చేయగలదు. ఒక ప్రాంతంలో ఉన్న వాటిలో డెబ్భై శాతం వాటిని పట్టి, జనాభా నియంత్రణ శస్త్ర చికిత్స చేసి, టీకా వేసి ఆ ప్రాంతంలోనే విడిచి పెట్టాలి. ఈ ప్రక్రియ కరెక్ట్‌గా నిర్వహిస్తే చాలు కానీ కింది స్థాయిలో సిబ్బంది కొరత, అలసత్వం, నిధుల లేమితో అలా జరగడం లేదు. ప్రస్తుతం కేంద్రం జంతు సంరక్షణ బోర్డు ద్వారా నిధులు విడుదల చేస్తానని రాష్ట్రాలకు తెలియపరిచింది. ఇందుకు రాష్ట్రాలు కూడా సమగ్ర కార్యాచరణ చేపట్టి, స్థానిక వనరులు, సౌకర్యాలు చేకూర్చి సమస్య పరిష్కారం వైపు ఆలోచించాలి. వీధి కుక్కల కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు నెలకొల్పడం ఆచరణ సాధ్యం కానీ విషయం. శాస్త్రీయంగా రుజువైన మార్గాల ద్వారా వాటి జనాభాను అదుపులో ఉంచడం, ఆరోగ్యాన్ని కాపాడడం అవసరం. విలువైన మానవ ప్రాణాలు వీధి కుక్కల పాలు కాకూడదు. వీధి కుక్కల్ని సమూలంగా తుడిచిపెట్టేయడం కూడా మానవత్వం కాదు. మచ్చికయిన జంతువుతో సమాజానికి సహాయం జరగాలా? సమస్య రావాలా అన్నది మనిషి చేతిలోనే ఉంది.
డా.డి.వి.జి. శంకరరావు,
94408 36931






