మతమార్పిడి ముఠాలకు ఈ తీర్పు చెంపపెట్టు!

by Ravi |   (  Updated:2026-04-29 00:46:19  IST  )

మత మార్పిడి చేసిన తరువాత ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణలు లభిస్తాయా? లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ తీర్పు రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ విధానం మరియు సామాజిక న్యాయం అంశాలపై కొత్త చర్చను రేపుతోంది.

మతమార్పిడి ముఠాలకు ఈ తీర్పు చెంపపెట్టు!
X

హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ప్రభుత్వ పరంగా లభించే ప్రత్యేక సౌకర్యాలు అందవని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన చింతాడ ఆనంద్ అనే ఓ పాస్టర్ క్రైస్తవ ప్రచారం చేస్తుంటే హిందూ సంఘాల వ్యక్తులు నిలదీయడంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడం, ఈ విషయంపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగి, క్రైస్తవ మతం పుచ్చుకొని, పాస్టర్‌గా కొనసాగే చింతాడ ఆనంద్‌కు ఈ చట్టం కింద రక్షణ పొందే వెసులు బాటు లేదని రాష్ట్ర హైకోర్టు పేర్కొనడం, దీనిపై సుప్రీంకోర్టుకు అపీల్‌కు వెళ్లడం సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించడం ఇందులోని పర్యవసానం.

ఇలాంటి వారికి ఈ తీర్పు ఇబ్బందే!

తప్పుడు కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం వరకు తీసుకువెళ్లడం వెనుక అంతర్జాతీయ క్రైస్తవ ముఠాల వ్యూహాత్మక ప్రయత్నం ఉందనేది దాచలేని విషయం. అందుకే వారికి ఈ తీర్పు నచ్చకపోవచ్చు.. తాము ఇంతకాలం సాగిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట పడుతుందనే భయం పుట్టుకు రావడం, ఈ తీర్పుపై అడ్డదిడ్డంగా మాట్లాడడం ఈ సంఘాల్లో పని చేసేవారి వంతైంది. హిందూ సమాజాన్ని క్రైస్తవీకరించితేనే తమ లక్ష్యం నెరవేరుతుందని భ్రమించే దళిత సంఘాల నాయకులకు, అంబేద్కరిస్టులం అని బ్యానర్ వేసుకున్న వాళ్లకి ఈ తీర్పు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు.

మతం మారితే హిందూ వ్యతిరేకతే..!

ఈ దేశంలో హిందువు మతం మారితే, దేశానికి వ్యతిరేకమైన ఆలో చనలతో ఈ దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువులతో ఘర్షణ పడడం కొనసాగిస్తాడు. ఈ కోణంలో ఆలోచిస్తే హిందువులు మతం మారడం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో అర్థం అవుతుంది. ఇక హిందూ వ్యతిరేక హిందువులు, హిందుత్వాన్ని నిరంతరం దూషించే కమ్యూనిస్టులు ఈ మతమార్పిడి ముఠాలకు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందిస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపధ్యాన్ని అర్థం చేసుకుంటేనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశం అర్థం అవుతుంది.

వ్యూహాత్మక మతమార్పిడులు..

హిందూ సమాజంలో భాగంగా ఉండి, వివక్షకు గురై, అభివృద్ధికి దూరంగా ఉన్న నిమ్న కులాల వారికి ప్రభుత్వ పరంగా 'ప్రత్యేక సౌకర్యాలు' (రిజర్వేషన్లు) స్వతంత్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హిందూ సమాజం స్వాగతించింది. వాస్తవంగా హిందూ విలువలతో జీవించే నిమ్న వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఫలాలను హిందూ సమాజానికి బద్ధ వ్యతిరేకులైన క్రైస్తవులు వ్యూహాత్మకంగా హిందువులమని సర్టిఫికెట్లు తీసుకొని, హిందూ సమాజం ఇచ్చిన రిజర్వేషన్లను అనుభవిస్తూ దర్జాగా క్రైస్తవులుగా కొన సాగడం ఒక వైచిత్రి.

రెడ్లు, కమ్మలు, కాపులకు 'అంటు' ఉందా?

హిందూమతంలోని అంటరానితనం వల్లనే కొన్ని వర్గాల వారు క్రైస్తవం స్వీకరిస్తున్నారని కొంతమంది దళిత ముసుగు వేసుకున్న క్రైస్తవ నాయకులు చేసే వాదనల్లో పస లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో రెడ్లు, కోస్తా జిల్లాల్లో కమ్మలు, కాపులు, కొన్ని బీసీ కులాల వాళ్ళు క్రైస్త వీకరించబడడం వాస్తవం కాదా? ఏ వివక్ష వల్ల వీరు మతం మారినట్లు? హిందూమతంలో వివక్ష ఉందని, క్రైస్తవ మతంలో సమానత్వం ఉందని అబద్ధాలు ప్రచారం చేసి, క్రైస్తవ మతంలో కొనసాగే వారికి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కావాలని కోరడంలో అర్థం ఉందా? క్రైస్తవం పుచ్చుకొని, హిందూమతంలో ఉన్నానని చెప్పుకొని రాజ్యాంగాన్ని, తాను నమ్మే జీసస్‌ను మోసం చేయడం ఎంతవరకు సబబో దళిత సంఘాలను నడిపే క్రైస్తవ నాయకులు చెప్పాలి. ఇక రాజ్యాంగంలో పేర్కొన్న మత స్వేచ్ఛను తెలియజేసే 25వ నిబంధనను ఈ దేశంలో క్రైస్తవులు దుర్వినియోగం చేస్తున్నారనేది అక్షర సత్యం.

- ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Next Story