కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు.. సామాజిక న్యాయానికి చారిత్రాత్మక అడుగు

by Ravi |   (  Updated:2026-05-23 00:31:02  IST  )

దేశవ్యాప్తంగా కులగణనకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం బీసీల సామాజిక న్యాయ పోరాటంలో కీలక మలుపు. జనాభా ప్రాతిపదికన అవకాశాలు, సంక్షేమ పథకాల అమలుకు ఈ తీర్పు ఎలా దోహదపడనుందో విశ్లేషణ.

కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు.. సామాజిక న్యాయానికి చారిత్రాత్మక అడుగు
X

దేశవ్యాప్తంగా కులగణనకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లను కొట్టివేసి, బీసీల జనాభా లెక్కలు సేకరించడాన్ని సామాజిక కోణంలో ఆలోచించి నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కులాల వారీ గణాంకాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేయడం, బీసీల కోసం పోరాడుతున్న నాయకుల సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఫలం. ముఖ్యంగా బీసీల హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యమాలకు ఈ తీర్పు నూతన బలాన్ని ఇచ్చింది. భారతదేశంలో బీసీలు జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ, వారి నిజమైన సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేశాయి. 1931 తర్వాత కులగణన జరగకపోవడం వల్ల బీసీల అసలు జనాభా, వారి వెనుకబాటుతనం, అభివృద్ధి స్థాయిలపై స్పష్టత లేకుండా పోయింది. ఈ పరిస్థితి కారణంగానే సంక్షేమ పథకాల అమలులో అసమానతలు చోటుచేసుకున్నాయి. జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం, అవకాశాలు బీసీలకు అందలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఈ చారిత్రాత్మక అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చే దిశగా కీలక అడుగు. కులగణన ద్వారా ఏ వర్గం ఎంత వెనుకబడి ఉందో ప్రభుత్వాలకు స్పష్టమైన సమాచారం లభిస్తుంది. దాని ఆధారంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక సహాయం వంటి అంశాల్లో సముచిత అవకాశాలు కల్పించవచ్చు. కొంతమంది కులగణన దేశాన్ని విభజిస్తుందని విమర్శిస్తున్నా, వాస్తవానికి కులగణన విభజన కోసం కాదు.. సమానత్వం కోసం. సమస్యలను దాచిపెట్టడం కాదు, వాటిని గుర్తించి పరిష్కరించడం ప్రజా స్వామ్య బాధ్యత. బీసీలు ఎన్నో దశాబ్దాలుగా విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అన్యాయానికి గురవుతున్న వాస్తవాన్ని గుర్తించకుండా సామాజిక న్యాయం ఎలా సాధ్యం అవుతుంది? డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బీపీ మండల్ వంటి మహనీయులు ఆశించిన సామాజిక సమానత్వానికి కులగణన ఒక బలమైన ఆయుధం. ఈ తీర్పుతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా కులగణన నిర్వహించి, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు కల్పించాలి. ఉద్యోగాల ఎంపికలో క్రీమి లేయర్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్ స్థానాలను పెంచాలని బీసీ శ్రేణులు కోరుతున్నాయి.

- బూర్గుపల్లి కృష్ణ యాదవ్

బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు,

98661 70384

Next Story