ఈ తీర్పు కోదండరాం రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బ!

by Ravi |   (  Updated:2025-08-16 01:01:21  IST  )

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో సమానంగా వినిపించిన పేరు కోదండరాం. ఆ సమయంలో ఈయన ఏ పిలుపునిచ్చినా

ఈ తీర్పు కోదండరాం రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బ!
X

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో సమానంగా వినిపించిన పేరు కోదండరాం. ఆ సమయంలో ఈయన ఏ పిలుపునిచ్చినా తెలంగాణ వాదులు తండోపతండాలుగా తరలి వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచేవారు. రాజనీతి ప్రొఫెసర్‌గా ఆయన ఎంతో మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆద ర్శంగా నిలిచిన వ్యక్తి. ఉద్యమ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే రాష్ట్రం ఏర్పడినా కోదండరాం తన ఉద్యమ పంథా వీడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో కేసీఆర్ కోదండరామ్‌ను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కోదండరాం 2018 లో తెలంగాణ జనసమితి పేరుతో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లో కేసీఆర్ స్పందిస్తూ 'కొంతమంది తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటారు' అని కామెంట్‌ చేశారు. దీనిపై చాలా మంది కేసీఆర్‌పై విరుచుకుపడినా.. ఆయన పార్టీ పెట్టిన తర్వాతా తెలంగాణ జన సమితి బలం ఏమిటో తేలిపోయింది.

కేసీఆర్‌ను విభేదించి..

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలా అనేక అంశాల్లో కేసీఆర్‌ ప్రభుత్వంతో విభేదించి కాంగ్రెస్‌కు కోదండరాం దగ్గరయ్యారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో, అధికారంలోకి రాగానే.. కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం కేసీఆర్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ కేబినెట్‌ చేసిన తీర్మానాన్ని అప్పటి గవర్నర్‌ తమిళ సై తిరస్కరించిన ఉంచిన స్థానం. దీనిపై రాజకీయ కొర్రీలు పెట్టి వారి నియామకాలను అడ్డుకున్నారని బీఆర్‌ఎస్‌ గవర్నర్‌నే తీవ్రంగా విమర్శించింది.

కోర్టులో పెండింగులో ఉండగానే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల పేర్లను సిఫార్సు చేసింది. దానిని గవర్నర్ ఆమోదించడంతో వారు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే వీళ్ల నియామకంపై నియామకాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రావణ్‌, కుర్రా సత్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే రేవంత్‌ ప్రభుత్వం వారిచే హడావుడిగా ప్రమాణ స్వీకారం చేయించిం ది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారాన్ని తప్పుపడుతూ తీర్పు చెప్పింది. శాసనమండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది.

ప్రశ్నించడం మర్చిపోతే ఎలా?

ఎమ్మెల్సీ అయిన సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని, ఎమ్మెల్సీగా ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్ష ల మేరకు పనిచేస్తానని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా ఎందుకు మాట్లాడటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల నియామకాల విషయంలో కోదండరాం ఏమీ మాట్లాడపోవడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు.

జనాకాంక్షల కోసమే పని చేయాలి!

ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చై‌ర్మన్‌గా ఉన్న కోదండరాంకు తెలంగాణలో ఎంతో గౌరవం దక్కింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైనా అంత ప్రభావం చూపలేకపోతున్నారు. దానికి తోడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బగానే భావించాలి.పొలిటికల్‌ సైన్స్‌ బోధించిన ఆచార్యుడు రాజకీయ చదరంగంలో పావుగా మారారు. ఇకనైనా ఆయన రాజకీయంగా జాగ్రత్తగా అడుగు వేయాలి. స్వతంత్రంగా ఉండి ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలి. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం కొట్లాడాలని జనం కోరుకుంటున్నారు.

- ఆసరి రాజు,

80966 77042

Next Story