తెలుగు సినిమా సాహస యుగానికి ప్రతీక

by Ravi |   (  Updated:2026-05-30 00:46:08  IST  )

తెలుగు సినీ పరిశ్రమలో సాహసాలకు, సాంకేతిక ప్రయోగాలకు ప్రతీకగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాలు, సినీ ప్రయాణం, ఆయన తెలుగు సినిమాకు అందించిన చిరస్మరణీయ సేవలపై ప్రత్యేక కథనం.

తెలుగు సినిమా సాహస యుగానికి ప్రతీక
X

తెలుగు సినీ చరిత్రలో ఎందరో మహానటులు వచ్చారు.. తమ నటనతో, వ్యక్తిత్వంతో, క్రమశిక్షణతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ కొందరు మాత్రమే ఒక యుగాన్ని సృష్టిస్తారు. అలాంటి అరుదైన మహానటుల్లో అగ్రగామిగా నిలిచిన వ్యక్తి ఘట్టమనేని కృష్ణ “సూపర్ స్టార్” అనే బిరుదు కేవలం అభిమానులు ఇచ్చిన పేరు మాత్రమే కాదు. తెలుగు సినిమా రంగంలో ఆయన సాధించిన అపూర్వ విజయాలకు, చూపించిన సాహ సాలకు, తెచ్చిన సాంకేతిక విప్లవాలకు లభించిన గౌరవప్రదమైన గుర్తింపు..

తనకంటూ ప్రత్యేకమైన శైలి..

సినీరంగంలో అవకాశాల కోసం చేసిన ఆయన చేసిన పోరాటం సాధారణం కాదు. ఎన్నో నిరాశలు, తిరస్కారాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చివరకు 1965లో వచ్చిన “తేనెమనసులు” చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా విజయంతో కొత్త హీరోగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కృష్ణ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఆ కాలంలో అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన శైలిని నిర్మించుకోవడంలో విజయవంతమయ్యారు. సాహసోపేత కథలు, వేగవంతమైన నటన, స్టైలిష్ ప్రెజెంటేషన్ ద్వారా యువతలో అపారమైన అభిమానాన్ని సంపాదించారు.

తెలుగు సినిమాలో ప్రయోగాల రారాజు

తెలుగు సినీ పరిశ్రమలో ‘ప్రయోగాల రాజు’ అనే పేరు ఆయనకే సరిపోతుంది. కొత్త కథలు, కొత్త టెక్నాలజీ, కొత్త మేకింగ్ స్టైల్.. ఇలా ఏ విషయంలోనైనా ముందడుగు వేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకా‌డలేదు. 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయనకు సినీరంగం అనే ప్రపంచం చాలా దూరంగా కనిపించినా, తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. విద్యార్థి దశలోనే నాటకాలపై ఆసక్తి పెంచుకొని నటనలో తన ప్రతిభ మెరుగుపరుచుకున్నారు.

దేశంలోనే తొలి కౌబాయ్ హీరో..

తెలుగు తెరపై తొలి కౌబాయ్ సినిమాగా గుర్తింపు పొందిన “మోసగాళ్ళకు మోసగాడు” ద్వారా ఆయన సృష్టించిన సంచలనం ఇప్పటికీ సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. ఆ చిత్రం కేవలం వాణిజ్య విజయమే కాదు. తెలుగు సినిమా కూడా హాలీవుడ్ తరహా సాహస చిత్రాలు చేయగలదని నిరూపించింది. అలాగే జేమ్స్ బాండ్ శైలిలో వచ్చిన “గూఢచారి 116” తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. స్పై థ్రిల్లర్, కౌబాయ్ సినిమాలకు ఆయన కొత్త దారి చూపించారు. యాక్షన్, స్టైల్, సస్పెన్స్ కలగలిపిన ఆ తరహా చిత్రాలు అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తవి. సాంకేతిక రంగంలో కూడా ఆయన సేవలు అపారమైనవి. తొలి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం, తొలి 70 ఎంఎం చిత్రం వంటి ఎన్నో కొత్త ప్రయోగాలకు ఆయన నాయకత్వం వహించారు..

నిరాడంబర సూపర్ హీరో..

ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో సాధారణ విజయాలు కావు. కుటుంబ కథలు, యాక్షన్ సినిమాలు, సామాజిక కథలు, చారిత్రక చిత్రాలు, జానపదాలు ఇలా ఏ జానర్ అయినా ఆయన సునాయాసంగా నటించారు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకొని వారికి కావాల్సిన వినోదాన్ని అందించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన చిత్రాలు కుటుంబ ప్రేక్షకుల నుంచి యువత వరకు అందరినీ ఆకట్టుకునేవి. ఆయనకు అభిమానులతో ఉన్న బంధం అసాధారణం. స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆయనలో ఎప్పుడూ అహంకారం కనిపించలేదు. అభిమానులను కుటుంబ సభ్యుల్లా భావించేవారు. వారి ప్రేమను ఆయన ఎంతో గౌరవించేవారు. ఈ రోజు కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పటికీ టెలివిజన్‌లో ప్రసారమైతే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. తెలుగు సినిమా సాహసయుగానికి కృష్ణ ప్రతీక. కొత్తదనాన్ని ప్రేమించిన నటుడు. ప్రేక్షకుల కోసం బతికిన కళాకారుడు. కష్టాన్ని నమ్మిన మహానుభావుడు. ఆయన జీవితం ప్రతి కళాకారుడికి ఒక పాఠం చెబుతుంది. “ధైర్యంగా కొత్త మార్గం ఎంచుకుంటే చరిత్ర మన పేరును గుర్తుంచుకుంటుంది.”

(మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా)

- ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Next Story