ఇల్లాలి ఆత్మహత్య! ఎవరిదీ బాధ్యత?

by Disha edit |
ఇల్లాలి ఆత్మహత్య! ఎవరిదీ బాధ్యత?
X

ప్రస్తుత పరిస్థితులలో మహిళలకు సొంత సంపాదన లేకపోవడంతో సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతున్నది. అంతేకాకుండా వాళ్లు తమకు తాము ప్రాధాన్యం ఇచ్చుకోలేకపోతున్నారు. మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడడం వలన వారు తమ డిప్రెషన్, ఆందోళనను తగ్గించుకోవడానికి, వివిధ మానసిక, ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీని వలన కూడా ఆత్మహత్యల శాతం పెరిగిపోతున్నట్లు సైకియాట్రిస్టులు చెబుతున్నారు.

రకట్న వేధింపులు, కుటుంబ వివాదాలు, వివాహ సమస్యలు, గృహహింస కారణమేదైనా ఇల్లాలు ఆత్మస్థయిర్యం కోల్పోతోంది. బలవన్మరణాన్ని ఆశ్రయిస్తోంది. ప్రతి 25 నిమిషాలకు ఒక గృహిణి ఆత్మహత్య చేసుకుంటోంది. ఇది సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. 'నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో' ఇటీవల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే మహిళలలో దాదాపు 40 శాతం మంది భారతీయులే. ఇటీవల ప్రచురించిన లాన్సెట్ అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

గృహిణుల ఆత్మహత్యలకు కారణాలు ఏమిటో తెలుసుకుంటూనే, వాటి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎన్‌సీ‌ఆర్‌బీ ప్రకారం భారతదేశంలో 2020లో 1,53,052 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. వీరిలో 14.6 శాతం మంది అంటే 22,372 మంది గృహిణులే ఉన్నారు. ఈ లెక్కన సగటున రోజుకు 61 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ప్రతి 25 నిమిషాలకు ఒక ఇల్లాలు ప్రాణాలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. 1997 నుంచి ఏటా 20 వేల మంది గృహిణులు ఆత్మహత్య చేసుకుంటుండగా, 2009 నుంచి ఆ సంఖ్య 25 వేలకు పెరిగింది.

ఆ మూడు కారణాలే

సాధారణంగా ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉంటాయి, గృహిణుల ఆత్మహత్యలకు ప్రధానంగా మూడు కారణాలు మనకు కనిపిస్తాయి. మొదటిది గృహహింస. 30 శాతం మంది మహిళలు గృహహింస కు గురవుతున్నారు. పెళ్లి తర్వాత ఇంటి చాకిరీ చేస్తూ అణచివేతకు గురవుతూ, అత్తవారింటిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గృహహింస వలన మహిళల మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. గృహహింసను ఎదుర్కొన్న మహిళలలో ఆత్మహత్య ఆలోచనలు మూడు రెట్లు అధికంగా ఉంటాయని 2012లో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది. కోవిడ్ సమయంలో గృహ హింస కేసులు మరింతగా పెరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలలో మూడు వంతుల మంది గృహహింసకు గురైనట్లు ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. రెండో ప్రధాన కారణం వరకట్నం. గృహిణుల ఆత్మహత్యలలో సగానికి పైగా వరకట్న వేధింపులతోనే జరుగుతున్నాయి. 1930 కంటే ముందు దేశంలో జరిగిన వివాహాలలో కేవలం 40 శాతం మాత్రమే వరకట్న వ్యవహారాలు ఉండగా, 2000 తర్వాత ఈ సంఖ్య 90 శాతానికి చేరుకుంది. వరకట్న వేధింపులతో మహిళలు తిరిగి తల్లి ఇంటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, సమాజం, కట్టుబాట్లు అంటూ మళ్లీ వారిని అత్తారింటినే ఉండాలని బలవంతం చేయడంతో ఆత్మహత్య ఆలోచనలు పెరిగిపోతున్నాయని తెలుస్తోంది. మూడో ప్రధాన కారణం ఆర్థికంగా పూర్తిస్థాయిలో భర్తలపై ఆధారపడి ఉండడం. దీని వలన నిరాశ, నిస్సహాయత, డిప్రెషన్ పెరిగిపోతుంది. దీనితోపాటు ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన కూడా పెరిగిపోతుంది

ఎక్కువ సమయం వాటికోసం

ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. ఏటేటా ఇది ఇంకా తగ్గుతూనే ఉంది. 'ఇంటి పనులలో బిజీగా ఉండడం వలన బయట పనులు చేయలేమని, ఇంటి పనులు చేయడానికి ఇతరులు కూడా ఎవరూ సిద్ధంగా కూడా ఉండరు' అంటూ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 64 శాతం మహిళలు అభిప్రాయపడ్డారు. అంటే శ్రామికశక్తిలో వారి భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెల్లింపులే లేని ఇంటి పని కోసం ప్రతి మహిళ ప్రతి రోజు ఐదు గంటలు తన సమయాన్ని కేటాయిస్తుంది.

ఇంకా ప్రతి రోజు రెండున్నర గంటలు పిల్లలు, భర్త సంరక్షణ సేవలకు సమయాన్ని ఇస్తుంది. మహిళలతో పోల్చుకుంటే మగవారు వీటికి కేటాయించే సమయం గంటన్నర మాత్రమే. ప్రస్తుత పరిస్థితులలో మహిళలకు సొంత సంపాదన లేకపోవడంతో సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతున్నది. అంతేకాకుండా వాళ్లు తమకు తాము ప్రాధాన్యం ఇచ్చుకోలేకపోతున్నారు. మహిళలు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడడం వలన వారు తమ డిప్రెషన్, ఆందోళనను తగ్గించుకోవడానికి, వివిధ మానసిక, ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీని వలన కూడా ఆత్మహత్యల శాతం పెరిగిపోతున్నట్లు సైకియాట్రిస్టులు చెబుతున్నారు.

నివారణ మార్గాలు ఇవి

గృహిణుల ఆత్మహత్యలను తగ్గించడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది, మహిళలను మానసిక, ఆరోగ్య సమస్యల నుంచి, డిప్రెషన్ నుంచి కోలుకునేలా చేయడం. ప్రభుత్వం మానసిక సమస్యలను నివారించే దిశగా ప్రయత్నాలు చేయాలి. దీని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వడం ద్వారా కూడా సమస్యను కొంతమేర పరిష్కరించుకునే అవకాశముంది. దీని కోసం మహిళల ఉపాధి పై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. పురుషులు, మహిళల మనస్తత్వాలు, ఆలోచన విధానాలలో కూడా మార్పు తీసుకురావాలి.

2018లో ఆక్స్ ఫామ్ ఇండియా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో ఓ సర్వే నిర్వహించింది. పిల్లల సంరక్షణ బాధ్యతలను సరిగా నిర్వహించకపోతే మహిళలను కొట్టడం ఆమోదయోగ్యమేనని 33 శాతం మంది చెప్పారు. కుటుంబానికి చెందిన పురుషులకు సరైన ఆహారాన్ని అందించకపోతే కొట్టవచ్చని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీని ద్వారా మనం ప్రజల ఆలోచనా విధానాన్ని అంచనా వేయవచ్చు. ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేసి వరకట్నాన్ని పూర్తిగా రూపుమాపగలిగినా, పురుషులు తమ సామాజిక నిబంధనలను కొనసాగించడానికి ఏదో ఒక మార్గాన్ని కచ్చితంగా వెతికి పట్టుకుంటారు. మహిళలు, గృహిణుల ఆత్మహత్యలను నివారించాలంటే ప్రజల వైఖరిలో, ముఖ్యంగా మగవారి వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తే ఫలితం వస్తుంది.

ఫిరోజ్‌ఖాన్

జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు

96404 66464


Next Story

Most Viewed