కామన్ మ్యాన్ డైరీ: బతుకు పయ్య గాడి తప్పలే ఉద్యోగం ఊడిన ప్రవేటు ఉద్యోగి కథ

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ: బతుకు పయ్య గాడి తప్పలే ఉద్యోగం ఊడిన ప్రవేటు ఉద్యోగి కథ
X

బారెడు పొద్దెక్కింది. నులక మంచం మీద నిద్రిస్తున్న పరమేశ్​ఇంకా నిద్ర లేవలేదు. ఇంట్లోవాళ్లంతా ఎవరి పనిలో వాళ్లు బిజీబిజీగా ఉన్నారు. స్కూలుకు వెళ్లేందుకు పిల్లలు రెడీ అవుతున్నారు. ఆ సంవత్సరమే ఎల్‌కేజీలో జాయిన్ అయిన క్రిష్ బడికి వెళ్లనంటూ మారాం చేస్తున్నాడు. స్కూల్ డ్రెస్ వేసుకోవడం లేదు. తల్లిని నానా ఇబ్బంది పెడుతున్నాడు. డ్రెస్ వేసే ప్రయత్నం చేస్తే ఏడుపు అరుపుగా మారుతున్నది.

పరమేశ్​తండ్రి బాలయ్య పొలం పనికి బయల్దేరుతున్నాడు. 'మామయ్య ఆగు, వీన్ని జెర స్కూలు కాడ వదిలెయి' అన్నది శాంతి. 'వాడు నాకు ఇంటడానమ్మా, వాన్ని లేపు అంటూ కొడుకు పరమేశును చూపిస్తూ వెళ్లిపోయాడు బాలయ్య. 'ఓ అయ్యా జెర లేసి పిలగాన్ని స్కూలుకు పంపిస్తవా' అంటూ పరమేశ్​దుప్పటిని లాగింది శాంతి. గాఢనిద్రలో ఉన్న పరమేశు కళ్లు నలుసుకుంటూ లేచి కూర్చున్నాడు. 'పోత ఆగు, జెర' అంటూ చేద బావి వద్దకు నడిచాడు. ముఖం మీద నీళ్లు చల్లుకొన్నాడు. ఏడుస్తున్న క్రిష్ చేయి పట్టుకున్నాడు. ఏడుపును పెంచేశాడు క్రిష్. బలవంతంగా లాక్కెళ్లి స్కూల్లో అప్పగించాడు పరమేశ్.

*

పరమేశ్​డిగ్రీ వరకు చదువుకున్నాడు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. నెలకు 25 వేల జీతం వచ్చేది. భార్యాపిల్లలను ఊళ్లోనే ఉంచాడు. తను హాస్టల్‌లో ఉండేవాడు. వారం వారం సొంతూరుకు వచ్చి పోతుండేవాడు. పరమేశ్​పనిచేస్తున్న కంపెనీ హఠాత్తుగా సీనియర్లను తొలగించి రూ.15 వేల జీతంతో జూనియర్లను నియమించుకున్నది. ఆ సంస్థ ఖర్చులు తగ్గించుకొనేందుకు ఈ పద్ధతిని అవలంబించింది.

అంతకు ముందురోజే పరమేశ్‌కు కంపెనీ యాజమాన్యం సెటిల్‌మెంట్ చేసింది. నెల జీతం అదనంగా ఇచ్చి ఇంటికి పంపింది. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు పరమేశ్. ఎప్పటిలాగే శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఆదివారం గడిచిపోయింది. తండ్రికి ఏం చెప్పాలో తెలియడం లేదు. సోమవారం ఉదయం పది దాటింది. పరమేశ్ సిటీకి వెళ్లేందుకు రెడీ కావడం లేదు. 'అగో ఈ రోజు సెలవు పెట్టినవా' అని అడిగింది శాంతి. ఔనన్నట్టు తలూపాడు పరమేశ్. 'ఎందుకు, ఏదన్నా ఫంక్షన్ ఉంటే సెలవులు దొర్కయ్ అంటవు, మీ ఆఫీసుల బాగనే ఇచ్చిండ్రు సెలవు' అంటూ వంటింటి వైపు వడివడిగా నడిచింది శాంతి.

*

పరమేశ్ తల్లి యాదమ్మ యేడాది క్రితం క్యాన్సర్‌తో మరణించింది. హైదరాబాద్‌లో ఉంటున్న పరమేశ్ ఆమె ఆలనా పాలనా చూసుకునేందుకు రెండేళ్ల క్రితమే సొంతూరుకు మారాడు. ట్రైన్‌లో ఆఫీసుకు వెళ్లొచ్చేవాడు. అత్తయ్య బాగోగులు శాంతి చూసుకునేది. ఆమె వైద్యానికి, అంత్యక్రియలకు చేసిన అప్పులు చిట్టీలు కడుతూ తీర్చేస్తున్నాడు పరమేశ్. ఇంకో లక్ష రూపాయల బాకీ ఉంది. అంతలోనే ఉద్యోగం పోయింది. ఊళ్లో ఉన్న పొలంలో మెట్ట పంటలు తప్ప ఏమీ పండవు. నీటి వసతి కూడా లేదు.

వానొస్తేనే పంట. లేదంటే బీడే! అది కూడా మక్క, పత్తి ఈ రెండు మాత్రమే. ఉద్యోగం పోయిందని బాకీలవాళ్లు వచ్చి ఇబ్బంది పెడ్తరేమో? ఇంట్లోనే ఉంటే ఇంట్లోవాళ్లకి డౌట్ వస్తుంది. గొడవలు స్టార్టయి అమ్మలక్కల చెవిలో పడిందా? ఇక ప్రచారమే అవసరం లేదంటూ మదనపడుతున్నాడు. తండ్రికి విషయం చెబుదామంటే ఆయన మనసు నొచ్చుకుంటుంది. ఫ్రెండ్స్ సాయం చేయడం మాట అటుంచితే, నలుగురికి చెబుతారేమోనన్న బాధ. ఎవరికీ చెప్పలేక సంఘర్షణకు లోనవుతున్నాడు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయమే ఇంటి నుంచి సిటీ బాట పట్టాడు.

*

తనతో పాటు ఉద్యోగం కోల్పోయిన మిత్రులకు ఫోన్లు చేశాడు పరమేశ్. వాళ్లు ఏవేవో ఉద్యోగాలు వెతుక్కున్నారు. తానూ ట్రై చేయాలనుకున్నాడు. ఆఫీసుల వెంట తిరిగాడు. సాయంత్రం అయ్యింది. ఐదు రోజులలో హాస్టల్ ఖాళీ చేయాలి. లేకుంటే అక్కడ ఐదు వేలు సమర్పించుకోవాలి. రాత్రి నిద్ర రాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నాడు. తన పక్క బెడ్ మీద ఉండే కిషోర్ రాత్రి రెండు గంటలకు హాస్టల్ చేరాడు. 'ఏం అన్నా ఇంకా పడుకోలేదా? అడిగాడు.

'లేదు తమ్మీ, నిద్ర రావడం లేదు' అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు. ఎక్కడైనా జాబ్ ఉంటే చూడవా?' అంటూ బతిమాలాడు. 'అన్నా మా దగ్గర మార్కెటింగ్ ఉద్యోగాలే ఉంటాయి. మీరేమో అకౌంటెంట్ ఉద్యోగం చేశారు. నలుగురిని నమ్మించాలి. వారికి అరచేతిలో స్వర్గం చూపించాలి' అంటూ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ గురించి చెప్పాడు కిషోర్. జీతం తక్కువే అయినా ఇన్సెంటివ్స్ బాగుంటాయి అన్నాడు. 'రేపొక సారి నా వెంట రా అన్నా, అన్ని విషయాలూ తెలుస్తాయి' అన్నాడు.

*

మరుసటి రోజు ఉదయమే కిషోర్‌తో వెళ్లాడు పరమేశ్. పది మందితో మాట్లాడితే ఒకరిద్దరూ ప్లాట్ తీసుకొనేందుకు సమ్మతి తెలుపుతున్నారు. రాత్రి 12 గంటల వరకు ఇలానే సాగింది. ఒక్కొక్కరి దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఇది తనతోటి కాదనుకున్నాడు పరమేశ్. 'తమ్ముడూ నాతో కాదు' అని కిషోర్‌కు చెప్పేశాడు. 'నేను కార్ కొనుక్కున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నా యాక్టివా బండి వాడుకో. అంటే ర్యాపిడో, ఓలా, ఉబేర్‌తో కనెక్ట్ అవ్వు. కనీసం రోజుకు ఐదు వందలైతే సంపాదించగలవన్నా. నీకు ఉద్యోగం దొరికే వరకు పార్ట్ టైం ఇలా పనిచేసుకో' అన్నాడు కిషోర్.

సరేనంటూ తలాడించాడు. కిషోరే దగ్గరుండి ప్రాసెస్ కంప్లీట్ చేశాడు. పరమేశ్ ర్యాపిడో కెప్టెన్‌గా అవతారం ఎత్తాడు. మొదటి రోజు పెట్రోలు ఖర్చులు పోను ఏడు వందలు మిగిలాయి. ఇదేదో బాగానే ఉందనుకున్నాడు. అలాగే కంటిన్యూ అయిపోతున్నాడు. తొమ్మిది నెలలలో బాకీలు తీర్చేశాడు. ఏడాది తిరిగే సరికి కొత్త బైక్ కొన్నాడు. కిషోర్ యాక్టివాను తిరిగి ఇచ్చేశాడు. ఊరివాళ్లు చూస్తారేమో అన్న బిడియం కొంత ఉంది. ఫుల్‌గా హెల్మెట్ పెట్టి కవర్ చేసేస్తున్నాడు.

ఎంఎస్ఎన్ చారి

79950 47580


Next Story

Most Viewed