రైతుల త్యాగానికి చట్టబద్ధ గౌరవం.. ఆంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాది!

by Ravi |   (  Updated:2026-04-10 01:01:04  IST  )

అమరావతికి చట్టబద్ధ హోదా లభించడం ద్వారా రైతుల త్యాగాలకు గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ఈ నిర్ణయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీలకంగా మారనుంది.

రైతుల త్యాగానికి చట్టబద్ధ గౌరవం.. ఆంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాది!
X

జయహో అమరావతి, ఇది కేవలం రాజధానికి జయగానం కాదు.. ఇది ప్రజల విశ్వాసానికి, రైతుల త్యాగానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఇచ్చే గొప్ప గౌరవ వందనం.శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం మన అమరావతి. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల రాజధానిపై నిన్నటి వరకు కమ్ముకున్న అనిశ్చితి మేఘాలను తొలగిస్తూ భారత పార్లమెంటు వేదికగా నవ్యాంధ్ర తలరాతను మార్చే అడుగు పడింది.

అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టబద్ద బిల్లు, కేవలం ఒక ప్రాంతం అభి వృద్ధికి సంబంధించింది కాదు, ఒక జాతి ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు దక్కిన రాజ్యాంగ బద్ధమైన విజయం.

ఇదో గౌరవప్రదమైన గుర్తింపు..

అమరావతి కేవలం భవనాల నిర్మాణం కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశయం. పార్లమెంట్ సాక్షిగా దక్కిన చట్ట బద్ద గుర్తింపు. గతం వైభవం, వర్తమాన పోరాటం, భవిష్యత్తు విజయం అన్న విధంగా అమరావతి వెలుగు లీనబోతోంది. తమ భూములను స్వచ్ఛందంగా ధారపోసిన రాజధాని రైతుల పోరాటం ప్రపంచ చరిత్రలోనే అరుదైనది. రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో అనిశ్చితులు, రాజకీయ వాదోపవాదాల మధ్య నిలిచిన అమరావతి రాజధాని అంశం ఇప్పుడు దేశ చట్టబద్ధతను పొందడం అయిదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు, రైతుల త్యాగాలకు, భవిష్యత్ తరాల ఆశయాలకు ఒక గౌరవప్రదమైన గుర్తింపు అని చెప్పాలి.

ప్రజారాజధానికి నాంది

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మొదటి ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసి కృష్ణా నది తీరాన, గుంటూరు-విజయవాడ మధ్యలో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మించాలని తీసుకొన్న నిర్ణయానికి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూములు ఇచ్చి ల్యాండ్ పూలింగ్ అనే వినూత్న నమూనాతో ప్రభుత్వానికి అండగా నిలిచారు.. వారి త్యాగం వల్లే అమ రావతి కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ప్రజా రాజధానిగా నిలిచింది. కానీ తర్వాత ప్రభుత్వం మార్పు కారణంగా అమరావతి నిర్మాణం మధ్యలోనే నిలిపివేసి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి మూడు ముక్కలాట ఆడి రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించారు..

చట్టబద్ధతతో రాజధానికి స్థిరత్వం

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత కల్పించడం, రాష్ట్ర భవిష్యత్తును స్పష్టంగా నిర్వహించే కీలక మలుపు. ఈ చట్టబద్ధతతో అమరావతి రాజధానికి స్థిరత్వం లభిస్తుంది. ప్రభుత్వాలు మారినా రాజధాని మారదు. పార్లమెంటులో చట్టం తర్వాత, రాజధాని మార్పు అనేది అంత సులభం కాదు. ఇది రాష్ట్ర ప్రగతికి ఒక స్థిరమైన పునాది కూడా. విభజన తర్వాత లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా అమరావతి నిలుస్తుంది. శక్తివంతమైన ఆర్థిక శక్తిగా అమరావతి సాంస్కృతిక వైభవం, ఆధునిక సాంకేతికత, పర్యావరణ సౌహార్దం కలగలిపిన ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే చంద్రబాబు కల ఇప్పుడు సాకారం కాబోతుంది. పార్లమెంట్ చట్ట బద్ద ముద్రతో అమరావతి మరింత బలంగా, మరింత న్యాయబద్ధంగా, మరింత ప్రజాస్వామ్యంగా నిలవబోతోంది. గతంలో కుదిరిన ఒప్పందాలు, సింగపూర్ వంటి దేశాల సహకారం మళ్లీ పట్టాలెక్కితే, దక్షిణ భారతదేశంలోనే అమరావతి అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా నిలవనున్నది. రాష్ట్రం మధ్యలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అందరికీ అందుబాటులో సమాన దూరంలో ఉండే సమతుల్య రాజధాని ఇది. ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందడానికి అమరావతి కేంద్ర బిందువుగా మారనున్నది.

భావోద్వేగం కాదు చరిత్రకు సాక్షి కూడా..

చారిత్రక ప్రాధాన్యత ఉన్న అమరావతి పేరుతో ఆధునిక నగరాన్ని నిర్మించడం ఒక గొప్ప అవకాశం. బౌద్ధ సంస్కృతి , శాతవాహనుల చరిత్ర ఉన్న నేలపై, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించే ఫ్యూచర్ సిటీ అమరావతి. ఈ చారిత్రాత్మక సందర్భంలో జయహో అమరావతి అనే నినాదం ఇప్పుడు ఒక భావోద్వేగం మాత్రమే కాదు, చరిత్రను సాక్షిగా చెప్పుకొనే విజయం కూడా. ప్రభుత్వాలు మారినా, రాజధాని నిర్మాణ ప్రక్రియకు, విధానపరమైన నిర్ణయాలకు ఆటంకం కలగకుండా చట్టపరమైన రక్షణ కల్పించడం, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేట్ పెట్టుబడిదారులు ముందుకు రావాలంటే, ఆ ప్రాజెక్టుకు పటిష్టమైన చట్టపరమైన పునాది ఉండటం అత్యవసరం. ఏది ఏమైనా రాజధాని అమరావతికి చట్టబద్ధమైన హోదాను కల్పించడం ద్వారా, ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడమే కాకుండా, రాబోయే తరాలకు ఒక సుస్థిరమైన, ఆధునిక మహానగరాన్ని అందించే దిశగా అడుగులు వెయ్యడం అభినందనీయం.

- నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story