- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికుడి శ్రమకు గణాంకాల మేకప్..
వర్క్ ఇండియా’ వేతన నివేదికలో చూపిస్తున్న గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలేమిటి? బ్లూ కాలర్ కార్మికుల వేతనాలు, పెరుగుతున్న జీవన వ్యయం, కార్మిక చట్టాల మార్పులు, కార్పొరేట్ దోపిడీపై విశ్లేషణాత్మక కథనం.

ఈ రోజుల్లో ఆధునిక దోపిడీ స్వరూపాలు మారాయి. దేశాలను సైన్యాలతో ఆక్రమించే కాలం పోయి, మనుషుల శ్రమను, వారి గౌరవ ప్రదమైన జీవనాన్ని నేరుగా లూటీ చేసే కాలం వచ్చింది. ఈ దోపిడీని మెరుగు పరచడానికి కార్పొరేట్ శక్తులు ఉపయో గించే తాజా ఆయుధం రంగురంగుల గణాంకాల ఛార్టుల నివేదికలు. వాటిలో ఒకటి ‘వర్క్ ఇండియా’ వేతన నివేదిక.
దీన్ని పైపైన మాత్రమే చూస్తే భారతదేశంలోని బ్లూ కాలర్ కార్మికులు గాలిలో తేలియాడుతున్నట్టు, వారి జీవితాలు స్వర్ణయుగంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవం చూస్తే ఇది దశాబ్దాలుగా కార్మికులు రక్తం చిందించి సాధించుకున్న హక్కులపై జరుగుతున్న క్రూరమైన దాడిగానే అర్థమవుతుంది.
ఆదాయం పెరిగినట్టా?
ఈ నివేదిక ప్రకారం, 2024లో సగటు వేతనం నెలకు 14,056 రూపాయలు ఉంటే, 2025లో ఎనిమిది శాతం పెరిగి 15,265 రూపాయలకు చేరిందని. ఇది వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ వృద్ధి సాధించినట్లు ప్రచారం చేస్తున్నారు. డెలివరీ, డ్రైవింగ్, తయారీ రంగాల్లో కొంత ఎక్కువ ఆదాయం పెరిగినట్టు చూపిస్తున్నారు. ఈ సంఖ్యలు పేపర్ మీద మాత్రమే అద్భుతంగా కనిపిస్తాయి. కానీ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరగడమే కాకుండా, అద్దెలు, విద్యుత్ బిల్లులు, రవాణా ఖర్చులు 10-20% పెరిగాయి. అధికారిక ద్రవ్యోల్బణం సగటున 3-5% మధ్య ఉన్నప్పటికీ, కార్మికుల రోజువారీ జీవన వ్యయం దానికంటే చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటప్పుడు రెండు వేల రూపాయల పెరుగుదలతో కుటుంబం పోషణ ఎలా సాధ్యం? ఇది కడుపు నింపడం కాదు, అప్పుల ఊబిలో ముంచేయడం. జాతీయ కార్మిక వేతన కమిషన్లు, కేంద్ర ప్రభుత్వం సెమీ-స్కిల్డ్ కార్మికులకు రోజుకు 868 రూపాయలు (నెలకు సుమారు 22,500 రూపాయలు) కనీస వేతనంగా నిర్ణయించాయి. కానీ నివే దికలో చూపించిన 15,265 రూపాయలు దానికి బాగా తక్కువ. అనేక చోట్ల ఇది కూడా అమలు కావడం లేదు.
కార్మికుల ఐక్యతను చీల్చే కుట్ర..
ఇక్కడ గౌరవప్రదమైన జీవనం అంటే ఏమిటి? మానవుడు తన కుటుంబంతో ఆనందంగా, గౌరవంగా జీవించగలగడం. కానీ ప్రస్తుత వేతనాలు ఆ హక్కును కాలరాస్తున్నాయి. వైట్ కాలర్ ఉద్యోగులకు భత్యాలు, ఉద్యోగ భద్రత ఉంటాయి. వారు ఏసీ గదుల్లో పని చేస్తారు. కానీ బ్లూ కాలర్ కార్మికులు ఎండలో కాలి, వర్షంలో తడిచి, అగ్ని గుండాల్లో కరిగి, రసాయనాల మధ్య ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తారు. వారికి దక్కేది కేవలం కనీస వేతనం మాత్రమే. ఈ రెండు వర్గాలను కలిపి పోల్చి ‘బ్లూ కాలర్ వారి వేతనాలు ఎక్కువగా పెరుగుతున్నాయి’ అని చెప్పడం పచ్చి అబద్ధం. ఇది కార్మికుల మధ్య విభేదాలు సృష్టించి, వారి మధ్య ఉన్న ఐక్యతను చీల్చి, అసలు దోపిడీదారుడిని రక్షించే కుట్ర. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక పాత వ్యూహం ఉంది.. బాధితులను ఒకరిపై ఒకరిని పోట్లాడేలా చేయడం. ఇప్పుడు అదే జరుగుతోంది. కార్మికులను ఒకరి నొకరు సందేహించేలా చేసి, యాజమాన్యాల లాభాలను కాపాడుతున్నారు. ఇంకొక భయంకరమైన విషయం ఏమిటంటే పాత కార్మిక చట్టాల సవరణ. శతాబ్దాల కష్టాలతో, అనేక పోరాటాలతో సాధించుకున్న 29 చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి, ‘వ్యాపారాలకు సౌకర్యం’ పేరుతో యాజమాన్యాలకు అనుకూలంగా మలిచారు. ఒప్పంద కార్మికులను సులభంగా నియమించడం, తొలగించడం, సమ్మె హక్కుపై పరిమితులు.. ఇవన్నీ శ్రమ దోపిడీని చట్టబద్ధం చేస్తాయి. లాభాలు కార్పొరేట్ ఖాతాల్లోకి, నష్టాలు కార్మికుల నెత్తిన. ఇక అంతర్జాతీయ సంక్షోభాలను సైతం వేతనాలు అదుపులో ఉంచడానికి సాకుగా వాడుకుంటున్నారు.
వేతనాలు ఇలా నిర్ణయించాలి!
నిజమైన అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. ప్రతి కార్మికుడి జీవితం గౌరవప్రదంగా ఉండాలి. దేశంలో అనధికారిక రంగం ఇప్పటికీ 80-90% ఉంది. అక్కడ భద్రత, సామాజిక రక్షణ లేవు. మహిళా కార్మికుల వేతనాలు మరింత తక్కువగా ఉండటం మరో విషాదం. అందుకే నివేదికల అంకెల మాయను గుర్తించాలి. బ్లూ కాలర్, వైట్ కాలర్ భేదాలు మరచి అందరూ ఐక్యంగా నిలబడాలి. కార్మిక సంఘాలు బలపడాలి. కనీస వేతనాలు నిజమైన జీవన వ్యయానికి అనుగుణంగా నిర్ణయించాలి. కార్మిక చట్టాలను కార్మికులకు అనుకూలంగా సవరించాలి. ప్రభుత్వాలు కార్పొరేట్ లాబీలకు కాకుండా శ్రామికుల హక్కులను కాపాడాలి. ఇది కేవలం జీతభత్యాల సమస్య మాత్రమే కాదు. ఇది శ్రామిక వర్గం మనుగడకు, కార్పొరేట్ దోపిడీకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ విషయాన్ని గుర్తించి, ఐక్యంగా పోరాడితేనే గెలుపు సాధ్యం.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్






