మోడీ వ్యతిరేకులు ఓడారా లేక గెలిచారా?

by velandi.Saikiran |

కుటుంబ నియంత్రణ విషయంలో ఆరోగ్య శాఖ హిందువుల దగ్గరికి వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై ఒత్తిడి తెస్తుంది.

మోడీ వ్యతిరేకులు ఓడారా లేక గెలిచారా?
X

చట్టసభల్లో 33% సీట్లు మహిళలకు రిజర్వు చేయడానికి ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును లోక్‌సభలో గట్టెక్కించుకోవడానికి ప్రధాని మోదీ శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి సహకరించిన వారి పేర్లతో ధన్యవాదాల పోస్టర్లను ప్రభుత్వమే ముద్రిస్తుందని, ఈ బిల్లు క్రెడిట్ తామే తీసుకోవచ్చని లోక్‌సభ ప్రతిపక్ష సభ్యులకు ఒక ఆఫర్ కూడా ఆయన ఇచ్చారు. మోడీ మనుగడే గిట్టని ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ తమ పార్టీ లోక్‌సభ ఎంపీలకు సరైన మార్గ నిర్దేశం చేసి ఓటింగ్‌కు తీసుకొచ్చారు.

ఈ బిల్లు వీగిపోవడానికి మోడీ వ్యతిరేక పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేశాయి. ఈ విషయంలో ప్రతిపక్షాల పట్టుదలను శ్లాఘించవలసిందే. తమ పట్టుదలతో ప్రజాస్వామ్యం బతికిందని, రాజ్యాంగం రక్షించబడిందని ప్రతిపక్షాల నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. వాస్తవంగా ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని ఓడించాయి. ప్రతిపక్ష నాయకులు మోడీపై వ్యతిరేకతతో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తిలోదకాలు ఇవ్వడం రాజ్యాంగ పరిరక్షణ అవుతుందా

మహిళా బిల్లుకు 30 ఏళ్లు..

ఇక వాస్తవ విషయానికి వస్తే, ఈ రాజ్యాంగ సవరణకు తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా డీలిమిటేషన్ బిల్లుతో కలిపి లోక్సభలో ప్రవేశపెట్టడం ద్వారా మోదీ అమిత్ షాల రాజకీయ చతురత స్పష్టమైంది. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే ఒక ప్రయోజనం. ఓడిపోతే మరొక ప్రయోజనం మోడీ ప్రభుత్వానికి ఒనగూడుతుందనేది కాదనలేని సత్యం. మహిళా రిజర్వేషన్ల చట్టానికి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేకం అనే భావం చదువుకున్న మహిళలపై కొంత ప్రభావం చూపుతుందనడంలో అవాస్తవికత లేదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల ఆలోచన విధానంపై దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రను ఒకసారి పరిశీలిస్తే- 1996లో నాటి ప్రధానమంత్రి దేవగౌడ నాయకత్వంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ చట్టం వల్ల అగ్రకుల మహిళలు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికౌతారని, లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఈ బిల్లును అడ్డుకున్నారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో మూడుసార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చూసినా కాంగ్రెస్ పార్టీ మోకాలు వడ్డడంతో వీలు కాలేదు. చివరికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ బిల్లుపై రాజ్యసభ ఆమోదాన్ని తీసుకున్నా, లోక్‌సభ ఆమోదించలేదు.

బీజేపీ, లెఫ్ట్ ఆలోచన ఒక్కటే.. కానీ..!

రాజకీయాలను పక్కనపెట్టి మాట్లాడితే.. మహిళల సాధికారత విషయంలో బిజెపి, వామపక్ష పార్టీల నాయకుల ఆలోచన ఒకే విధంగా ఉంది. కానీ రాజకీయపరంగా ఇవి రెండు శత్రుపక్షాలు. సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే, మహిళా రిజర్వేషన్ చట్టం ఎప్పుడో అమలులోకి వచ్చేది. షాబానో కేసు విషయంలో, ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళల ప్రయోజనాలకు ఎలా గండి కొట్టిందో తెలిసిందే.

రాజ్యాంగంలోనే డీలిమిటేషన్ నిబంధనలు

ఇక డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల వాదనను కాంగ్రెస్ పార్టీ సమర్థించడం, ఆ పార్టీ నైతిక పతనానికి పరాకాష్టగా భావించాలి. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు నిర్ణయించబడాలని రాజ్యాంగంలో నిబంధనలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద పనిచేసిన రాజ్యాంగ నిర్మాతలే అనే వాస్తవాన్ని మరువకూడదు. ఉత్తరాది రాష్ట్రాల వారికి పార్లమెంటు సీట్లు పెరిగితే, దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం ఉంటుందని కొంతమంది రాజకీయ నాయకులు చేసే వాదన పసలేనిది. ఢిల్లీకి 7 పార్లమెంటు సీట్లు, హైదరాబాదుకు మాత్రం రెండు పార్లమెంట్ సీట్లే. ఇవి రెండు మహానగరాలే. ఇందులో వ్యత్యాసం ఎందుకు ఇక ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో ఎమ్మెల్యే సీట్లు తక్కువ కోస్తాలో ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ. ఈ విధమైన వ్యత్యాసాల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది అని ఎవరైనా వాదించగలరా జనాభాను తగ్గించుకున్నందుకు దక్షిణాది రాష్ట్రాలకు 'పనిష్మెంట్'అన్యాయం, ద్రోహం వంటి మాటలను దక్షిణాదిలో కొందరు నాయకులు ఉపయోగిస్తూ ఉత్తర, దక్షిణాది ప్రాంతీయ బేధాలను సృష్టించే ప్రయత్నం చేయడం క్షంతవ్యం కాదు.

నేతలకు తప్ప మరే ప్రయోజనం లేదు

కుటుంబ నియంత్రణ విషయంలో ఆరోగ్య శాఖ హిందువుల దగ్గరికి వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై ఒత్తిడి తెస్తుంది. ఇస్లాం సమాజంపై ఆ ఒత్తిడి ఉండదు. కుటుంబ నియంత్రణను పాటించాను కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా సౌకర్యాలు కావాలని ఎవరైనా కోరుతారా దక్షిణాది రాష్ట్రాల నాయకుల వాదన ఈ కోవలోకి వస్తుంది. లోకసభ సీట్లు పెరిగితే అన్ని రాజకీయ పార్టీలు ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి. వాస్తవంగా డీ లిమిటేషన్ ప్రక్రియ వల్ల రాజకీయ నాయకులకు తప్ప దేశ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు. కోటాను కోట్లు ప్రజల కష్టార్జితమైన పన్నుల నుండి పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, వినోదాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రజల ఆలనా పాలన చూడటానికి స్థానిక సంస్థల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండనే ఉన్నాయి. లోక్సభ సీట్ల పెంపుపై అనవసర రాద్దాంతం, రచ్చ, చర్చ ఎందుకు ఈ కోణంలో ఈ దేశ హితాన్ని కోరే ప్రజలు ఆలోచిస్తే, రాజకీయ నాయకులకు కొంతైనా జ్ఞానోదయం అవుతుందేమో! దేనికైనా కాలం కలిసి రావాలి!

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Next Story