తెలుగు సినిమా అడుగులు ఎటువైపు?

by velandi.Saikiran |

గత వారం హైదరాబాద్ వేదికగా ఒక ఆసక్తికరమైన, అంతర్లీనంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన సంఘటన జరిగింది.

తెలుగు సినిమా అడుగులు ఎటువైపు?
X

గత వారం హైదరాబాద్ వేదికగా ఒక ఆసక్తికరమైన, అంతర్లీనంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన సంఘటన జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, మరియు నటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పైకి ఇది సాధారణ మర్యాదపూర్వక భేటీగా కనిపించినా, ప్రస్తుత దేశ రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో దీనిని అలా చూడలేం. ఇది కేవలం ఒక కుశల ప్రశ్నల సమావేశం కాదు; తెలుగు గడ్డపై సినిమా మాధ్యమం ద్వారా ఒక బలమైన 'హిందుత్వ' భావజాల వ్యాప్తికి జరుగుతున్న ముందస్తు కసరత్తుగా దీనిని అనుమానించక తప్పదు. సినిమాను ఆరాధించే, హీరోలను దైవంగా భావించే తెలుగు యువత నాడిని పట్టుకోవడానికి ఈ భేటీ ఒక శ్రీకారం లాంటిది.

చరిత్రకారుల హెచ్చరికలు

ప్రముఖ చరిత్రకారిణి. రొమిలా థాపర్ వాదించినట్లుగా, చరిత్రలో జరుగుతున్న ఈ కాషాయీకరణ అకడమిక్ అవసరం కాదు, అదొక పొలిటికల్ ప్రాజెక్ట్. చారిత్రక ఆధారాల స్థానంలో పురాణాలను ప్రవేశపెడుతూ, గతాన్ని వర్తమాన రాజకీయ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. రామచంద్ర గుహ ప్రకారం, ఈ వక్రీకరణలు కేవలం చెత్త చరిత్ర ను సృష్టించడం మాత్రమే కాదు, అది ప్రమాదకరమైన చరిత్ర.. ఇది సమాజంలో మనం వెర్సెస్ వాళ్ళు అనే భావనను పెంచి, చివరకు వీధి పోరాటాలకు, మత ఘర్షణలకు దారితీస్తుంది.

ప్రాపగాండా సినిమాలు - పసిమనసుల్లో విషం

ఆ ప్రమాదకరమైన చరిత్ర ఇప్పుడు వెండితెరపై ఎలా అమలవుతోందో చెప్పడానికి ఇటీవల వచ్చిన సినిమాలే సాక్ష్యం. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, బెంగాల్ ఫైల్స్, తాజాగా వస్తున్న చావా వంటి సినిమాలు చరిత్రను చెప్పడం కంటే, ఒక వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా వచ్చాయి. ఇటీవల చావా (Chhaava) సినిమా చూసి బయటకు వచ్చిన ఒక చిన్న పిల్లవాడు, ఏడుస్తూ, ఆవేశంతో ఔరంగజేబుపై ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఆ పసివాడికి చరిత్ర తెలియదు, కానీ తెరపై చూపించిన దృశ్యాలు వాడి మనసులో ఒక వర్గంపై చెరగని ద్వేషాన్ని ముద్రించాయి. ఇది సినిమా విజయం కాదు, ఒక తరాన్ని రాడికలైజ్ చేయడం.

((అబద్ధపు పునాదులు

ది కేరళ స్టోరీలో 32,000 మంది అమ్మాయిలు ఐసిస్(ISIS)లో చేరారని చెప్పడం పచ్చి అబద్ధమని తేలినా, లవ్ జిహాద్ కుట్ర సిద్ధాంతాన్ని బలపరిచేలా కథను నడిపించారు. కాశ్మీర్ పండిట్ల వలస వంటి సున్నితమైన అంశాలలో వాస్తవాలను పూర్తిగా చూపించకుండా, కేవలం ముస్లింలను రాక్షసులుగా చూపించారు.))

తెలుగు తెరపై కాషాయ నీడలు

ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలుగులో అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోందా? మోహన్ భగవత్ భేటీ ఆ దిశగా వేసిన తొలి అడుగు కావచ్చు. ఇప్పటికే రజాకార్ సినిమా ద్వారా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, ముస్లింల పాత్రను పూర్తిగా నెగటివ్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. తెలుగు సినిమాకు ఉన్న మాస్ అప్పీల్ని, ఇక్కడి హీరోల ఇమేజ్‌ని వాడుకుని, సంఘ్ పరివార్ భావజాలాన్ని ప్రతి ఇంటా చేర్చడమే ఈ భేటీల వెనుక ఉన్న అసలు వ్యూహం.

ముగింపు

ఒకప్పుడు శంకరాభరణం, రుద్రవీణ లాంటి కళాఖండాలను అందించిన తెలుగు సినిమా, ఇప్పుడు ప్రాపగాండా ఊబిలో చిక్కుకోబోతోందా మన నిర్మాతలు, దర్శకులు లౌకిక విలువలకు కట్టుబడి ఉంటారా లేక రాజకీయ ప్రలోభాలకు లొంగిపోతారా అన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. మోహన్ భగవత్ మీటింగ్ కేవలం ఆరంభం మాత్రమే, దీని పర్యవసానాలు భవిష్యత్తులో మన వెండితెరపై కనిపించబోతున్నాయి.

సంజయ్ ఖాన్

చలనచిత్ర విమర్శకుడు

[email protected]

Next Story