- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియమమే నిచ్చెన.. క్రమశిక్షణే గమ్యం
తెలంగాణ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, అప్పీల్) నిబంధనలు, 1991. దీన్ని సాధారణంగా CCA నిబంధనలని మన వాడుక భాషలో పిలుస్తారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, అప్పీల్) నిబంధనలు, 1991. దీన్ని సాధారణంగా CCA నిబంధనలని మన వాడుక భాషలో పిలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో క్రమశిక్షణను, పరిపాలనా సమగ్రతను కాపాడడానికి ఇవి చట్టపరమైన వెన్నెముకగా పనిచేస్తాయి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి న్యాయమైన ట్రీట్‌మెంట్ అందుతుందని నిర్ధారిస్తూనే వారి చర్యలకు వారిని బాధ్యులను చేసే ప్రవర్తన నియమావళి మాన్యువల్‌గా దీన్ని మనం భావించవచ్చు. ఈ సీసీఏ రూల్స్‌లో తరచుగా కొంత పదజాలాన్ని అంటే ఎంక్వయిరీ ఆఫీసర్, ప్రజెంటింగ్ ఆఫీసర్, ఎంక్వయిరీ రిపోర్ట్, మేజర్ పెనాల్టీలు, మైనర్ పెనాల్టీలు మొదలైన వాటి గురించి వింటుంటాము. వాటిలో కొన్నిటి గురించి అవగాహన కోసం...
విచారణాధికారి నియామకం:
ప్రభుత్వ ఉద్యోగి క్రమశిక్షణ అధికారి (Disciplinary Authority)ఎదుట హాజరై తనపై మోపబడిన ఆరోపణలను అంగీకరించ నప్పుడు లేదా సమాధానం చెప్పడానికి నిరాకరించి నప్పుడు లేదా విస్మరించి నప్పుడు, సంబంధిత క్రమశిక్షణ అధికారి ఆ విషయాన్ని రికార్డు చేసి ప్రభుత్వ ఉద్యోగి సంతకాన్ని తీసుకోవాలి. ఆపై సదరు అధికారి విచారణను తానే స్వయంగా నిర్వహించవచ్చు లేదా అవసరాన్ని భావిస్తే విచారణ జరిపేందుకు ఒక సర్వీస్‌లో ఉన్న లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని విచారణ అధికారిగా నియమించవచ్చు.
ముఖ్య గమనికలు
టీఎస్ సివిల్ సర్వీసెస్ సిసిఏ నిబంధనలు 1991 ప్రకారం క్రమశిక్షణ అధికారి స్వయంగా విచారణ జరిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ, సాధారణంగా మరొక అధికారిని విచారణ అధికారిగా ( Inquiring Authority) నియమించడం పరిపాటి. విచారణాధికారిగా ఎంపికయ్యే వ్యక్తి తగినంత సీనియర్ హోదాలో ఉండాలి. చార్జ్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగి పట్ల సదరు అధికారికి ఎటువంటి ముందస్తు పక్షపాతం లేదా వివక్ష ఉండకూడదు. గతంలో ఆ కేసు విషయంలో సదరు అధికారి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండకూడదు. ఆరోపణల యొక్క తీవ్రతను అనుసరించి విచారణ అధికారిగా తన శాఖ యందలి సీనియర్ అధికారిని లేదా కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీ చైర్మన్ లేదా అందులోని సభ్యులను కూడా నియమించవచ్చు. అయితే వారు సర్వీస్ లో ఉన్న లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి.
విచారణాధికారి విధులు
విచారణ అధికారి విచారణ యొక్క తేదీ మరియు సమయాన్ని ఖరారు చేయాలి మరియు ఆ విషయాన్ని నిందితుడికి అలాగే ప్రాసిక్యూషన్ సాక్షులకు తగిన సమాచారం ద్వారా తెలియజేయాలి. విచారణ అధికారి అవసరమైతే నిందితుని సౌకర్యాన్ని పరిగణలోకి తీసుకొని, విచారణ వేదికను కూడా ఎంచుకోవచ్చు. అయితే విచారణ అధికారి స్వయంగా వేదికను ఎంచుకోవడం వల్ల విచారణ చెల్లకుండా పోతుందని గాని, అది సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుంది కానీ అర్థం కాదు. ఉద్యోగిపై విచారణ ఎక్కడ జరగాలని దానిపై కచ్చితమైన నిబంధనలు ఏమీ లేవు. విచారణ అధికారి స్వయంగా వేదికను ఎంచుకోవడం వల్ల ఉద్యోగి తనను తాను రక్షించుకునే అవకాశాన్ని ఏ రకమైన కోల్పోయాడా లేదా అనేది మాత్రమే ఇక్కడ చూడాలి. విచారణ అధికారి రక్షణ సాక్షులను పేర్కొనమని నిందితుని అడగవచ్చు. అలాగే నిందితులు సాక్షులను పేర్కొన్నప్పుడు విచారణ అధికారి వారికి సమన్లు జారీ చేయాలి.
నివేదిక అధికారి (ప్రెజెంటింగ్ Officer)
క్రమశిక్షణ అధికారి ( Disciplinary Authority) విచారణ అధికారి( Inquiring Authority)ముందు ఆరోపణలు రుజువు చేయడానికి తన తరపున వాదించేందుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని లేదా న్యాయవాదిని ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించవచ్చు. సాధారణంగా ఆ శాఖకు చెందిన, ఆ కేసుకు సంబంధించిన విషయాలపై అవగాహన ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రజెంటింగ్ ఆఫీసర్ గా నియమిస్తారు. అయితే సంక్లిష్టమైన చట్టపరమైన అంశాలు ఉన్న సందర్భాల్లో మాత్రం న్యాయవాదిని కూడా నియమించడం ఉత్తమం అని భావించవచ్చు.
ముఖ్యమైన నియమాలు: 1. హోదా: ప్రజెంటింగ్ ఆఫీసర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగి కంటే పై హోదాలో ( సీనియర్ )ఉండాలి. 2. నిస్పాక్షికథ: ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ ( prelimnary enquiry)చేసిన అధికారిని ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించకూడదు. ఎందుకంటే అతనిపై పక్షపాత ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది. 3. నిర్దేశించిన విచారణ పద్ధతులు సరిగ్గా పాటించేలా ప్రజెంటింగ్ ఆఫీసర్ చూసుకోవాలి. 4. విచారణ అధికారి ప్రవర్తనలో ఏవైనా అక్రమాలు లేదా పక్షపాతం కనిపిస్తే వెంటనే లిఖితపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేయాలి. ఆ విషయాన్ని క్రమశిక్షణ అధికారికి నివేదించాలి. ప్రజెంటింగ్ ఆఫీసర్‌కు అవసరమైన అన్ని పత్రాలు, రికార్డుల కాపీలను అందించాలి. కొన్ని సందర్భాల్లో అసలు పత్రాలను కూడా అతని వద్ద ఉంచవచ్చు. 5. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి సమర్పించిన రక్షణ పత్రాన్ని (Statement of defence) ప్రజెంటింగ్ ఆఫీసర్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ ఆ ఉద్యోగి కొన్ని వాస్తవాలను అంగీకరించినట్లయితే ఆ వివరాలను జాబితా చేసి విచారణ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. దీనివల్ల ఇప్పటికే అంగీకరించిన విషయాలను మళ్లీ సాక్షాలతో నిరూపించాల్సిన అవసరం ఉండదు.
- మనోహర్ రావు చిలప్పగారి,
రిటైర్డ్ ప్రభుత్వ అధికారి.
96406 75288






