- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శూన్యం నుంచి శిఖరానికి.. తైవాన్ వేసిన సిలికాన్ బాట..

తైవాన్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1లో అడుగుపెట్టగానే ఒక అద్భుతం సాక్షాత్కరిస్తుంది. అక్కడ గోడపై ‘Made in Taiwan’ అని వెలుగుతున్న అక్షరాలు కనిపిస్తాయి. అవి కేవలం రంగులు కావు.. వెయ్యికి పైగా పాత కంప్యూటర్ మదర్ బోర్డులు! పాత సర్క్యూట్ బోర్డులతో చేసిన ఆ కళాఖండం ఒక దేశం యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఒకప్పుడు ప్రపంచం దేనినైతే ‘పాత ఇనుప సామాను’ అని ఈసడించుకుందో, అదే ఇనుప సామానుతో తైవాన్ నేడు ప్రపంచ గమనాన్ని శాసిస్తోంది. ఇది ఒక సామాజిక పరివర్తన కథ.
గొంగళి పురుగు తన చుట్టూ తాను గూడు అల్లుకుని, చీకటిలో నిశ్శబ్దంగా తపస్సు చేసి, చివరకు రంగుల సీతాకోకచిలుకలా ఎలా వికసిస్తుందో, తైవాన్ ప్రయాణం కూడా సరిగ్గా అలాగే సాగింది. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అలంకరణ వెనుక దశాబ్దాల సమిష్టి శ్రమ ఉంది. ఒక జాతి తనను తాను పునర్నిర్మించుకున్న సాహసం ఉంది. ముక్కలైన బోర్డుల వెనుక అద్భుత నిశ్శబ్ద తపస్సు.. నిన్నటి చెత్తనే నేటి చరిత్రైతే, శూన్యం నుండి శిఖరాన్నే చేరిన తైవాన్ సమాజపు సమిష్టి శ్రమకు ఇది సజీవ జయకేతనం!
అవమానం నుంచి పుట్టిన ఆశయం
1950ల కాలం అది. తైవాన్ ఒక చిన్న ద్వీపం. వనరులు లేవు, రాజకీయ అస్థిరత ఉంది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా తైవాన్‌ను కాపాడటం అంటే ఏదో పనికిరాని వస్తువు కోసం శ్రమపడటం అని భావించేవి. అప్పట్లో కొందరు అధికారులు తైవాన్ పరిస్థితిని చూసి ‘పాత ఇనుప సామాను’ అని హేళన చేశారు. ఒక సమాజానికి ఇంతకంటే పెద్ద అవమానం ఉండదు. కానీ వారు ఆ అవమానాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. 1970లలో ప్రపంచమంతా చమురు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే, తైవాన్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. బొమ్మలు, బట్టలు తయారు చేసే స్థాయి నుండి హై-టెక్నాలజీ వైపు అడుగులు వేసింది. అప్పుడే గొంగళి పురుగు తన గూడును అల్లడం ప్రారంభించింది.
విజ్ఞానమే పెట్టుబడిగా..
ఒక సమాజం మారాలంటే ముందుగా దాని ఆలోచనా ధోరణి మారాలి. తైవాన్ ప్రభుత్వం 1974లో ITRI (Industrial Technology Research Institute) ని స్థాపించింది. ఇది ఒక విత్తనం లాంటిది. వారు అమెరికాలోని RCA కంపెనీ నుండి టెక్నాలజీ నేర్చుకోవడానికి తమ ఇంజనీర్లను పంపారు. వారు అక్కడ కేవలం పని నేర్చుకోలేదు, ఒక దేశ భవిష్యత్తును నిర్మించే విజ్ఞానాన్ని మూటగట్టుకుని వచ్చారు. వారు కేవలం ఇతరులను అనుకరించలేదు, స్వయం శక్తిని నమ్ముకున్నారు. 1980ల నాటికి అమెరికాలో ఉన్న ప్రతిభావంతులైన తైవాన్ శాస్త్రవేత్తలందరూ తిరిగి తమ దేశానికి రావడం మొదలుపెట్టారు. తమ దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆ తపనే నేడు వారిని ప్రపంచానికి తలమానికంగా నిలబెట్టింది.
తైవాన్ వర్సెస్ ఇండియా: ఆత్మావలోకనం
1980లలో భారతదేశం కూడా టెక్నాలజీ రంగంలో అడుగులు వేస్తోంది. కానీ మన దృష్టి ఎక్కువగా సాఫ్ట్‌వేర్ సేవలపై ఉండిపోయింది. మనం కోడింగ్ నేర్చుకున్నాం, ప్రపంచానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను అందించాం. ఇది గొప్ప విషయమే. కానీ హార్డ్‌వేర్ విషయంలో, అంటే చిప్ తయారీలో మనం వెనుకబడిపోయాం. అదే సమయంలో తైవాన్ లో మోరిస్ చాంగ్ అనే దార్శనికుడు TSMC ని స్థాపించారు. ఆయన ‘ఫౌండ్రీ మోడల్’ అనే సరికొత్త పద్ధతిని కనిపెట్టి, “మీరు చిప్స్ డిజైన్ చేయండి, మేము తయారు చేసి ఇస్తాం” అని ప్రపంచానికి చెప్పారు. నేడు ఆపిల్ ఫోన్‌లో ఉండే చిప్ అయినా, మీ కారులో ఉండే సెన్సార్ అయినా తైవాన్‌లో తయారవ్వాల్సిందే.
సిలికాన్ షీల్డ్
నేడు తైవాన్ తయారు చేసే చిప్స్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. స్మార్ట్‌ఫోన్ల నుండి కృత్రిమ మేధస్సు (AI) దాకా ప్రతిదీ ఆ చిన్న ద్వీపం మీద ఆధారపడి ఉంది. దీనినే ‘సిలికాన్ షీల్డ్’ అంటున్నారు. ప్రపంచమంతా ఆ దేశంపై ఆధారపడటం వల్ల అది వారికి ఒక రక్షణ కవచంలా మారింది. విమానాశ్రయ గోడపై ఉన్న ఆ PCB బోర్డులు మనకు ఇదే చెబుతున్నాయి.. “మమ్మల్ని చెత్త అన్నారు, కానీ అదే చెత్తతో మేము ప్రపంచాన్ని నడుపుతున్నాం” అని అవి గర్వంగా చాటుతున్నాయి. ఆ కళాఖండం సుమారు ఒక టన్ను బరువు ఉంటుంది.. అంటే వేయి కిలోల మేధస్సు, వేయి కిలోల కృషి అక్కడ కొలువై ఉంది.
‘మేక్ ఇన్ ఇండియా’ కలలకు నిలువెత్తు సాక్ష్యం!
మనం కొంత ఆలస్యంగా మేల్కొని ఉండవచ్చు, కానీ ఇప్పుడు భారతదేశం కూడా తన గూడు నుండి బయటకు వస్తోంది. 2026 నాటికి గుజరాత్‌లోని ధోలేరాలో మన మొదటి సెమీకండక్టర్ ప్లాంట్ సిద్ధం కాబోతోంది. దీనికి తైవాన్ కంపెనీలైన PSMC వంటివి సహకరిస్తున్నాయి. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు 91 వేల కోట్ల పెట్టుబడితో ఈ యజ్ఞం జరుగుతోంది. ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు కూడా భారతదేశంలో వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. తైవాన్ ప్రయాణం మనకు ఒక పాఠం. ఒక సమాజం తనను తాను ఎలా మార్చుకోగలదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
త్వరలో మేడ్ ఇన్ ఇండియా...
సమాజం అంటే కేవలం మనుషుల సమూహం కాదు. అది ఒక ఆశయం, ఒక సమిష్టి కల. తైవాన్ ప్రజలు ఆ కలను కన్నారు, దాని కోసం దశాబ్దాల పాటు నిశ్శబ్దంగా శ్రమించారు. నేడు ఆ శ్రమకు జయకేతనంలా టెర్మినల్-1 లోని ఆ PCB అలంకరణ రెపరెపలాడుతోంది. మనం కూడా గొంగళి పురుగు దశ నుండి బయటకు వచ్చి, ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా ఎదిగే సమయం ఆసన్నమైంది. ఆ విమానాశ్రయంలోని ‘Made in Taiwan’ బోర్డు మనకు ఒక ప్రేరణ. త్వరలోనే ప్రపంచ విమానాశ్రయాల్లో ‘Made in India’ అనే అక్షరాలు కూడా అంతే వెలుగుతో మెరుస్తాయని ఆశిద్దాం. ఇది మానవ మేధస్సు సాధించిన విజయం, సామాజిక విప్లవ ఫలితం. మరి మన దేశం కూడా ఇలాంటి అద్భుతాలు సృష్టించగలదని మీరు నమ్ముతున్నారా?
- Dr. నంబూరి చంద్రశేఖర్
C&D Technology Consultants
+91 93939 90399






