మనసులో మాట: యుద్ధం అక్కడ... భయం ఇక్కడ ఎందుకు?

by velandi.Saikiran |   (  Updated:2026-03-28 22:46:20  IST  )

ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, భారతదేశం వంటి దేశాల్లో కూడా ఆందోళనలకు కారణమవుతున్నాయి.

మనసులో మాట: యుద్ధం అక్కడ... భయం ఇక్కడ ఎందుకు?
X

మనసులో మాట: యుద్ధం అక్కడ... భయం ఇక్కడ ఎందుకు?

మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, భారతదేశం వంటి దేశాల్లో కూడా ఆందోళనలకు కారణమవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలు, మత విభేదాలు, మీడియా ప్రభావం కలిసి సాధారణ ప్రజల మనోభావాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయి.

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో వంటగ్యాస్ కొరత వంటి అంశాలపై మీడియా కథనాలు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మీడియా కథనాల కారణంగా ప్రజలు వంటగ్యాస్‌కు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళనలతో అడ్వాన్స్ బుకింగులకు ఎగబడుతుండటం ఆందోళన కలిగించే విషయం.

ఈ యుద్ధానికి కారణాలు..

ఇరాన్‌పై ఇజ్రాయిల్- అమెరికాలు అనవసర యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఈ యుద్ధాన్ని మొదలు పెట్టడానికి ఆ రెండు దేశాలకు కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఇరాన్‌ను ఆర్థికపరంగా ఎదగకుండా చేయడం ఆ దేశం ఆర్థికంగా ఎదిగితే ఎక్కడ తమను దాటిపోతుందోననే భయం, రెండోవది ఒక మత ఛాందస్ దేశం అణ్వాయుధ సంపత్తిని కలిగి ఉండకూడదనే నియమం. కానీ తన కనుసన్నల్లో అణ్వాయుధాలు కలిగిన దేశంగా పాకిస్తాన్ మాత్రం గుర్తింపు పొందవచ్చు! ఇది అమెరికా ఏర్పరచుకున్న రాజనీతి! ఇక అమెరికాపై కోపంతో సున్నీ దేశాలపై ఇరాన్ దాడులు చేయడం వెనుక మత కారణాలు లేకపోలేదు.. ఇస్లాంను రాజ్యమతంగా అనుసరించే 52 ముస్లిం దేశాలలో షియా, సున్నీ తెగల పోరాటాలు సర్వసాధారణమైన విషయం. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను అమెరికా మట్టుబెట్టే విషయంలో ఇరాన్ మిన్న కుండడానికి కారణం ఆయన సున్నీ తెగకు చెందినవాడు కావడమే..మనదేశంలో హిందూ, ముస్లిం ఘర్షణల కంటే ఇస్లామిక్ దేశాలలో షియా, సున్నీల ఘర్షణలు భయంకరంగా ఉంటాయి.

ఈ వైరాన్ని వారి సంఘర్షణగా మార్చి..

ఇరాన్ ,ఇరాక్ దేశాలు 9 సంవత్సరాలు ఒకరిపై ఒకరు నిరంతరం దాడులకు పాల్పడడానికి మత శాఖలైన షియా, సున్నీ విభేదాలే కారణమని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు అందరికీ తెలుసు. ఈ రెండు దేశాల్లో కొన్ని లక్షల మంది యుద్ధ పీడితులయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ లొంగిపోతుందా? లేక ఎదురు నిలబడుతుందా? అనే విషయం పక్కన పెడితే యూదు, ఇస్లాం వైరాన్ని షియా, సున్నీల సంఘర్షణగా మార్చడంలో యూరోపియన్ దేశాల క్రైస్తవ రాజకీయ నాయకత్వం విజయం సాధించిందని చెప్పాలి.

మధ్యప్రాచ్యంలో యుద్ధాలు సాధారణమే..!

మధ్య ప్రాచ్యంలో ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయిల్‌తో పోరాటం చేయడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం 1948 నుంచి జరుగుతున్న తంతే! ఆ దేశాలలోని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఇది ఒక సర్వ సాధారణమైన విషయంగా భావిస్తారు.. కానీ భారతదేశంలోని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు తద్భిన్నంగా ప్రవర్తించడం, ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులకు అనవసరంగా భయపడి పోవడం, అనవసర భయాందోళనలకు గురి కావడం, ఒక అలవాటుగా మార్చుకున్నారు.. ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణలకు, ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా ఈ దేశంలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయడమేమిటి? ఆధునిక భారతదేశ చరిత్రను పరిశీలిస్తే-ఇందుకు కారణాలు దొరుకుతాయి. టర్కీలో 'ఖలీఫా' పదవిని తొలగించి, ప్రజాస్వామ్య ఆలోచనలు కలిగిన కెమాల్ పాషాను బ్రిటన్ ప్రభుత్వం అధికారంలో కూర్చోబెడితే ఇస్లామిక్ దేశాలు ఏవీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.. కానీ భారతదేశంలోని ఇస్లాం సమాజం రెచ్చిపోయి, దేశవ్యాపితంగా 'ఖిలాఫత్' ఉద్యమాన్ని లేవదీయడం జరిగింది. ఈ ఉద్యమం దేశంలో మత విభజనకు పునాదిని వేసిందనే విషయం ఎప్పటికీ మరిచిపోకూడదు!

మోడీపై వ్యతిరేకత దేశంపై చూపిస్తారా?

ఇక ప్రస్తుత విషయానికి వస్తే-మధ్య ప్రాచ్యంలోని యుద్ధ పరిస్థితుల వల్ల వంట గ్యాస్ సమస్యలు ఏర్పడతాయని కొన్ని పత్రికలు, కొన్ని మీడియా హౌసులు అనవసర భయాందోళనలను ప్రజల మనసుల్లోకి ఎక్కించడం క్షమించరాని నేరం. 'ప్రజలకు గ్యాస్ దొరకకపోతే అన్నమో రామచంద్రా అని ప్రజలు విలవిలలాడతారని' ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఎడిటోరియల్ రాయడం బాధ్యతారాహిత్యం అని చెప్పాలి. 30 సంవత్సరాల వెనుకకు వెళితే, అసలు దేశంలో గ్యాస్ మీద వంట చేసే పరిస్థితి లేదు.. కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రజలు కట్టెలతో వంట చేసుకుని, సుఖ సంతోషాలతో జీవించారనే విషయం గుర్తుంచుకోవాలి! మోడీ ప్రభుత్వం పైన వ్యతిరేక కథనాలను ప్రచురించడంలో సదరు పత్రిక చొరవ చూపుతుందనడంలో సందేహం లేదు.. మోడీ పైన వ్యతిరేకత దేశంపై ద్వేషంగా మారకూడదు కదా?

అనవసర భయాందోళనలకు గురిచేయకండి!

ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు దిగిపోవడం కొత్త ప్రభుత్వాలు రావడం సర్వసాధారణమైన విషయం. దేశంలో నివసించే ప్రజలకు, పత్రికలకు దేశం ముఖ్యం. ప్రభుత్వాలు కాదు.. కరోనా పాండమిక్‌ను పరిశీలిస్తే కొన్ని మీడియా కథనాల వల్లే విశ్రాంతి వర్గాల ప్రజలు భయపడి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారనే విషయం అర్థం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు లేకుండా జీవించే ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు ఎవరు కూడా కరోనా వైరస్ బారిన పడినట్టు దాఖలాలు లేవు.. ఇక చివరగా ప్రస్తుత ప్రధానమంత్రి మోడీపై వ్యతిరేకతతో, అమెరికా, ఇజ్రాయిల్‌పై ఉండే ద్వేషంతో, భారతదేశంలోని ముస్లిం సమాజాన్ని సంతుష్ఠీకరించాలనే కోరికతో ప్రజలను అనవసర భయాందోళనలకు గురిచేసి, దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు సమస్యలు సృష్టించడం దేశ హితాన్ని కోరేవారు చేయకూడని పని. ఈ సమయంలో విజ్ఞతను ప్రదర్శించాలి సుమా!

-ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Next Story