- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమరమా.. సామరస్యమా?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచమంతా ఒక్కటే ప్రశ్న.. శాంతి నెలకొంటుందా లేక మహా సంగ్రామం మొదలవుతుందా.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచమంతా ఒక్కటే ప్రశ్న.. శాంతి నెలకొంటుందా లేక మహా సంగ్రామం మొదలవుతుందా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఐదు రోజుల గడువు శుక్రవారంతో (మార్చి 26) ముగుస్తుండటంతో.. ఒమన్ వేదికగా జరిగిన రహస్య చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అసలు ఒమన్ లో ఏం జరిగింది కొందరు అలాంటి సమావేశమే జరగలేదని చెప్తున్నా.. జరుగుతున్న ఒక్కో పరిణామం, ఆధారాలు చూస్తే సమావేశం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. మరి ఆ సమావేశంలో ఏ విషయాలు చర్చకు వచ్చాయి అసలు ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు ఎవరు ఒకవేళ యుద్ధ విరామం సానుకూల ఫలితాలు ఇస్తే సరేసరి.. లేదంటే ప్రపంచం మొత్తం తల్లకిందులు అయ్యే ప్రమాదంఉన్నది. ముందుగా ఆ సమావేశంలో ఏం జరిగిందో చూద్దాం..
మస్కట్‌లో రహస్య భేటీ
ఒమన్ రాజధాని మస్కట్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌కి అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు జారెడ్ కుష్నర్ 20వ తేదీన చేరుకున్నారు. విట్కాఫ్ సాధారణంగా ఏ విదేశీ ప్రయాణం చేసినా తన సొంత విమానాన్నే వాడుతుంటారు. ఒమన్‌కి కూడా ఆయన ఆ విమానాన్నే వాడారు. ఈ వివరాలను అంతర్జాతీయ విమానాలను ట్రాకింగ్ చేసే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఫ్లైట్ నంబర్‌తో సహా వెల్లడించింది. వీళ్లిద్దరూ అదేరోజు సాయంత్రం ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్బుసైదీతో భేటీ అయ్యారు. ఇరాన్ ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనలపై ప్రాథమిక చర్చలు జరిపారు. ఆ మరునాడే అంటే 21వ తేదీన ఒమన్‌కు చెందిన అధికారిక గల్ఫ్ స్ట్రీమ్ అనే విమానంలో ఇరాన్ ప్రతినిధులు మస్కట్ చేరుకున్నారు.
ఆ రోజు 10 గంటలనుంచి 22వ తేదీ రాత్రి 7గంటల వరకు ఇరాన్ ప్రతినిధులతో పరోక్ష చర్చలు జరిగాయి. అయితే ఇరాన్, అమెరికా ప్రతినిధులు ఒకే గదిలో కూర్చుని సమావేశం కాకుండా.. వేర్వేరు గదుల్లో కూర్చుని ఉండగా.. ఒమన్ ప్రతినిధులు ఇరు దేశాల నేతలకు మధ్య షటిల్ రాయబారం నడిపారు. ఈ చర్చల్లో ఇరాన్ మజ్లిస్ (పార్లమెంట్) స్పీకర్ గాలిబాఫ్ సన్నిహితుడు ఇరాన్ అణు చర్చల ప్రతినిధి అలీ బఘేరి కని సహా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చర్చలపై రాయిటర్స్, అల్ జజీరా, ఏపీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు కూడా ఇచ్చాయి. ఇజ్రాయెల్ మీడియా కూడా స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీని దాడుల నుంచి తాత్కాలిక రక్షణ కల్పించినట్లు వెల్లడించింది.
డిమాండ్లు ఇవే..
ఈ చర్చల్లో అమెరికా పదిహేను డిమాండ్లు ప్రతిపాదించగా.. అందులో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.. 1. ఇరాన్ తన సైనిక, అణు సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి. 2. 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించాలి. 3. హోర్ముజ్ జలసంధిని మూసివేయబోమని హామీ ఇవ్వాలి. 4. సుదూర శ్రేణి క్షిపణి పరీక్షలను తక్షణమే నిలిపివేయాలి. 5. లెబనాన్ (హిజ్బుల్లా), యెమెన్ (హౌతీలు) వంటి గ్రూపులకు సైనిక సాయాన్ని ఆపాలి. ఇరాన్ ఈ చర్చల్లో నాలుగు కీలక షరతులు ముందుకు తెచ్చింది. 1. తమ దేశ చమురును ప్రపంచ మార్కెట్లో స్వేచ్ఛగా అమ్ముకోవడానికి అనుమతించాలి, అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలి. 2. పవర్ ప్లాంట్లు, అణు కేంద్రాలతోపాటు సైనిక స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయబోమని గ్యారెంటీ ఇవ్వాలి. 3. అగ్రనేతలను (సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వంటి వారిని) టార్గెట్ చేసే ‘రెజీమ్ చేంజ్’ కుట్రలను ఆపాలి. 4. విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదల చేయాలి.
ఇలా ఎవరి డిమాండ్లు వారు ప్రతిపాదించినా.. ‘ఎవరు ముందు తగ్గాలి’ అన్న పాయింట్ వద్ద చర్చలు ప్రస్తుతానికి ముగిశాయి. విట్కాఫ్, కుష్నర్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ నేతలు సుముఖంగా లేరు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో చర్చలను మాత్రమే అంగీకరిస్తామని చెప్పినట్లు తెలుస్తున్నది. 26 తర్వాత ఎప్పుడైనా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో వాన్స్, ఇరాన్ నేతలకు మధ్య చర్చలు జరుగనున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ సైతం వాన్స్, రూబియోలను మధ్యవర్తులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
చర్చలు విఫలమైతే.. టార్గెట్లు ఇవే!
ఒకవేళ శుక్రవారం (26వ తేదీ) నాటికి చర్చలు కొలిక్కి రాకపోతే, యుద్ధం మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో రెండు దేశాలు ఇప్పటికే తమ టార్గెట్లను సిద్ధం చేసుకున్నాయి. చర్చలు విఫలమైతే అమెరికా ఇరాన్ లోని ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం ఖార్గ్ ఐల్యాండ్ ను టార్గెట్ చేసే అవకాశం ఉన్నది. ఇరాన్ సైతం ప్లాన్ బీలో ఉన్నది. చర్చలు విఫలమైన మరుక్షణం అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు భీకరమైన ప్రతిదాడులు చేసేందుకు రెడీ అవుతున్నది. అమెరికా సన్నిహిత దేశమైన యూఏఈని ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశం ఉన్నది. దీంతోపాటు గల్ఫ్ దేశాలకు అత్యంత ముఖ్యమైన డీశాలినేషన్ (సముద్రనీటిని తాగునీరుగా మార్చేవి) ప్లాంట్లను దెబ్బతీసేందుకు అవకాశం ఉన్నది.
అంతర్జాతీయ సంక్షోభం
చర్చలు విఫలమైతే ఇరాన్ నష్టపోయేదానికంటే వందరెట్లు ప్రపంచదేశాలు నష్టపోనున్నాయి. ఇప్పటికే 100డాలర్లకుపైన ఉన్న చమరు ధరలు హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగిస్తే 150డాలర్లు దాటే ప్రమాదం ఉన్నది. అదే జరిగితే భారత్ లో లీటర్ పెట్రోల్ రూ.150నుంచి రూ.200వరకు వెళ్లవచ్చు. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంలో అతి తక్కువ స్థాయిలో ఉండటం కూడా దీనికి ఒక కారణం. మొత్తానికి ఒక యుద్ధం మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేయబోతున్నది. అంతర్జాతీయ సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యులుగా మిగలనున్నాయి.
హరీశ్ ఎస్పీ
(గ్లోబల్ వాచ్)






