- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవేశం... అర్ధంతరం
ఆవేశం.. అనాలోచితం.. ఏదైతేనేం రెండు నిండు ప్రాణాలు ఆగిపోయాయి. ఆప్యాయత, అనుబంధం, ప్రేమ, మమకారం, మంచి, చెడు, కష్టం, సుఖం..

దిశ, వెబ్ డెస్క్: ఆవేశం.. అనాలోచితం.. ఏదైతేనేం రెండు నిండు ప్రాణాలు ఆగిపోయాయి. ఆప్యాయత, అనుబంధం, ప్రేమ, మమకారం, మంచి, చెడు, కష్టం, సుఖం... ఇవేవి మనిషిని మోస్స తిప్పుకోనివ్వడం లేదు. మస్తీస్కం పరిణతి వీటిని జయించలేక పోతున్నది. పెండ్లి నాడు చేసిన బాసలు, పెళ్లికి ముందు చూసుకొని అర్థం చేసుకుంటామని భావించిన నమ్మకాలు., వేద బ్రాహ్మణులు నిర్ణయించి జరిపించిన క్రతువు.., వేలాది అతిథుల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు.... ఇవేవి అర్దాంతరాన్ని ఆపలేక పోతున్నాయి.
రెండు తనువులు, కుటుంబాలు, కొత్త మనుషులు, మనస్తత్వాలు..., ఫొటోలు, ఫ్రేముల్లో కలుస్తున్నాయి తప్ప నిజంగా వేరుంటున్నాయి అనే విషయాన్ని ఎన్నో ఎన్నెన్నో తేటతెల్లం చేశాయి. తాజాగా ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులు కూడా రూడీ చేశారు. పిల్లల పట్టింపు అక్కర్లేదు.., ఆధారపడిన వారి బాగోగులు అవసరం లేదు., అనంత ఆశలు పెట్టుకుని పెంచి పెద్దచేసిన ముచ్చట లెక్కేలేదు. వాదించమా.., వోడమా... గెలిచామా... కోణం తప్ప ఓపిక మచ్చుకైనా కానరాదు. భార్య భర్త కలిసి చేస్తున్నది సంసారమా...? యుద్ధమా...? అనే అనుమానం ఏమాత్రం అక్కర్లేని ప్రగతి దిశగా సాగుతూ క్షణికానందం లో పరమానందాన్ని పొందుతూ పరవశిస్తున్నాం.
ఆవేశానికి అగ్రపీఠమేస్తే
తగ్గితే తప్పుచేసినట్టు., తప్పకుండా టగ్ ఆఫ్ వార్ గా ఉండాల్సిందే అని పేట్రేగుతున్న తీరు మానసిక పరివర్తనలో మసి పూసుకునే వ్యవహారమని మరిచి.., ఆవేశాన్ని అగ్ర పీఠం వేసి మరీ కూర్చోబెడుతున్నాం. తృచ్ఛమైన జయపజయాలకు జవాబుదారీ అవడానికి, వికృత బలవన్మరణ క్రీడలో బలి అవుతున్నామనే సోయి మరిచి శ్వాస వదులుతున్నాం. నడిచిన ఏడడుగులు, తలపై పెట్టిన జీలకర్ర బెల్లం, ముడి వేసుకున్న కొంగు పంచ.., నిండా తడిసేలా పోసుకున్న తలంబ్రాలు.., ధర్మేచ్ఛ, అర్థచ్ఛ.., కామేచ్చ, నాతి చరామి... అంటూ బ్రాహ్మణులు సమక్షంలో, పచ్చని పందిట్లో దివిలో దేవతలు, భూమిపై మాతృ పితృ సమానులు అక్షింతలు వేస్తున్న ఘడియన చేసిన ప్రమాణాలు, కట్టిన తాళి, నుదుటన దిద్దిన తిలకం, కాలి మెట్టలు.., అన్నీ అబాసు పాలవ్వాల్సిందేనా..? మార్చుకున్న పూలదండలు వాడిపోయి ఆఖరి యాత్రకు అక్కర కొస్తాం అని హెచ్చరికలు ఇస్తున్నాయని ఒక్క చిత్తం చేసుకోవాల్సిందేనా..?
((చదువు నేర్పిందేంటి.., సమాజం నేర్పిస్తున్నది మరి ఏంటి..? కాలం కన్నా వేగంగా పరుగెడుతున్నాం.. అని టెక్నాలజీని చూసి సంకలు గుద్దుకుందామా.., సమస్య ఎదురైతే గట్టిగా నిలబడి దాన్ని నిలదీద్దామనే ధైర్యం పెంచుకొని ఆయుష్షును బలవంతం గా కాకుండా హాయిగా పంపిద్దామా..?! పోయినోళ్ళందరు మంచోళ్ళే కాదనం.., కానీ ఉన్న వారు పోయినోళ్ల చేదు గుర్తులతో చావలేక., బతుకంతా చచ్చి బతుకేలా చేద్దామా..?))
ఎవరికి వారు ఇలా దారి చూసుకుంటే..
ఎవరి దారి వారు చూసుకోవడం కాదు. ఇప్పటికే అడ్డమైన ఆహారపు అలవాట్లు, ప్రకృతి వ్యతిరేక పనులతో అయు: ప్రమాణం సగమైంది. లెక్కకు మిక్కిలి రోగాలు, అంతు చిక్కని వ్యాధులు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఆరోగ్యంగా బతుకడమే అదృష్టం. దాన్ని క్రూరంగా ఫ్యాన్లకు, రైలు పట్టాలకు, పురుగు మందులకు, చెరువు నీళ్లకు ఇతరత్రా వస్తువులకు తాకట్టు పెట్టి ముగించడం మనిషిగా మూర్ఖమే. మోసేవాడికి కావడి బరువు తెలుస్తుంది.., కాదనలేం... కానీ దాన్ని శక్తి ఉన్న మేరకు తీసుకెళ్లే ప్రయత్నం ఆపడం.., ఎప్పుడూ ఆ భారాన్నే ఊహల్లో తలుచుకుంటూ ఉన్న ఆ శక్తిని నీరుగార్చడం ముమ్మాటికీ మానవ తప్పిదమే. ఎస్ఐ దంపతుల అకాల బలవన్మరణం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా ఆలోచనలో మార్పు., నిజ జీవితంలో పక్కా ధైర్య సాహసాల ప్రమేయం తప్పకుండా పెరగాలి. రిప్ స్వప్న మేడం & చంద్రశేఖర్ సార్..
- రాజేంద్ర ప్రసాద్ చేలిక
99858 35601
- Tags
- human life
- life






