- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవధానీ... అసంబద్ధ పలుకులూ..!
వెనుకబడిన కులాల పట్ల ఎదిగిన కులాలు చిన్నచూపు చూడటం మన దేశంలో పరిపాటి అని మనకు తెలిసిందే.

వెనుకబడిన కులాల పట్ల ఎదిగిన కులాలు చిన్నచూపు చూడటం మన దేశంలో పరిపాటి అని మనకు తెలిసిందే. అందుకు గరికపాటి కూడా ఏమాత్రం మినహాయింపు కాదని నిరూపితం అయ్యింది. నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని అపహాస్యం చేస్తూ, పేదవిద్యార్డులు కేవలం భోజనం కోసమే బడికి వస్తున్నారనే ధ్వని వచ్చేలా ప్రవచన కారుడు గరికపాటి నరసింహారావు అన్నమాటలకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడం సహజం. ఆ మాటలు ఎందరో తల్లిదండ్రుల మనస్సులను గాయపరిచాయనేది కాదనలేని నిజం.
ఆత్మస్తుతి పరనింద
ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు డ్రాపౌట్స్ కూడా ఘనంగా తగ్గిపోయాయాని ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి. వీటిని గమనంలోకి తీసుకొని ఉపాధ్యాయులను విద్యాభోధనకే పరిమితం చేసి, ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేక ఉద్యోగిని నియమిస్తే విద్యా భోదనకు ఆటంకం కలగదు అని ప్రభుత్వానికి గరికపాటి వారు సూచిస్తే అంతా సంతోషించే వాళ్ళం.
గీతోపదేశం చేసే వారికి హితబోధ చేసేదెవరు?
పౌష్టికాహారం కోసం పిల్లలకు అందిస్తున్న గుడ్డును గుడ్డు గాడిద గుడ్డు అనే మాటతో అందరిలోనూ ఆయన పట్ల ఉన్న గౌరవ మర్యాదలు అధ:పాతాళం లోకి పడిపోయాయి. ఆత్మ జ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటారు కదా, మరి పెరుగుతున్న వయస్సు రీత్యా అవధాని గారికి అది లోపించిందా, లేక కింది కులాల పట్ల చిన్నచూపా, కనీస స్పృహ లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబు అని జన బాహుళ్యం నుండి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం విద్యపై చేసే వ్యయం పిల్లల మేధోవికాసం కోసం మాత్రమే అని పెద్దలు గుర్తించాలి.
చిన్న కులాల లేమిడితనంపై లెక్కలేనితనమా?
పుక్కిట పురాణాలు చెప్పే అవధానుల (గరికపాటి) వారి మాటల్లో చిన్న కులాల లేమిడితనం పట్ల లెక్కలేనితనం బయటపడిందని చెప్పాలి. ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ వర్గాలలో వారి వయస్సు కలిగినవారు ఎంతమంది వారిలాగా విద్యావంతులు ఉంటారు. అలాగే గరికపాటి కుటుంబంలో ఎన్ని తరాలుగా విద్యావంతులు ఉన్నారో వారి తర్వాత తరం అయిన వీరికి కూడా విద్య అందుబాటులో ఉండటం వల్లనే సుమారు డెబ్భై పదుల వయస్సులో కూడా ప్రవచనాలు చెపుతూ, డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ, ఏది పడితే అది ఎట్ల పడితే అట్ల మాట్లాడటం విజ్ఞత అనిపించదు.
ఆకలిని దూరం చేసి విద్యను దగ్గర చేసి...
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన కులాల పేద పిల్లలకు ప్రభుత్వ బడుల్లో పౌష్టికాహారం తోపాటు, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 1995 ఆగస్టు 15న మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనిని నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిష్ణల్ సపోర్ట్ టూ ప్రైమరీ ఎడ్యుకేషన్‌గా మొదట ప్రారంభించి 2021లో ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాన్‌గా మార్చారు. దీనివల్ల అట్టడుగు వర్గాలకు చదువు ఇంకాస్త అందుబాటులోకి వచ్చిందని గ్రహించాలి. మధ్యాహ్న భోజన పథకం అనేది ఉదారంగా పెట్టే అన్నదాన కార్యక్రమం కాదు, అది వారి హక్కు అని విజ్ఞులుగా మనం గుర్తుంచుకోవాలి. గరికపాటి లాంటి వారు సరదాకు కూడా నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అలా మాట్లాడి ఉండకూడదు. విద్యలో ఉన్నత ప్రమాణాల కోసం ప్రభుత్వానికి వారు సలహాలు ఇవ్వాలి, పేద వర్గాల పిల్లలకు మంచి మార్గం వేయాలి. అంతేకాని ఇన్నాళ్లు ప్రవచనాలు వల్లె వేస్తూ పేదల విద్యా సౌకర్యాలపై చెణుగులు విసిరితే జనం నొచ్చుకుంటారని గ్రహించి, నిజంగానే తప్పు దొర్లితే ఆత్మ సాక్షిగా క్షమాపణ కోరడంలో తప్పులేదు.
- ధీరన్ కొడారి
80082 00664






