- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలియని స్థితిలో ప్రభుత్వ బకాయిలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాసం నేడు తీవ్రమైన పరీక్షకు గురవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాసం నేడు తీవ్రమైన పరీక్షకు గురవుతోంది. దశాబ్దాల పాటు ప్రజాసేవలో నిమగ్నమైన ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన, భద్రమైన జీవితం గడపాల్సిన పెన్షనర్లు – ఈ రెండు వర్గాలూ ప్రస్తుతం తెలియని స్థితిలో ఉన్న ప్రభుత్వ బకాయిలు కారణంగా తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ సేవలో పనిచేసిన కాలంలో నియమ నిబద్ధత, బాధ్యత, క్రమశిక్షణను పాటించిన ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం మాత్రం తమకు రావాల్సిన చట్టబద్ధ హక్కుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు; ప్రభుత్వ పాలనపై నమ్మకాన్ని దెబ్బతీసే అంశంగా మారింది.
విశ్వాస బంధం బలహీనం
డియర్‌నెస్ అలవెన్స్, పీఆర్సీ బకాయిలు, ఇతర సేవా సంబంధిత చెల్లింపులు ఏ దశలో ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంత మొత్తం బకాయి ఉంది ఏ నెల నుంచి పెండింగ్‌లో ఉంది ఎప్పుడు చెల్లిస్తారు అనే ప్రశ్నలకు ఎక్కడా స్పష్టమైన సమాధానాలు లేవు. ఈ అనిశ్చితి ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో అస్థిరతను పెంచడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజల మధ్య ఉన్న విశ్వాస బంధాన్ని కూడా బలహీనపరుస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే, భవిష్యత్ తరాల ఉద్యోగులలో ప్రభుత్వ సేవ పట్ల ఆసక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంది.
బకాయిని ఒకేసారి పూర్తిగా చెల్లించాలి
మొదటిగా, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అన్ని రకాల బకాయిల వివరాలను వారి జీతపు స్లిప్పులు, పెన్షన్ స్లిప్పుల్లో తప్పనిసరిగా స్పష్టంగా చూపించాలి. ప్రస్తుతం నెలకు చెల్లిస్తున్న మొత్తమే చూపించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను గోప్యంగా ఉంచడం పారదర్శకతకు విరుద్ధం. బకాయిల మొత్తం, రకం, కాలపరిమితి స్పష్టంగా కనిపిస్తేనే లబ్ధిదారులు తమ ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోగలుగుతారు. రెండవది, ఒక్కో రకమైన బకాయిని ఒకేసారి పూర్తిగా చెల్లించాలి. చిన్న చిన్న విడతలుగా బకాయిలను విడుదల చేయడం వల్ల వాటి వాస్తవ విలువ తగ్గిపోతూ, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోంది. ఒకసారి ప్రభుత్వం చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ బకాయిని ఒకే విడతలో, ఒకే స్ట్రెచ్‌లో పూర్తిగా క్లియర్ చేయడం ప్రభుత్వ నైతిక, పరిపాలనా బాధ్యత. విడతల విధానం అనవసర అసంతృప్తిని, అనిశ్చితిని మాత్రమే పెంచుతుంది.
మరో అపరిష్కృత సమస్య
మూడవది, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిలను ముందుగా పూర్తిగా క్లియర్ చేయాలి. ఇది ఉద్యోగులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ మాత్రమే కాదు; పరిపాలనా క్రమశిక్షణకు కూడా అవసరం. పాత పీఆర్సీ బకాయిలు పరిష్కరించకుండా కొత్త పీఆర్సీపై చర్చించడం తార్కికంగా కూడా సమంజసం కాదు. ఇది అయోమయాన్ని, అపోహలను పెంచుతుంది. నాలుగవది, 11వ పీఆర్సీ బకాయిలు పూర్తిగా చెల్లించిన అనంతరం మాత్రమే 12వ పీఆర్సీని తుది రూపంలో ఖరారు చేయాలి. అప్పుడే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఉద్యోగులు, పెన్షనర్లకు విశ్వాసం ఏర్పడుతుంది. లేదంటే ప్రతి కొత్త పీఆర్సీ కూడా మరో అపరిష్కృత సమస్యగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు
ఐదవది, ప్రతి ఉద్యోగి, ప్రతి పెన్షనర్ తమ బిల్ ఏ దశలో ఉందో తెలుసుకునేలా బిల్ స్టేటస్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. బిల్ ఎక్కడ పెండింగ్‌లో ఉంది ఏ అధికారి వద్ద ఉంది ఎప్పుడు క్లియర్ అవుతుంది అనే వివరాలు ఆన్‌లైన్‌లో స్పష్టంగా తెలిసేలా చేయాలి. ఇది కార్యాలయాల చుట్టూ తిరగడం, అనవసర వినతులు, మధ్యవర్తిత్వం వంటి సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది. ఆరవది, పెన్షనర్ల సమస్యలన్నింటికీ ఒకే వేదికగా పరిష్కారం చూపేందుకు ప్రత్యేకంగా ఒక పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం పెన్షనర్ల అంశాలు అనేక శాఖల మధ్య చెల్లాచెదురుగా ఉండటంతో సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతోంది. ప్రత్యేక డైరెక్టరేట్ ఉంటే బాధ్యత స్పష్టంగా నిర్ణయించవచ్చు.
పెన్షనర్లకు కావలసిది దయకాదు
ఈ అన్ని అంశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రిని వినయపూర్వకంగా కోరేది ఏమిటంటే, పై సూచనలను కేవలం గ్రీవెన్స్‌లుగా కాకుండా ప్రభుత్వ బాధ్యతగా పరిగణించి, ప్రాధాన్యతా క్రమంలో తక్షణమే అమలు చేయాలి. పెన్షనర్లు దయ కోరడం లేదు. వారు తమ సేవలకు ప్రతిఫలంగా రావాల్సిన చట్టబద్ధ హక్కులను మాత్రమే కోరుతున్నారు. ఆ హక్కులకు న్యాయం చేయడమే మంచి పాలనకు అసలైన కొలమానం.
- టి. ఎం. బి. బుచ్చిరాజు
జనరల్ సెక్రటరీ,
ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్
97034 25006






