వైద్యుడు కాని వైద్యుడు ఫార్మసిస్టు

by Disha edit |
వైద్యుడు కాని వైద్యుడు ఫార్మసిస్టు
X

ఫార్మసిస్టు పర్యవేక్షణలోనే మందుల పంపిణీ జరగాలి. ఈ అవసరాన్ని స్వాతంత్ర్యం తొలినాళ్ళలోనే గుర్తించిన నాటి దేశాధినేతలు ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఫార్మసీ చట్టానికి రూపకల్పన చేశారు. 1948లో పార్లమెంటు దాన్ని ఆమోదించింది. అన్ని చట్టాల లాగానే ఇది కూడా పాక్షిక అమలుకే పరిమితమై పోయింది. ఇటు ఫార్మసిస్టులకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సొంతంగా ఫార్మసీలు పెట్టుకొనే స్థోమత లేక సర్టిఫికెట్లు అద్దెకు ఇచ్చుకుంటున్నారు.

రోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఫార్మసిస్టు పాత్ర అత్యంత ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న కొత్తకొత్త వ్యాధులనూ, వైరస్‌లనూ దృష్టిలో ఉంచుకొని, దానికి తగినట్లుగా కొత్త మందులను తయారుచేయడం, నివారణా మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్టు పాత్ర కీలకం. కొవిడ్ 19 సహా, మరెన్నో సవాళ్లను స్వీకరించి ఫార్మసిస్టులు అలుపెరుగని ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నూతన ఔషధాల ఆవిష్కరణలో మన దేశ ఫార్మసిస్టుల కృషి శ్లాఘనీయం. ఔషధాల తయారీ, వాటి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించడం, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధాలను నిల్వచేయడం, వ్యాధిగ్రస్తులకు మందుల వినియోగ విధానం పట్ల తగిన సూచనలు, సలహాలు అందజేయడం, వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడం లాంటి అనేక విషయాలలో ఫార్మసిస్టు పాత్ర విస్మరించలేనిది.

ఔషధాన్ని ఏ మోతాదులో ఎలా వినియోగించుకోవాలో ఫార్మసిస్టులే అవగాహన కల్పించగలరు. రోగికి వైద్యునికి మధ్య ఒక సంధానకర్తగా వ్యవహరించి, ప్రజారోగ్య పరిరక్షణలో తన భూమికను బాధ్యతాయుతంగా నిర్వహించగలరు. వ్యాధిని గుర్తించి, దానికి తగిన మందును సూచించేవాడు వైద్యుడైతే, ఔషధ ఎంపిక, మోతాదు, వినియోగ విధానం సమస్తమూ అవగాహన కల్పించేది ఫార్మసిస్టు. నిజం చెప్పాలంటే అతడే తెరవెనుక వైద్యుడు.

ఆ బాధ్యత వారిదే

అందుకే ఆరోగ్యకేంద్రాలలో అత్యవసర పరిస్థితులలో వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు చికిత్స అందించే బాధ్యతను ఫార్మసిస్టులే తీసుకుంటారు. శంకర్‌రావు చవాన్ పార్లమెంటరీ సబ్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. కేంద్ర ఆరోగ్యశాఖ జాతీయ ఆరోగ్య విధానం 2017 లో ఫార్మసిస్టు విశిష్టతను గుర్తించింది. ఫార్మసిస్టులకు సామాజిక ఆరోగ్యంపై శిక్షణ ఇచ్చి వారి సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని సూచించింది. జై సుఖ్ లాల్ హాతీ, జస్టిస్ లెంటిన్, బజాజ్ కమిటీలు వైద్యశాల ఫార్మసీ విభాగాల మెరుగుదలకు అనేక సూచనలు, సిఫారసులు చేశాయి. అజిత్ ప్రసాద్ జైన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టడీ గ్రూప్ ఆన్ హాస్పిటల్స్, చిన్నపాటి వైద్యశాలలలో కూడా కనీసం ముగ్గురు ఫార్మసిస్టులు ఉండాలని 1966 లోనే సిఫారసు చేసింది.

చికిత్స ద్వారా ఆశించిన ఫలితం రావాలంటే ఫార్మసిస్టు ప్రమేయం తప్పనిసరి. ఎందుకంటే, ఏ వ్యాధికి ఏ మందు ఏ విధంగా పనిచేస్తుందో తెలిసేది ఒక్క ఫార్మసిస్టుకే. అంతేకాదు, కొన్నిసమయాలలో వైద్యులు రాసిన మందులను సమీక్షించే అధికారం కూడా ఫార్మసిస్టుకు ఉంటుంది. మందుల వినియోగంలో ఫార్మసిస్టుల పాత్రను విస్మరించడం వలన వాటి వినియోగం నియమరహితంగా, విచ్చలవిడిగా పెరిగిపోయింది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాంతక దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయి. ఔషధ ప్రమాణం, వినియోగాల విషయంలో నిర్ణయాధికార విజ్ఞానం ఫార్మసిస్టులకే ఉంటుంది. అందుకని ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మాసిస్ఠు పాత్రను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడానికి వీలు లేదు.

ఆయా దేశాలలో

ఈ కారణంగానే జర్మనీ, ఫ్రాన్స్ , బ్రిటన్, ఇటలీ లాంటి యూరోపియన్ దేశాలలో, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలలో ఫార్మసిస్టులకు పెద్దపీట వేస్తారు. ఆయా దేశాల వైద్యులు పరీక్షల అనంతరం వ్యాధిని గుర్తించి, ఫలానా వ్యాధి, ఫలానా మందు అని నిర్ధారణ చేస్తారు. ఆ వ్యాధికి ఏ ఔషధం సరిపోతుందో, అది ఏయే సమయాలలో, ఎంత మోతాదులో, ఏ విధంగా వినియోగించాలో ఫార్మసిస్టే రోగికి సూచిస్తాడు. కొన్ని యూరప్ దేశాలలో రోగి వ్యాధిని గుర్తించి, ఔషధాన్ని సిఫారసు చేసే అధికారం కూడా ఫార్మసిస్టుకు ఉంటుంది. మన దేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఫార్మసిస్టుకు, వైద్యునికి మధ్య అసలు సంబంధమే ఉండదు. అటువంటి వ్యవస్థే ఇక్కడ ఉనికిలో లేదు. ఔషధాన్ని సరైన విధానంలో, సరైన మోతాదులో వినియోగిస్తేనే రోగి త్వరితగతిన కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఫార్మసిస్టు పర్యవేక్షణలోనే మందుల పంపిణీ జరగాలి.

ఈ అవసరాన్ని స్వాతంత్ర్యం తొలినాళ్ళలోనే గుర్తించిన నాటి దేశాధినేతలు ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఫార్మసీ చట్టానికి రూపకల్పన చేశారు. 1948లో పార్లమెంటు దాన్ని ఆమోదించింది. అన్ని చట్టాల లాగానే ఇది కూడా పాక్షిక అమలుకే పరిమితమై పోయింది. ఇటు ఫార్మసిస్టులకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సొంతంగా ఫార్మసీలు పెట్టుకొనే స్థోమత లేక సర్టిఫికెట్లు అద్దెకు ఇచ్చుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాలలో ఫార్మాసిస్టు పోస్టులను భర్తీచేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఫార్మసీలు ఏర్పాటు చేసుకోవడానికి వడ్డీ రహిత రుణ సౌకర్యం కల్పించాలి. మరిన్ని నూతన ఆవిష్కరణలు చేసే విధంగా వారిని ప్రోత్సహించాలి.

(నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం)


ఎండీ ఉస్మాన్‌ఖాన్

జర్నలిస్టు, కెమిస్టు

99125 80645


Next Story

Most Viewed