ప్రేక్షకులుగా పోలీసులు! దానికి కారణం ఎవరు?

by Disha edit |
ప్రేక్షకులుగా పోలీసులు! దానికి కారణం ఎవరు?
X

నేరాన్ని పాతిపెట్టాలనే కసి ప్రతి పౌరుడిలో ఉంటుందనేది యదార్థం. అలా చేయగలవారున్ననూ, మళ్లీ ఈ సమాజాన్ని ముట్టి, తట్టి, కొట్టి అతలాకుతలం చేయగలిగిన సత్తా ఆ జాడ్యానికే ఉంది. నేరం ఎక్కడి నుంచో దిగుమతి కాదు. దారితప్పిన వ్యవహరించనెంచిన కొంతమంది వ్యక్తుల ఆలోచనలు, బలహీనతల నుంచి అది పుడుతుంది. నేరం చేసే ఆలోచనను అరికట్టుట కంటే, దానిని పసిగట్టి నేరం జరుగగల అవకాశాలను నివారించడం సులభమైన ప్రక్రియ.

పోలీసు శాఖ లేకున్నచో నేర నియంత్రణ కష్టమై అసమానతలమయమైన నేటీ సమాజం ఏ పరిస్థితులలో ఉండేదో! ఆ విషయం ఊహకందనిదేనని చెప్పుకొనవచ్చును. సామాజిక సహజీవన నినాదం ఓ ఆచరణాత్మక విధానంగా మారాలంటే పోలీసులు, పౌరులు పరస్పర మర్యాదలు, బాధ్యతలను ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కొనసాగించుకోవాలి. ప్రజల అపేక్షలను అర్థం చేసుకుంటూ చట్టం పరిధిలో సాధాన యోగ్య మార్పులను ప్రజల ముందుంచాలి. ప్రజలు కూడా పోలీసుల బాధ్యతలను చట్టంలో పొందుపరచబడిన సూచనలతో పోల్చుకోవాలే కానీ, తమ వ్యక్తిగత అభీష్టాలకు తావీయగూడదు. వారిపై వ్యతిరేక భావాలు ఉంచుకోకుండా సకారత్మక ధోరణి అవలంబించిన యెడల సామాజిక ఉద్రిక్తతలకు చోటుండదు. శాంతి వాతావరణం నెలకొనగలదు.

ముందు నుయ్యి వెనుక గొయ్యి

సమాజంలో చోటు చేసుకునే అలజడులను నియంత్రణలో ఉంచుటకు పోలీసులు తీసుకునే చర్యలకు భిన్నంగా పరుగెడుతున్న సామాజిక పోకడలు క్లిష్టతరంగా పరిణమిస్తున్నాయి. సమాజంపై పట్టు సాధించాలనుకొను సామాజికుల నుండి ఎన్నో విపరీత ధోరణులను చవిచూడాల్సి వస్తున్నది. అట్టి పరిస్థితులలో పౌర హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత నిర్వహణ పోలీసులకు భారంగా పరిణమించింది. భిన్న భాగాలుగా విడిపోయిన సమాజం పోలీసులపై తమ అపేక్షలను పెంచుకొని సఫలీకరణలకు ఒత్తిడిని పెంచుతున్నది. దైనందిన కార్యకలాపాలలో సమాజం నుండి ఎదుర్కొంటున్న చిక్కు సమస్యల ముడులను విప్పలేక, విప్పిన ముడులతో సామాజిక విభాగాలను ఒప్పించలేక పోలీసులు నేడు ప్రజల నుండి అవిశ్వాసం, అపనమ్మకం ఎదుర్కొంటూ తన బాధ్యతలను కొనసాగిస్తున్నారు.

ప్రజాదరణ కొల్పోతున్న నాయకులు, మంత్రులు పోలీసు అధికారాలను అడ్డుపెట్టుకొని తమ పబ్బం గడుపుకొనడంతో పోలీసు శాఖ ప్రతిష్ట సన్నగిల్లుతున్నది. సమాజం అన్ని రంగాలలో పతనం దిశగా పయనిస్తున్నది. స్వార్థం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఊహకందని రీతిలో ఎదిగిపోతున్నవి. పర్యవసానంగా పోలీసు వ్యవస్థ అచేతనా వ్యవస్థలోనికి దిగజార్చబడుచున్నది. నేరస్థులపై పోలీసులు పాటించే వృత్తిపర చర్యలకు ఉద్భవించు వినూత్న పరిస్థితులకు, రాజకీయ ఒత్తిళ్లకు పొంతన కుదరడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఎదుర్కొనవలసిన అవసరాలను తీర్చలేకున్నందులకు పోలీసుల పరిస్థితి 'ముందు నుయ్యి వెనుక గొయ్యి' చందంగా పరిణమించింది. ఆ విష వలయంలో విధి విధానం బందీయైపోయింది.

నేరం పోకడలు

నేరాల పరంపర వికృతరూపం దాల్చి కత్తులు, తుపాకుల స్వైర విహారం దినచర్యగా మారింది. అన్ని నేరాలూ సంచలనాత్మకమే. కల్తీలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మత్తుపదార్థాల రవాణా వంటి నేరాలతో ప్రజల సొమ్ము దోపిడీకి గురియగుచున్నది. నేరతత్వాన్ని మార్చి సమాజ నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించుటకు చట్టం ప్రసాదించిన అధికారాలను చిత్తశుద్ధితో అమలు చేయగలవాడు పోలీసు అధికారి. అన్ని పరీక్షలను నెగ్గుకుంటూ, ప్రజామోదం పొందుటకు తన సమర్థతను అవసరాలకనుగుణంగా ఎదిగించుకోవాలి. సమయస్ఫూర్తి బుద్ధి కుశలతలను ఆయుధాలుగా ఎంచుకోవాలి. కుటుంబ సమస్యల నుంచి దేశ భద్రత వరకు పలు ఫిర్యాదులు పోలీసు స్టేషన్‌లో నమోదవుతుంటాయి.

నేరాలను మొగ్గదశలోనే తుంచివేయడం సరియైన చర్య. పారదర్శకత, సమతుల్యత, ఏకోన్ముఖత, శాస్త్రీయత, వృత్తి నిపుణులతో కూడిన సంస్కృతి ప్రతీ పోలీసు అధికారి స్వాభావిక గుణాలు మారాలి. వ్యక్తులను అరెస్టు చేయడంలో, సోదాల సమయంలో వివేకపూరిత నిర్ణయాలతో ముందుకు సాగాలి. అప్పుడే వారు పౌరులు-పోలీసుల పారదర్శక విధానాలను అర్థం చేసుకునేవారవుతారు. స్టేషను లోపల, బయట ప్రజానీకంతో వ్యవహరించునప్పుడు పోలీసు అధికారి వేషభాషలు, ప్రవర్తన చూపరులను ఆకట్టుకోవాలి. పోలీసు అనగానే ప్రతి పౌరుని స్ఫురణకు వచ్చేది వారు ప్రయోగించే బల ప్రయోగం. చట్ట ప్రకారం పోలీసులకు అలాంటి అధికారాలున్ననూ అసాంఘిక పరిస్థితులను అదుపు చేయుటకు బలప్రయోగం మినహా అన్యమార్గం లేదను సత్యాన్ని పదర్శించగలగాలి.

పోలీసులపై కర్కశ పాదం

పోలీసు శాఖకు జీతభత్యాలు, కార్యాలయ ఖర్చుల బడ్జెట్ ప్రజల పన్నుల నుండి కేటాయించబడుతుంది. సమాజంలో జరిగే నేరాలు పోలీసులచే చేయబడినవి కావు. నేరం చేసేవాడు సామాజికుడే! బాధితుడూ సామాజికుడే. కావున నివారణోపాయాలు, ప్రణాళికలను సిద్ధపరచుటలో పోలీసులకు సహకరించాలి. బాధితులకు ఊరట కలిగించినప్పుడే అది ప్రజాపాలనగా అర్థమవుతుంది. పోలీసులకు తమకు తాముగా నేర నిరూపణ చేయగల న్యాయ వ్యవస్థ లేదు. పోలీసులు భద్రతనందించడంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడతారు. రాత్రింబవళ్లు కష్టించి పనిచేస్తారు. అయిననూ వారికి ప్రజల నుండి ఆశించిన సహకారమందడంలేదు.

పరిమితులెరుగని పోలీసుల పని సమయం, విశ్రాంతి నెరుగని పరిశ్రమ, సమాజం చిందించే అవకాశవాదులు వంటి కారణముల వలన ప్రజలతో మొరటుగా ప్రవర్తించే అవకాశాలు లేకపోలేదు. అదంతా పరిస్థితుల ప్రభావమే తప్ప స్వాభావిక ప్రవర్తనా దోషం కాదని అర్థం చేసుకోవాలి. నేడు పోలీసు శాఖ ఎక్కువశాతం పాలకుల వలన దురుపయోగమవుచున్నది. కిందిస్థాయి ఉద్యోగులను వ్యక్తిగత సేవలకుపయోగించుకోవడం చూస్తున్నదే. ఈ పరిస్థితి మారాలి. నేరస్థులు నిర్దోషులుగా విడుదలయ్యే సందర్భంలో అంకిత భావం గల పోలీసు అధికారి దిగ్భ్రమకు గురికాక తప్పదు. దీంతో అతని సమర్థత నీరుగారిపోతుంది. నిరాశావహులైన పోలీసులను అక్కున చేర్చుకొని ఊరట పాఠాలు బోధించి, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం నేడు జరుగుతున్న చరిత్ర.

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170


Next Story

Most Viewed