ఉద్యమ సంఘాలతోనే సమస్యల పరిష్కారం

by Bhoopathi Nagaiah |

పాతికేళ్ళ క్రితం కళకళలాడుతున్న ఉపాధ్యాయ సంఘాలను చూసిన కళ్లతో నేడు వెలవెలబోతున్న సంఘాల్ని చూడాల్సి రావడం శోచనీయం.

ఉద్యమ సంఘాలతోనే సమస్యల పరిష్కారం
X

ఒకటి కాదు... రెండు కాదు మొత్తం యాభైకి పైగా ఉపాధ్యాయ సంఘాలు. రెండు ఫోటోలుంటే ఒక సంఘం.. కులానికి ఒక సంఘ, క్యాడర్‌కు ఒక సంఘం, సబ్జెక్టుకు ఒక సంఘం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖకు లేనన్ని సంఘాలు ఉపాధ్యాయులకే ఎందుకు? మిగతా శాఖలలో సమస్యలకన్నా ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కువ? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఉపాధ్యాయులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది...

పాతికేళ్ళ క్రితం నేను సర్వీసులో చేరిన కొత్తల్లో కళకళలాడుతున్న ఉపాధ్యాయ సంఘాలను చూసిన కళ్లతో నేడు వెలవెలబోతున్న సంఘాల్ని చూడాల్సి రావడం శోచనీయం. ఉపాధ్యాయుల సమస్యలను మేము సాధించామంటే మేము సాధించాం అని చెప్పుకునే సంఘాల పనితీరును ఉపాధ్యాయులు బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. సంఘాలు ఒకటో రెండో ఉంటే ప్రభుత్వాలు ఆయా సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారు. సంఘాలు ఎక్కువ అవ్వడంతో ఉపాధ్యాయుల ఐక్యతను దెబ్బతీయడంలో పాలక పక్షాలు విజయం సాధించాయనే చెప్పవచ్చును.

పిలుపునిస్తే కదిలి వచ్చేవాళ్లు

పాత కాలంలో ఏదైనా ఒక సంఘం ఉద్యమానికి పిలుపు ఇస్తే సమస్య తమదయినా కాకున్నా అందరు అందరి కోసం కదిలి వచ్చేవారు. కానీ రాను రాను సంఘాల సంఖ్య పెరిగిపోవడం దానితో పాటుగా టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులు కేవలం సోషల్ మీడియాలో ఉద్యమాలకే పరిమితం అవుతున్నారు. సమస్యలు తమవయినా కూడా ఉద్యమబాట పట్టే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది.

ఉద్యమాలను ఊపిరిగా భావించిన తరం

ఉద్యమాలను ఊపిరిగా భావించిన తరం కనుమరుగు కావడంతో ప్రభుత్వాలు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారు అయ్యింది. స్పందించేవారే కనుమరుగు అయితే సంఘాలు మాత్రం ఏం చేయగలవు. అసలు సంఘం అంటే అదేదో బ్రహ్మపదార్థం అన్న భ్రమ నుండి ఉపాధ్యాయులు బయటకు రావాలి. సంఘం అంటే మనందరి సమూహమే అనే విషయాన్ని గుర్తెరిగి ఏదయినా సమస్య వచ్చినప్పుడు ఉద్యమ పిలుపునకు స్పందించకుండా సంఘ నాయకులను నిందిస్తే ఏం లాభం? సభ్యత్వం సమయంలో సంఘ నాయకులతో వాగ్వివాదానికి దిగే ఉపాధ్యాయ సోదరులు నిజంగా ఆ సంఘం ఉద్యమానికి పిలుపునిచ్చిప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ ప్రశ్నకు జవాబు దొరికితే ఇప్పటి పరిస్థితికి కారణం కూడా బోధపడుతుంది. ఉపాధ్యాయులు ఇప్పుడు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ ఉద్యమాల ద్వారా సాధించుకున్నవే అన్న విషయాన్ని ఉపాధ్యాయ లోకం మరచిపోకూడదు.ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుతున్న యువరక్తం ఉద్యమాలను చిన్నచూపు చూస్తే మాత్రం ఇప్పుడున్న సౌకర్యాలన్ని ఒక్కటొక్కటిగా ఊడడం మాత్రం ఖాయం. నేడు ఉపాధ్యాయులు ఆరు నెలలకొకసారి పొందుతున్న కరువు భత్యం(డిఏ),పెన్షన్ సౌకర్యం, మహిళా ఉపాధ్యాయులు అందనంగా పొందుతున్న ఐదు ఆకస్మిక సెలవులు తదితర సౌకర్యాలు సంఘం పోరాడి సాధించుకున్నవే అన్న విషయాన్ని ఉపాధ్యాయులు మరచిపోకూడదు.

ఉద్యమ సంఘాలకు మద్దతు ఆవశ్యం..

79 సంవత్సరాలుగా ఉద్యమాలే ఊపిరిగా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 80వ వసంతంలోకి దూసుకుపోతున్న రాష్ట్రోపాధ్యాయ సంఘం అనేక ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూపిందన్న మాట అక్షరసత్యం. 80 వసంతాల సంఘ ప్రస్థానంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. సమస్యల సాధనకు ఉద్యమ సంఘాలకు మద్దతుగా నిలిచే గురుతర బాధ్యత ఉపాధ్యాయులది. ఆ దిశగా ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు అడుగులు వేస్తారని ఆశిద్దాం.

-సుధాకర్ ఏ.వి.

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు

స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)

90006 74747

Next Story