‘సామాజిక’.. బూతు పురాణం?

by Ravi |   (  Updated:2026-07-10 01:14:01  IST  )

సోషల్ మీడియా వేదికలు భావ వ్యక్తీకరణకు బదులుగా ఆన్‌లైన్ ట్రోలింగ్, అసభ్య వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రచారానికి కేంద్రాలుగా మారుతున్నాయి..

‘సామాజిక’.. బూతు పురాణం?
X

సమాచార సాంకేతిక విప్లవం మానవ మేధస్సుకు పదును పెట్టి, ప్రపంచాన్ని ఒక చిన్న గ్లోబల్ విలేజ్‌గా మార్చేసింది. అయితే, ఆ సాంకేతిక విప్లవం నుంచి అద్భుత ఆవిష్కరణల్లో ఒకటిగా మారిన సోషల్ మీడియా మాత్రం గతి తప్పిందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ వేదికలను గమనిస్తే సభ్యసమాజం తలదించుకునేలా బూతుపురాణానికి అడ్డాలుగా మారాయి..

ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ సహా ఏ వేదిక తీసుకున్నా.. భావ మార్పిడికి, సృజనాత్మకతకు వేదికలుగా నిలవాల్సింది పోయి.. వికృతమైన పొలిటికల్ ట్రోలింగ్‌, ఒకరినొకరు వ్యక్తిగతంగా కించపరుచుకునే ‘హేటర్స్ మీడియా’గా రూపాంతరం చెందాయి. ప్రతి పది పోస్టుల్లో ఒకటి, రెండు సభ్య సమాజం తలదించుకునే భాషతో నిండి ఉంటున్నాయి. డిజిటల్ స్వేచ్ఛను అరాచకత్వంగా మార్చేస్తున్న ఈ వికృత పోకడలను ఇప్పుడే అడ్డుకోకపోతే, వచ్చేతరం తీవ్రమైన విలువల సంక్షోభంలో కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.

స్వీయ నియంత్రణ పాటిస్తున్నామా?

సోషల్ మీడియాలో పెరుగుతున్న అసభ్యతకు ప్రధాన కారణం స్వీయ నియంత్రణ లోపం. ఒక గదిలో నలుగురు స్నేహితులు కూర్చుని మాట్లాడుకునే వ్యక్తిగత పరిమితులు వేరు.. లక్షల మంది చూసే బహిరంగ డిజిటల్ వేదికలపై మాట్లాడే బాధ్యత వేరు. సోషల్ మీడియా అనేది ఒక ఆధునిక చౌరస్తా లాంటిది. రోడ్డు మీద నిలబడి ఎలాగైతే అసభ్య పదజాలంతో దూషిస్తే చుట్టుపక్కల ఉన్న సమాజం అంగీకరించదో, డిజిటల్ ప్రపంచంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వ విధానాలను, రాజకీయ సిద్ధాంతాలను ప్రతి పౌరుడికి విమర్శించే హక్కు ఉన్నప్పటికీ, అది హుందాగా, తార్కికంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం వాక్ స్వాతంత్ర్యం కాదు.. అది సామాజిక బాధ్యతను విస్మరించే చర్య.

బూతులు తిట్టడమే కల్చరా?

హేట్ కల్చర్ వల్ల వచ్చే తరానికి మనం ఎలాంటి సమాజాన్ని, విలువలను అందిస్తున్నామనేది ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. అసభ్యత అనేది సోషల్ మీడియాలో నిరంతరం మీమ్స్, రీల్స్, కామెంట్ల రూపంలో వైరల్ కావడం వల్ల పిల్లల మెదడులో ఆ పదాలు చాలా సాధారణమైనవి అనే ముద్ర పడిపోతున్నది. ఇది సమాజంలో ఒక ప్రమాదకరమైన ‘నార్మలైజేషన్’కు దారితీస్తున్నది. భిన్నాభి‌ప్రాయాలను గౌరవించే ఓర్పు నశించి, మనకు నచ్చని కామెంట్ కనిపిస్తే చాలు వందలమంది గుంపుగా చేరి సదరు వ్యక్తిపై ‘డిజిటల్ దాడి’కి పాల్పడుతున్నారు. యువతలో ఈ విధమైన అసహనం, హింసాత్మక ప్రవృత్తి పెరగడం వల్ల భవిష్యత్తులో శాంతియుత సహజీవనం అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ వికృత ట్రెండ్ వచ్చే తరానికి ‘సమాజంలో గుర్తింపు రావాలన్నా.. డబ్బు సంపాదించాలన్నా బూతులు మాట్లాడటమే సులువైన మార్గం’ అనే తప్పుడు సంకేతాన్ని బలంగా పంపుతున్నది.

ప్రభుత్వాలు మేల్కొనాలి..

ఆన్‌లైన్ వేధింపులు, అసభ్య కంటెంట్‌ను అరికట్టడంలో ప్రభుత్వాలు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టాల్లో శిక్షలు ఉన్న ప్పటికీ.. వాటి అమలులో స్పష్టమైన పక్షపాతం కనిపిస్తున్నది. రాజకీయ పెద్దలను విమర్శిస్తే ఉన్న ఫళంగా స్పందించే చట్టం, ఒక సామాన్య మహిళను లేదా పౌరుడిని ఆన్‌లైన్‌లో దారుణంగా వేధిస్తున్నప్పుడు అంతే వేగంగా స్పందించడం లేదు. చట్టం అందరికీ సమానంగా వర్తించినప్పుడే దానికి గౌరవం, వ్యవస్థపై భయం ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వాలు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక సైబర్ క్రైమ్ లీగల్ సెల్స్‌ను ఏర్పాటు చేయాలి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఆన్‌లైన్ వేధింపులు, బూతు కంటెంట్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా మూడు నుంచి ఆరు నెలల లోపు కఠినమైన శిక్షలు పడేలా న్యాయ సంస్క రణలు తీసుకురావాలి. సోషల్ మీడియా సంస్థలు కూడా తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో స్థానిక యాసలతో తిట్టే తిట్లను గుర్తించేలా తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్టర్లను బలోపేతం చేసుకునేలా ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలను కఠినతరం చేయాలి.

రిపోర్ట్.. మన హక్కు!

సోషల్ మీడియాలో ఉపయోగకరమైన సమాచారంతో పాటు అసభ్య, అభ్యంతరకర కంటెంట్ కూడా ఎక్కువగా కనిపి‌స్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు, సమాజం యాక్సెప్ట్ చేయని విధమైన కంటెంట్, పోస్ట్ ఏది కనబడినా వెంటనే రిపోర్ట్, కంప్లయింట్ ఆప్షన్లు ఉపయోగించడం అలవాటు చేసుకో‌వాలి. లేదంటే మీ తర్వాతి తరం కూడా అదే దారిలో వెళ్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు. బాధ్యతగల ప్రతి నెటిజన్ ఒక సైబర్ సైనికుడిలా మారాలి. సోషల్ మీడియా అల్గారిథమ్‌ ప్రకారం ఒక పోస్టుకు ‘మాస్ రిపోర్టింగ్’ చేస్తే రీచ్ తగ్గి పోతుంది లేదా ఆ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంప్లయింట్ చేసి వారి అకౌంట్లను, వ్యూస్‌ను దెబ్బతీస్తామో.. అప్పుడు ఆర్థికంగా నష్టం వస్తుందనే భయంతోనైనా ఆ వికృత కంటెంట్ క్రియేటర్లు వెనక్కి తగ్గుతారు. డిజిటల్ సమాజాన్ని శుభ్రం చేయడం మన చేతుల్లోనే ఉందనే స్పృహ ప్రతి నెటిజన్‌కూ రావాలి.

ఆన్‌లైన్ రౌడీయిజాన్ని అంతం చేయాలి!

ఆన్‌లైన్‌లో పెరుగుతున్న అసభ్య కంటెంట్‌ను అరికట్టాలంటే చట్టాలు మాత్రమే సరిపోవు. సమాజం బాగు కోసం, రాబోయే తరం భవిష్యత్తు కోసం ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న తటస్థులు, విద్యావంతులు, మేధావులు ముందుకు వచ్చి డిజిటల్ ఎథిక్స్‌పై అవగాహన కల్పించాలి. లేకపోతే ఈ డిజిటల్ కాలుష్యం రేపు మన ఇంట్లోని పిల్లలను కూడా విషపూరితం చేస్తుంది. రాజకీయాలో, ట్రోలింగో మాకెందుకులే అని తటస్థులు మౌనంగా ఉండటం వల్లే ఈ ఆన్‌లైన్ రౌడీయిజం ఇంతలా రెచ్చిపోతున్నది. సమాజంలో చెడ్డవారు చేసే శబ్దం కంటే, మంచివారు పాటించే మౌనమే ఎక్కువ ప్రమాదకరమనే సత్యాన్ని మనమంతా గ్రహించాలి. సోషల్ మీడియాలో హుందాతనాన్ని, సంస్కారాన్ని పెంపొందించేలా ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురావాలి. మనమందరం కలిసికట్టుగా ఒక సామాజిక బహిష్కరణ ఉద్యమాన్ని చేపట్టి, బూతులు మాట్లాడే పేజీలను, చానళ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించినప్పుడే ఈ సమాజానికి శాశ్వత విముక్తి లభిస్తుంది.

-హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story