- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న పొదుపులు.. దేశ ఆర్థికానికి పెద్ద బలం!
చిన్న మొత్తాల పొదుపు పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంపై విశ్లేషణ

దేశ ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు ఎంత ముఖ్యమో, ప్రజల్లో పొదుపు సంస్కృతి అంతే కీలకం. ముఖ్యంగా చిన్న మొత్తాల్లో పొదుపు చేసే కుటుంబాలే దేశీయ పొదుపు వ్యవస్థకు బలమైన పునాది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు, రైతులు, ఉద్యోగులు, గృహిణులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ జీవితకాల పొదుపులను భద్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఆధారపడుతున్నారు.. పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రాలు (ఎన్‌ఎస్‌సీ), సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్రం వంటి పథకాలు లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తున్నాయి. ఇలాంటి పథకాలపై కేంద్ర ప్రభుత్వం వరుసగా తొమ్మిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం చిన్న పొదుపు దారుల్లో నిరాశను కలిగిస్తోంది.
జీవన వ్యయాల పెరుగుదల నేపథ్యంలో..
ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణ వ్యయ నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో పొదుపుదారుల ఆశలను ఇది పూర్తిగా నెరవేర్చలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలు కేవలం పెట్టుబడి సాధనాలు మాత్రమే కావు.. పిల్లల విద్య, వివాహాలు, వైద్య అవసరాలు, వృద్ధాప్య భద్రత వంటి జీవితంలోని ముఖ్యమైన దశలకు ఇవి ఆర్థిక అండగా నిలుస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పోస్టాఫీస్ పొదుపు పథకాలపై విశ్వాసం ఎక్కువ. ప్రభుత్వ హామీ, స్థిరమైన రాబడి, పన్ను ప్రయోజనాలు ఈ పథకాల ఆదరణకు కారణాలు. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం చిన్న పొదుపుదారులపై ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి రంగాల్లో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పెరగకపోతే పొదుపుల వాస్తవ విలువ తగ్గుతుంది.
వడ్డీ పెంపుతో పాటు..
చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేవారిలో అధిక శాతం మంది సాధారణ ఆదాయ వర్గాలకు చెందినవారు. వారికి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు వంటి ప్రత్యా మ్నాయ పెట్టుబడి మార్గాలపై ఆసక్తి ఉండకపోవచ్చు. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే ఈ వర్గానికి ప్రభుత్వ పథకాలే ప్రధాన ఆధారం. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వృద్ధులు వడ్డీ ఆదాయంపై ఆధారపడుతున్నందున ప్రతి శాతం వడ్డీ వారికి ఎంతో విలువైనది. మహిళల ఆర్థిక సాధికారతలో కూడా చిన్న పొదుపు పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కుటుంబ ఖర్చుల నుంచి ఆదా చేసిన మొత్తాలను మహిళలు భవిష్యత్ అవసరాల కోసం ఈ పథకాలలో పెట్టుబడి పెడు తున్నారు. ఇటువంటి వర్గాల కోసం వడ్డీ రేట్ల పెంపు ఒక్కటే పరిష్కారం కాదు. చిన్న పొదుపు పథకాల నిర్వహణలో పార దర్శకత పెంచాలి. గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలను విస్తరించాలి. పోస్టాఫీసుల ఆధునికీకరణ, సులభమైన ఆన్‌లైన్ సేవలు, పథకాలపై అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలి.
వారిని కాపాడుకోవడం సామాజిక బాధ్యత!
చిన్న పొదుపు దారులు ప్రభుత్వానికి భారం కాదు.. వారు దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన భాగస్వాములు. వారి పొదుపులే అభివృద్ధి కార్యక్రమాలకు పరోక్ష మూలధనంగా మారుతున్నాయి. కాబట్టి వారి ప్రయోజనాలను కాపాడటం ఆర్థిక అవసరం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా. వరుసగా తొమ్మిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసా గించడం ఒక విధాన నిర్ణయం కావచ్చు. కానీ పెరుగుతున్న జీవన వ్యయం, తగ్గుతున్న కొనుగోలు శక్తి, వృద్ధాప్య భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చిన్న పొదుపు దారుల ప్రయోజనాలను పునఃపరిశీలించాలి. దేశ అభివృద్ధి కేవలం భారీ పెట్టుబడులతోనే సాధ్యం కాదు. కోట్లాది కుటుంబాలు క్రమ శిక్షణతో చేసే చిన్న చిన్న పొదుపులు కూడా ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది. అందుకే చిన్న పొదుపు పథకాలపై చిన్న చూపు కాకుండా, పెద్ద దృష్టితో విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
-తిప్పర్తి శ్రీనివాస్,
9948439565






