తెలంగాణ సినిమా కోసం

by Ravi |   (  Updated:2025-03-02 01:15:17  IST  )

సినిమా సమస్త కళల సమాహారం. దర్శకుడితో మొదలై కథకుడు, నటీనటులు, ప్లేబ్యాక్‌ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ

తెలంగాణ సినిమా కోసం
X

సినిమా సమస్త కళల సమాహారం. దర్శకుడితో మొదలై కథకుడు, నటీనటులు, ప్లేబ్యాక్‌ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఆర్ట్, వీఎఫ్‌ఎక్స్, డబ్బింగ్‌.. ఇలా విభిన్న కళాకారుల సమిష్టి కృషి సినిమా. నటనతో పాటు భిన్న దృక్పథాలతో సినిమా రంగంలోకి ఎందరో వస్తారు. ఇబ్బందులు పెడుతున్న పేదరికం, అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరగడం, యాక్టింగ్ సెంటర్‌ల చుట్టూ తిరగడం, సగం నిండిన కడుపును అరచేతి గుప్పిట్లో దాచుకొని కళనే తమ జీవిత పరమార్థం అనుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టేవారు ఎందరో...

కనీసం ఒక్కసారైనా తమ పేరును తెరమీద చూసుకోవాలనే వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్నా కళాకారులకు ఎక్కడో ఒకచోట సాయం అందాలి. సినీరంగం వైపు అడుగులేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి. ఆ ఆపన్న హస్తాన్ని అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. ఇందుకుగాను ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నిపుణులైన సినిమా పెద్దల సలహా సూచనలు మేరకు వర్థమాన నటులకు, దర్శకులకు, లిరిక్, స్క్రిప్ట్ రైటర్‌లకు తనదైన శైలిలో వేదికను ఏర్పాటు చేసింది. నూతన ఔత్సాహికులకు గుర్తింపు లభించే విధంగా కొత్త కొత్త శిబిరాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుంది.

సినిమా అవకాశాలు లభించేలా..

ఈ క్రమంలోనే తెలంగాణ బిడ్డ, సినీ వైతాళికుడు పైడి జయరాజ్ యాదిలో రవీంద్రభారతిలోని థియేటర్‌కు పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ అని నామకరణం చేసి యువతరం తీసిన షార్ట్‌ ఫిల్మ్స్‌ని డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించేందుకు అవకాశాలను కలిగించి వారి నైపుణ్యాలను, లోపాలను ఇదే వేదికపై తెలియజేసి చక్కని మార్గదర్శనం కోసం ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, సినీ ప్రముఖులు, నిపుణులు, ప్రముఖ సినీ విమర్శకులతో చర్చాగోష్టిని నిర్వహిస్తున్నారు. ప్రతిభావంతులైన నటులకు, దర్శకులకు, రైటర్‌లకు సినిమా అవకాశాలు లభించేలా ఒక దారిని చూపిస్తున్నది ఈ థియేటర్. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పోరాటాలు, యధార్థ గాథలతో పాటు నేటి మోడ్రన్‌ కమర్షియల్‌ సినిమాల నాణ్యతను పరిచయం చేసేలా సరికొత్త రీతిలో ముందడుగు వేసింది.

ఫిలిం ఇండస్ట్రీకి గైడ్

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ మూడవ వెర్షన్‌ను సగర్వంగా పునః ప్రారంభిస్తుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా.. సినీ వారం పేరిట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మార్గదర్శక వేదికగా గొప్ప విజయాన్ని సాధించింది. నిత్యం ప్రభవిస్తున్న ప్రతిభను, కళాకారులను గుర్తిస్తూ పదిహేను మంది నవ యువ దర్శకులను, వందలాది మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించింది. ముందు ముందు కూడా అందించబోతుంది. సినివారం కొత్త వెర్షన్‌తో అవకాశాలను మరింత విస్తరించడానికి, కళాత్మక నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి, ఆశావహ దర్శకులు, సినీ ప్రేమికుల కోసం మరింత ఉత్సాహవంతమైన వ్యవస్థను సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

యువత మేధో సృష్టికి ప్లాట్ ఫాం

ఈ నేపథ్యంలో భాషా సాంస్కృతిక శాఖ చిత్ర నిర్మాతలు, కళాకారులు, తెలుగు సినిమా ఔత్సాహికులందరినీ ఆహ్వానిస్తోంది. మీరు తీసిన లఘు చిత్రాలు, ఫీచర్ ఫిల్మ్‌లను వాటి సంక్షిప్త కథ, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలతో మాకు పంపించండి. నిపుణులు వాటిని చూసి, ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శించబడతాయి. సినిమాలు, కళల ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతిభావంతుల కోసం ఈ థియేటర్ తలుపులు తెరిచే ఉంటాయి. మీ చలన చిత్రాల ప్రదర్శనకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సృజనాత్మకతను శాఖ వారు గౌరవించడమే కాదు... యువతరం మేధో సృష్టికి ఒక ఫ్లాట్ ఫాం ఏర్పాటు దిశగా ఈ థియేటర్ నిర్మాణం జరిగింది.

పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌

తెలంగాణ సినిమాకు కథా బలం ఉన్న మంచి సినిమాలు ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌ తిరిగి పునః ప్రారంభం కాబోతున్నది. సినీవారంగా ప్రారంభమైన ఈ వేదిక ఒక థియేటర్‌ను నిర్మించుకుని పైడి జయరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌గా మారింది. ఈ వేదిక నుంచి సినీవారం, సండే సినిమా, ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, టాక్‌ ఎట్‌ సినీవారం ఇలా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ వేదిక నుంచి సినిమా రంగానికి సంబంధించి 24 క్ట్రాఫ్టుల్లో నైపుణ్యాలు నేర్చుకున్న వారిలో చాలామంది డైరెక్టర్లుగా, టెక్నిషియన్లుగా, నటీనటులుగా మారారు. వీళ్లంతా మంచి పొజిషన్లలో ఉన్నారు. ఇదంతా పైడి జయరాజ్‌ థియేటర్‌ ద్వారా సాధ్యమైంది. ఈ ఆలోచనకు అంకురార్పణ చేసింది భాషా సాంస్కృతిశాఖ సంచాలకులు హరికృష్ణ. సినిమాపై ముఖ్యంగా తెలంగాణ సినిమాపై తనకు ఉన్న ఇష్టం వారిని దీనికి పురికొల్పింది. ఇది ట్రైనింగ్‌ సెంటర్‌గా మారింది. టాలెంట్‌ ఉంటే సినిమాకు సంబంధించి కొన్ని మెళకువలు నేర్చుకుంటే రాణించవచ్చు. అవకాశాలు పొంద వచ్చు అన్నది ఈ వేదిక ద్వారా హరికృష్ణ చూపెట్టారు. అందుకే సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూనే తిరగాల్సిన అవసరం లేదని ప్రత్యామ్నాయ వేదికను నెలకొల్పారు. ఇలా అనేక కార్యక్రమాలు పురుడు పోసిన ఈ వేదిక కొవిడ్‌ సమయంలో ఒకసారి బంద్‌ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల మరోసారి ఆగిపోయింది. మూడోసారి కొత్తగా ఈ వేదిక పునః ప్రారంభం కాబోతున్నది. సినీవారం, సండే సినిమా, ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఫిల్మోత్సవం, టాక్‌ ఎట్‌ సినీవారం, చిత్రోత్సవం, తెలంగాణ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి పైడి జయరాజ్‌ సినీవారం తిరిగి తిరిగి స్వాగతం పలుకబోతున్నది.

అన్ని సినిమాలూ ఇక్కడే...

సినీవారంలో షార్ట్‌ ఫిల్మ్‌లు వేస్తారు. సండే సినిమాలో వరల్డ్‌ సినిమాలు ప్రదర్శిస్తారు. ఫెంటాస్టిక్‌ ఫైవ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రేట్‌ ఇండియన్‌, వరల్డ్‌ సినిమాలు. కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, జపాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇరాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ మళ్లీ నిర్వహించబోతున్నాం. అవతరణ ఫిల్మోత్సవం, బతుకమ్మ ఫిల్మోత్సవంలో కొత్త తెలంగాణ సినిమాలను ప్రదర్శిస్తాం. టాక్‌ ఎట్‌ సినీవారంలో ప్రతి శనివారం ఒక డైరెక్ట ర్‌ను తీసుకొచ్చి వారి అనుభవాలు పంచుకున్నారు. సందీప్‌రెడ్డి వంగా, హరీశ్‌ శంకర్‌, వంశీ పైడిపెల్లి, తరుణ్‌ భాస్కర్‌, వేణు ఊడుగుల ఇలా చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ డైరెక్టర్లు వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. దీని ద్వారా ఔత్సాహిక డైరెక్టర్లకు సినిమాకు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన కల్పించాం. ఈ రెండేళ్ల కాలంలో వచ్చిన నూతన దర్శకులతో దాన్ని కొనసాగిస్తాం. చిత్రోత్సవం ద్వారా ప్రభుత్వానికి సంబం ధించి మంచి కార్యక్రమం జరిగినప్పుడు దానిపై షార్ట్‌ ఫిల్మ్‌ కంటెస్ట్‌లు పెట్టాం. అందులో పాల్గొన్న వారికి గిఫ్టులు ఇచ్చి సత్కరిస్తాం. ప్రత్యామ్నాయ సినిమాను, మంచి సినిమాను, కమర్షియల్‌ సినిమాల్లోనూ హ్యూమన్‌ యాంగిల్‌ ఉండాలనే ఫిల్మ్‌ తెలంగాణ రూపొందించాలన్నది ఈ వేదిక ముఖ్య ఉద్దేశం. రండి! ఈ వేదికలో భాగస్వాములు కండి! మీ సినిమా కలను సాకారం చేసుకునే దిశగా అడుగేయండి!!!

- సంతోష్ ఇస్రం

94929 20530

Next Story