- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరళ జీవితం.. ప్రబల రాజకీయం
స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూయడం

స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూయడం భారత ప్రజాస్వామ్యానికి తీరని లోటు. ఆయన జీవితం చరిత్రలో ఓ విలక్షణ అధ్యాయంగా నిలిచిపోతుంది. “నాయకుడు పదవుల్లో ఉండి సేవ చేయవచ్చు. కానీ పదవుల అవసరం లేకుండానే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేవాడే నిజమైన నాయకుడు” అనే మాటకు వీఎస్ అచ్యుతానందన్ జీవితం స్పష్టమైన నిదర్శనం. తన నిరాడంబర జీవనశైలి, నిస్వార్థ సేవతో ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన వీఎస్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అర్థం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలోని గుత్తాధిపత్యంపై విమర్శలు చేస్తూ, అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ టెక్నాలజీకి మద్దతుగా నిలిచారు. ప్రజల హక్కుల కోసం నిరంతరంగా అధ్యయనంలో నిమ గ్నమై ఉండే ఆయనను, “నిత్య విద్యార్థి” అని అనేక రాజకీయ నేతలు అభివర్ణించారు.
పేదరికం నుంచి ప్రజా నాయకత్వం వరకూ..
1923 అక్టోబర్ 20న కేరళలోని అలప్పుజలో పుట్టిన అచ్యుతానందన్ బాల్యంలోనే పేదరికంతో పోరాడాడు. ప్రాథమిక విద్యలోనే చదువు ఆపవలసి వచ్చిన ఆయన, దర్జీ దుకాణం, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పని చేశాడు. ఈ అనుభవాలే ఆయనలో కార్మికుల పట్ల గాఢమైన అనుబంధాన్ని కలిగించాయి. 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆయన, ట్రావెంకోర్ సంస్థానంలో భూస్వాములపై పోరాటాల్లో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. 1964లో సీపీఐ చీలిక సమయంలో సీపీఎం ఏర్పాటు ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే సంవత్సరం మొదలైన ఆయన శాసనసభ ప్రస్థానం దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. 1967 నుంచి 2016 వరకూ వరుసగా అసెంబ్లీకి ఎన్నికై ప్రజల మనసు గెలుచుకున్నారు.
ప్రజా సేవకు మచ్చుతునక
వీఎస్ అచ్యుతానందన్ 2006లో కేరళ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భూకబ్జా, అవినీతి వ్యతిరేకంగా చురుకుగా వ్యవహరించి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల అనేక వ్యతిరేకతలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ప్రజల ప్రయోజనాల కోసం పార్టీ క్రమశిక్షణకు ఎదురుగా వెళ్లేందుకు కూడా వెనుకాడని ధైర్యాన్ని ఆయన ప్రదర్శించారు. “పార్టీ కోసం ప్రజలు కాదు, ప్రజల కోసం పార్టీ ఉండాలి” అనే భావనతో జీవించిన ఆయన రాజకీయానికి ఒక మానవతా ముఖం ఇచ్చారు. 2016లో తన 93వ ఏట కూడా కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి కీలకంగా పనిచేశారు.
సాదాసీదా జీవనశైలి..
ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ నాయకునిగా ఎదిగిన ఆయన జీవితం ఈ కాలపు రాజకీయ నాయకులకు మార్గదర్శిగా నిలుస్తుంది. పదవులు కాకపోయినా ప్రజల మద్దతు పొందిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. విలువలతో కూడిన రాజకీయానికి ప్రతిరూపంగా నిలిచారు. ప్రజల పక్షాన నిబద్ధతతో, నిజాయితీతో, నిరాడంబరతతో సాగిన ఆయన జీవితం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. అచ్యుతానందన్ మృతితో ఒక యుగానికి ముగింపు పలికినట్టే.
వాడవల్లి శ్రీధర్
99898 55445






