కర్నాటకలో మూకీ చిత్రాల నిర్మాణం

by Bhoopathi Nagaiah |

అందరూ 1929లో కన్నడ ప్రాంతంలో మూకీలు నిర్మాణం జరుపుకున్నాయని అంటారుగానీ అది సరికాదేమో అనిపిస్తుంది.

కర్నాటకలో మూకీ చిత్రాల నిర్మాణం
X

అందరూ 1929లో కన్నడ ప్రాంతంలో మూకీలు నిర్మాణం జరుపుకున్నాయని అంటారుగానీ అది సరికాదేమో అనిపిస్తుంది. కానీ మైసూరు ప్రాంతంలో తొలి మూకీ తయారైంది 1924 లోనే. గుబ్బి వీరణ్ణనే స్వయంగా 1970 జనవరి విజయచిత్ర మాసపత్రికలో చెప్పుకున్నట్లుగా "1924లో బెంగుళూరులో కొత్త థియేటరు ఒకటి నిర్మించాము. మేము ప్రదర్శిస్తున్న "కబీరుదాసు" నాటకాన్ని చిత్రంగా తియ్యాలన్న ఉద్దేశ్యంతో రంగయ్యనాయుడు అనే ఒకాయన అడిగారు. సరేనన్నాము. కావలసిన పరికరాలు తెప్పించి థియేటరులోనే, ఆయన ఆ చిత్రాన్ని నిశ్శబ్ద చిత్రంగా తీశారు. కొంత మాత్రం భద్రావతీ ప్రాంతంలో తీశారు. పాత్రధారులం అందరం మేమే. సంస్థ మాదే. ఆవిధంగా నా సినిమా ప్రవేశం జరిగింది.”

ఇదే ఇంటర్వ్యూలో గుబ్బి వీరణ్ణ ఇంకా ''ఆ తర్వాత సినిమా నిర్మాణం మీద ఉత్సాహం కలిగి సొంతంగా సినిమాలు తియ్యాలన్న కోరిక కలిగింది. బెంగుళూరులోనే ఒక పెద్ద బంగళా తీసుకుని సినిమా తీయడానికి కావలసిన పరికరాలు తెచ్చి ‘హరిమాయ' అన్న నిశ్శబ్ద చిత్రం తీశాము. ఆ కంపెనీ పేరు 'కర్ణాటక ఫిలిం చేశారు. వై.వి.రావు ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. డిస్ట్రిబ్యూషన్ వై.వి.రావుకే ఇచ్చాము. ఆ తర్వాత 'హిజ్ లవ్ ఎఫైర్స్' అన్న సాంఘిక చిత్రాన్ని తీశాము. దాన్ని బెల్జియంకి. చెందిన ఆల్ఫ్రెడ్ అనే ఆయన డైరెక్ట్ చేశారని చెప్పుకున్నాడు.''

1915లోనే మూకీల ప్రింట్ తీశారు

అయితే గుబ్బి వీరణ్ణ చెప్పుకున్నట్లుగా 'కబీరుదాసు' మూకీ గురించి సైలెంట్ సినిమా (కె.ఆర్.వర్మ) లోనూ, సురేష్ చాబ్రియా 'లైట్ ఆఫ్ ఆసియా' లోనూ ఎక్కడా నమోదు కాబడలేదు. అయినప్పటికీ స్వయంగా గుబ్బి వీరణ్ణగారే చెప్పుకున్నారు గనుక ఈ సినిమా రూపొందిన విషయాన్ని కొట్టిపారేయలేం. ఇట్లా చరిత్రకెక్కని మూకీలు భారతదేశంలో పదుల సంఖ్యలో ఉన్నవి. అయితే 'హరిమాయ' 1932 లో 'హిజ్ లవ్ ఎఫైర్' 1931లో వచ్చినవి. ఐతే అసలు బెంగుళూరులో 1915లోనే నటరాజ మొదలియార్ ఒక ల్యాబరేటరీ నెలకొల్పి తన మూకీలను ప్రింట్లు వేసుకున్న విషయం ఇక్కడ గమనార్హం.

ఒకే కంపెనీలో 38 మూకీలు

ఇవిట్లా ఉండగా హరిభాయ్ ఆర్. దేశాయ్ అనే గుజరాతి బెంగుళూరులో సూర్య ఫిలింస్ కంపెనీని నెలకొల్పాడు. 1929 జూలై 22న ఫిలిం డిస్ట్రిబ్యూటర్ పురుషోత్తం వి.వేద్ భాగస్వామిగా ఏర్పడిన ఈ సంస్థ తొలి ప్రయత్నంగా 1929లోనే 'హర్ట్ ఆఫ్ కింగ్' లేదా 'రాజ హృదయ' అనే మూకీ తీశారు. హరిబాయ్ నే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గణపత్ బక్రే, జుంజర్రావు పవార్, లక్ష్మి, కె.రంగారావు, జగన్నాథ్ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా తరువాత పురుషోత్తం వి. వేద్ తనవాటా తీసుకుని విడిపోగా హరిభాయ్ ఒక్కడి యాజమాన్యంలోనే సినిమా నిర్మాణం కొనసాగింది. పూనా, బొంబాయి, కొల్హాపూర్ నగరాల్లో నుండి పిలిపించిన తారలను నటింపజేసేవారు. అక్కడి సాంకేతిక నిపుణులే పనిచేసేవారు. ఈ సూర్య ఫిలిం కంపెనీ 1933 వరకు ఆగకుండా 38 మూకీలు తీసింది. ఇవిగాక లోటస్ ప్రొడక్షన్స్ వారికి ఒక మూకీని తీసిపెట్టింది. ఈ సూర్య ఫిలిం కంపెనీ 38 సినిమాల తీసింది వాటిలోయ. 'ఛాయిస్ ఆఫ్ ఏ బ్రైడ్ (1929) 'ఏ ప్రిన్స్ ఇన్ డీడ్', 'డివైన్ సబ్ రే', 'రాధేశ్యాం', 'సూర్యప్రభ(1930), డిబిట్స్ ఆఫ్ హానర్', 'గాంబుల్ ఆఫ్ లైఫ్', 'కిశోరీ', "క్యా బాత్, 'రణధీర్', 'సుప్రీమ్ టెస్ట్' (1930), 'ఛోటా చోర్', 'ఇన్ షాక్లెస్', 'రాజా ధీరజ్', 'షేర్ దిల్', స్త్రీ శక్తి', 'స్టంట్ కింగ్(1932), 'లాపర్వా', 'వీల్ ఆఫ్ ఫేట్(1933), వంటివి వాటిలో కొన్ని.

((ఈ సూర్యా ఫిలింస్ తీసిన వాటిలో ఎక్కువ చిత్రాలు స్టంటు చిత్రాలు. ఐతే, ఈ చిత్రాలు బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో తయారైనవే ఐనా, అచ్చంగా మైసూరు వాసులకు చెందిన చిత్రాలు కావు. హరిభాయ్ ఆర్. దేశాయ్, వి.సి. దవేలు అవుట్ డోర్ దృశ్యాలకోసం బొంబాయి నుండి బెంగుళూరు వచ్చారు. ఐతే ఆ చిత్రాల నిర్మాణం అంతా అవుట్డోర్లోనే జరిగేది. అంచేత, బెంగుళూరు ప్రాంతాల్లో ఉండే ప్రకృతి దృశ్యాలను బొంబాయివారు వాడుకోవడం వరకే జరిగింది. ఆ చిత్ర నిర్మాత సౌలభ్యం కోసం కొంతమంది మైసూరు వాసులను కూడా ఉపయోగించుకున్నారు. సుందరరావు వాదకర్ణి, అశ్వత్థామ, ఎం. లక్ష్మీబాయి మొదలైనవారు అప్పుడు ఆ చిత్రాల్లో పాల్గొన్నారు.))

తొలి కన్నడ టాకీ చిత్రం 'సతీ సులోచన'

వీళ్ళ తరువాత “సూర్యప్రకాష్ ఫిలిం కంపెనీ అనే మరో సంస్థ ఒకటి ప్రారంభమై 'ది కార్డెడ్ లవ్', 'కింగ్ ఆఫ్ హార్ట్స్', 'స్వోర్డ్ ఆఫ్ అల్లా (1931) మూకీలు తీశారు. వీటి దర్శకుని వివరాలు, నటీనటుల వివరాలు అలభ్యం. అయితే పైన చెప్పిన మూకీలకన్నా ముందుగా ఇదే కంపెనీ డా॥ ఆల్వర్ కోసం నిర్మించిన'జాలిమ్ జులేఖా' (1930) లో ఆల్వర్‌తో కలిసి ఫాతిమా హీరోయిన్‌గా నటించింది. ఇవన్నీ యిట్లుండగా 1931లో బొంబాయికి చెందిన 'ఇండియన్ ఆర్ట్ ప్రొడక్షన్స్' వారు ఎం.భవనాని దర్శకత్వంలో తీసిన 'వసంతసేన' లేదా 'మృచ్ఛ కటిక' అనే మూకీలో బెంగుళూరుకు చెందిన కమలాదేవి చటోపాధ్యాయ, ఈణాక్షీ రామారావు, నళిని తర్కండ్, టి.పి. కైలాసమ్, డా॥ డి.కె. భరద్వాజ తదితరులు నటించారు. కమలాదేవి చటోపాధ్యాయ ఎవరోకాదు సరోజినీదేవి సోదరుడు హరీన్ చటోపాధ్యాయ భార్య. కాగా 'వసంతసేన' మూకీ జర్మనీలో ప్రదర్శనకు నోచుకున్నది. 1931లో టాకీలు వచ్చాక కర్ణాటక బెంగళూరు ప్రాంతంలో 1934 లో వైవి రావు తొలి కన్నడ టాకీ చిత్రం 'సతీ సులోచన' తీసే వరకు ఇటు తెలుగు అటు తమిళ టాకీలనే కన్నడిగులు చూశారు.

హెచ్ రమేష్ బాబు

7780736386

Next Story