మూసీ తీరంలో మౌన కేకలు.. సుందరీకరణలో మానవత్వం ఎక్కడ?

by Ravi |   (  Updated:2026-02-22 01:01:19  IST  )

హైదరాబాద్ నగర చరిత్రకు, సంస్కృతికి, సామాన్యుల జీవన విధానానికి మూసి నది ఓ మౌన సాక్షి. ఇప్పుడు ‘సుందరీకరణ’ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ నదిని మళ్లీ ప్రజా చర్చల కేంద్రంగా నిలిపాయి..

మూసీ తీరంలో మౌన కేకలు.. సుందరీకరణలో మానవత్వం ఎక్కడ?
X

హైదరాబాద్ నగర చరిత్రకు, సంస్కృతికి, సామాన్యుల జీవన విధానానికి మూసి నది ఓ మౌన సాక్షి. ఇప్పుడు ‘సుందరీకరణ’ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ నదిని మళ్లీ ప్రజా చర్చల కేంద్రంగా నిలిపాయి.. అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రణాళికలు నిజంగా నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయా? లేక నదీ తీరాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాలపై అనిశ్చితి మేఘాలు కమ్మేస్తున్నాయా?

మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు నిజంగా అభివృద్ధి సంకల్పానికి నిదర్శనమా? లేక సామాన్య ప్రజల జీవితాలపై పడుతున్న భారమా? లంగర్ హౌస్ పరిసరాల్లో, బాపు ఘాట్ సమీపంలోని ‘మధు పార్క్ రిడ్జ్’ నివాసితుల ఆవేదన ఈ ప్రశ్నలను మరింత తీవ్రంగా నిలబెడుతోంది.

ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా?

ప్రభుత్వ అనుమతులతో, అధికారుల ఆమోదాలతో, పన్నులు చెల్లిస్తూ, విద్యుత్–నీటి కనెక్షన్లు పొందుతూ నిర్మించుకున్న గృహాలు ఒక్కసారిగా ‘బఫర్ జోన్’ పేరుతో అక్రమాలుగా మారిపోవడం ప్రజల్లో అయోమయం, ఆగ్రహం కలిగిస్తోంది. అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం.. పన్నులు వసూలు చేసింది ప్రభుత్వం, ఇప్పుడు అక్రమమని ప్రకటించేది కూడా అదే ప్రభుత్వం. పరిపాలనా వైఫల్యానికి బాధ్యత ఎవరూ వహించకుండానే బుల్డోజర్లు ముందుకు సాగితే, అది ప్రజాస్వామ్య పద్ధతేనా? రిటైర్మెంట్ అనంతరం జీవితకాల పొదుపుతో ఫ్లాట్ కొనుగోలు చేసిన వృద్ధ దంప తులకు అది కేవలం ఆస్తి కాదు- ఆశ్రయం, భద్రత, భావోద్వేగ బంధం. ‘బుల్డోజర్ పైనుంచి పోయినా పోము’ అనే వారి మాటల్లో చట్ట విరోధ ధోరణి లేదు. జీవన హక్కుపై ఉన్న ఆత్మగౌరవమే ఉంది. అభివృద్ధి పేరుతో మనుషుల మనోభంగం కలిగితే, ఆ అభివృద్ధి ఎంతవరకు సమగ్రం?

గాంధీ తత్వాన్ని మరవకూడదు!

నది సుందరీకరణ అవసరం లేదని ఎవరూ చెప్పడం లేదు.. నగరాల అభివృద్ధిలో నదుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితం. కానీ అసలు సుంద రీకరణ అంటే ఏమిటి? ముందుగా నదిలో కలుస్తున్న మురుగు నీటిని అడ్డుకోవాలి. శుద్ధి కేంద్రాలను బలోపేతం చేయాలి. వరద ముప్పును శాస్త్రీయంగా అంచనా వేసి, దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. కానీ నది ఒడ్డులను పూర్తిగా కాంక్రీట్‌తో కప్పేయడం వల్ల సహజ ప్రవాహాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రకృతి సహజత్వాన్ని కాపాడకుండా సుందరీకరణ సాధ్యం కాదు.. ఈ సందర్భంలో తరచూ ప్రస్తావనకు వచ్చే పేరు మహాత్మా గాంధీ. ఆయన స్ఫూర్తి విగ్రహాల ఎత్తులో కాదు.. విలువల లోతులో ఉంది. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మానవ గౌరవం ఇవే గాంధీ తత్వం. జీవం లేని విగ్రహాల కంటే జీవించే మనుషుల జీవితాలే ముఖ్యమని ఆయన ఆచరణలో చూపించారు. గాంధీ పేరుతో ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు, గాంధీ తత్వాన్ని మరవకూడదు.

హక్కు ఉంటే ఏమైనా చేస్తారా?

‘మా బతుకులను ఆగం చేసి, ఎవరికోసం ఈ అభివృద్ధి? వేరే చోట ఇలాంటి ఇల్లు ఇస్తారని నమ్మకం ఏంటి? ₹4,000 పెన్షన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? మహిళలకు ₹2,500 ఇస్తామని అన్నారు ఒక్కరికైనా అందిందా?’ అని ఒక వృద్ధురాలి ఆవేదన వ్యక్తిం చేసింది. నిజమే ఈ ప్రశ్నలు కేవలం వ్యక్తిగత బాధ కాదు.. పాలనపై ఉన్న అనిశ్చితికి ప్రతిబింబం. ప్రభుత్వానికి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టే హక్కు ఉన్నంత మాత్రాన, ప్రజలతో సంభాషణ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. ప్రజల ఆమోదం, పారదర్శకత, న్యాయబద్ధత ఇవే మంచి పాలనకు పునాదులు..అనుమతులు ఇచ్చిన అధికారుల బాధ్యతను నిర్ధారించకుండా కేవలం నివాసితులపై చర్యలు తీసు కోవడం అసమానతను పెంచుతుంది.

నది శుద్ధి నుండి ప్రారంభించాలి!

పునరావాసం స్పష్టమైన ప్రణాళికతో, సమయపాలనతో, మార్కెట్ విలువకు సరిపడ పరిహారంతో ఉండాలి.. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విద్య, ఆరోగ్య అవసరాలను సున్నితంగా పరిగణించాలి. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భాన్ని పక్కనబెట్టినా, ప్రజల విశ్వాసం కోల్పోవడం ఏ ప్రభుత్వానికీ మేలు చేయదు.. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి బలవంతపు ప్రకటన కాదు.. అది పరస్పర నమ్మకంపై నిలిచే ఒప్పందం. మూసీ సుందరీకరణ నిజంగా అవ సరమైతే, అది నది శుద్ధి నుంచి ప్రారంభమవ్వాలి కానీ ప్రజల గృహాల కూల్చివేతతో కాదు.. అభివృద్ధి అంటే కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు.. మనుషుల గౌరవం, భద్రత, భవిష్యత్తుపై నమ్మకం. ప్రభుత్వం గనక నిజంగా సుందరీకరణ కోరుకుంటే, ముందుగా ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. కన్నీళ్లపై కట్టిన నిర్మాణాలు శాశ్వతంగా నిలవవు. ప్రజల విశ్వాసంపై నిలిచిన నిర్ణయాలే చరిత్రలో నిలుస్తాయి.

-సయ్యద్ రఫీ

[email protected]

Next Story