చట్టసభలన్నీ ధనవంతులకేనా.. పేదలు ఉండొద్దా?

by Ravi |   (  Updated:2026-04-22 01:15:23  IST  )

మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ వంటి సంస్కరణలు నిజంగా పేదల జీవితాన్ని మార్చగలవా? భారత రాజకీయాల్లో ఆర్థిక అసమానతలు, ప్రాతినిధ్య లోపాలపై చర్చ.

చట్టసభలన్నీ ధనవంతులకేనా.. పేదలు ఉండొద్దా?
X

భారత రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు ఒక కీలకమైన సందేహాన్ని ముందుకు తెచ్చాయి. దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా భావించబడ్డ ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు పార్లమెంటులో నిలిచిపోవడం, దాని వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ కూడా విరమించుకోవడం జరిగిపోయింది.

అయితే దీని అమలును డీలిమిటేషన్, జనగణనతో ముడిపెట్టడంతో ప్రతిపక్షాలు సిద్ధాంతపర చిక్కుముడిగా భావించి వ్యతిరేకించడంతో అమలు దశలోనే నిలిచిపోయింది. భవిష్య‌త్తులో మహిళా బిల్లు పాస్ అయినా, డీలిమిటేషన్ జరిగినా.. నిజంగా పేదవాడి జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా? ఇదే మనం మనస్ఫూర్తిగా అడగాల్సిన ప్రశ్న.

పేదవాడి స్వరం పెరగకపోతే..!

ఓటు వేసే రోజున పేదవాడి విలువ దేశ భవిష్యత్తును నిర్ణయిం‌చేంత పెద్దదే.. కానీ పాలనలో అతని స్థానం మాత్రం ఎందుకు కనిపించదు? సీట్లు పెరిగినా పోటీ చేసే శక్తి లేకపోతే పేదవాడికి ఒరిగేదేమిటి? ఈ రెండు సంస్క రణలు సోషల్ జస్టిస్ పాలసీలుగా కనిపించినా అమల్లో ఎలైట్ విస్తరణ లేదా రాజకీయ వారసులకే పరిమితంగా మారే ప్రమాదం ఉంది. వ్యవస్థలు మారకపోతే పేదవాళ్లు ఓటరుగా మాత్రమే మిగిలిపోతారా? పేద మహిళకు టికెట్ రాకపోతే.. ఈ రిజర్వేషన్ అర్థమేంటి? డీలిమిటేషన్‌తో సీట్లు పెరిగినా.. ఆ సంఖ్యల విలువ ఏమిటి?

దేశం పేదలది.. మరి చట్టసభలు?

ప్రస్తుతం లోక్‌సభలో 543 సభ్యులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా అసెంబ్లీ సభ్యులు సుమారు 4100కు పైగా ఉన్నారు. డిలిమిటేషన్ తర్వాత, లోక్‌సభ సీట్లు దాదాపుగా 850 మధ్యకు పెరిగే అవకాశం, అసెంబ్లీ స్థానాలు 5500-6000 వరకు పెరిగే అవకాశం, అంటే ప్రజాస్వామ్యంలో సీట్లు పెరుగుతున్నాయి. కానీ దానికి తగ్గట్టుగా సమ ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందా? ADR (Association for Democratic Reforms) నివేదిక ప్రకారం సుమారు 85–90% ఎంపీలు కోటీశ్వరులు, వాళ్ల సగటు ఆస్తి కోట్లలో, అదే పేద వర్గానికి చెందిన ఎంపీలు దాదాపుగా ఒక్కరు కూడా లేరు. ఇది కేవలం గణాంకం కాదు.. ఇది ప్రజాస్వామ్య నిర్మాణంలో ఉన్న లోపాన్ని బహిర్గతం చేస్తుంది. దేశ జనాభాలో పేదల శాతం 60-70% కానీ పార్లమెంట్‌లో పేద / నిరుపేద వాళ్ల శాతం 0% మాత్రమే. మధ్యతరగతి జనాభా 20–30% వాళ్ల ప్రాతినిధ్యం 10% మాత్రమే, ధనవంతుల జనాభా 5–10% కాగా వాళ్ల ప్రాతినిథ్యం మాత్రం 90% పైగా ఉంటుంది. ఈ లెక్కలు భారతదేశం పేరుకు మాత్రం పేదలది.. అత్యున్నత స్థానమైన పార్లమెంట్ మాత్రం ధనవంతులదనే కఠోర సత్యాన్ని తెలుపుతున్నాయి.

ఆర్థిక ఆధిపత్యం...

భారతదేశంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. లోక్‌సభలో దాదాపు 85–90% ఎంపీలు కోటీశ్వరులు.. సగటు ఎంపీ ఆస్తి కోట్ల రూపాయ ల్లో ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఖర్చు కూడా కోట్లలోనే ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తక్కువలో తక్కువగా ₹25–30 కోట్లు, అసెంబ్లీకి ₹10–15 కోట్లు ఖర్చవుతుంది. ఇది అధికారికంగా చెప్పబడిన దానికంటే ఎక్కువగా ఉండొచ్చు.. ఈ పరిస్థితిలో ఒక పేదవాడు పోటీ చేయడం సాధ్యమా? దీన్ని రాజకీయ శాస్త్రంలో Cost Barrier Effect అని పిలుస్తారు. ఖర్చు పెరిగిన కొద్దీ పోటీ చేసే వ్యక్తుల పరిధి కుంచించుకుపోతుంది. చివరకు సంపన్నులే మిగులుతారు. దీనివల్ల పేదవారు పోటీకి ముందే బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని Representation Gap అని పిలుస్తారు. అంటే ప్రజల జీవన వాస్తవాలు, చట్టసభల మధ్య గల దూరం. ఈ గ్యాప్ పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్యం మరింతగా బలహీనపడుతుంది. ఇది క్రమంగా ఒక ప్రమాదకర మార్పుకు దారితీసింది. రాజకీయాలు ప్రజాసేవ నుండి పెట్టుబడి ఆధారిత వ్యవస్థగా మారుతున్నాయి.

సమానత్వపు గీతలు ఎక్కడ ?

ఈ బిల్లులు ఒక రాజకీయ ఆయుధంగా కూడా మారవచ్చు. మహిళల హక్కుల పేరుతో, ప్రాంతీయ సమతు ల్యత పేరుతో ఎలక్షన్ నెరేటివ్ నిర్మించడం సులభం. కానీ పేద మహిళ జీవితంలో మార్పు వస్తుందా? పేద కుటుంబం నుంచి నాయకత్వం వస్తుందా? సమాధానం ప్రస్తుతం స్పష్టంగా లేదు.. ముందుకు వెళ్లాలంటే నిర్మాణ మార్పులు లేకపోతే ప్రయోజనం లేదు. ఈ పరిస్థితిని మార్చాలంటే, ఎన్నికల ఖర్చులను గణనీయంగా తగ్గించాలి. పబ్లిక్ ఫండింగ్ తీసుకురావాలి. కొత్త అభ్యర్థులకు అవకాశాలు ఇవ్వాలి. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రాతినిధ్యంపై చర్చ ప్రారంభించాలి. డీలిమిటేషన్ కేవలం నియోజకవర్గాల గీతలను మార్చడమే కాదు, దేశ సమగ్రతను దెబ్బ తీయని రీతిలో 'సమానత్వపు గీతలను' గీయాలి. లేదంటే, సీట్లు పెరుగుతాయి కానీ సామాన్యుడి స్థాయి మాత్రం అక్కడే ఉండిపోతుంది.

ప్రజాస్వామ్యం ఎవరిది?

ఈ మొత్తం చర్చ చివరకు ఒకే ప్రశ్నకు దారి తీస్తుంది, ప్రజాస్వామ్యం నిజంగా ప్రజలదేనా? లేక సంపన్న వర్గాలదా? భారతదేశంలో పేదవాడు ఓటు వేస్తాడు.. కానీ పాలనలో ధనవంతుడు కూర్చుంటాడు. ఈ అసమానత కొనసాగితే, ప్రజాస్వామ్యం తన అసలు అర్థాన్ని కోల్పోతుంది. మహిళా బిల్లు, డీలిమిటేషన్ రెండూ అవసరమైన సంస్కరణలే, కానీ అవి సమానత్వాన్ని తీసుకురావాలంటే, రాజకీయ వ్యవస్థ నిర్మాణం మారాలి. డీలిమిటేషన్ ఒక అవకాశం, మహిళా రిజర్వేషన్ ఒక అవసరం, కానీ ఇవి రెండూ కలిపి ఒకే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి, ప్రజాస్వామ్యం అందరిది అయితే.. చట్టసభలు కూడా అందరివే కావాలి. మహిళా బిల్లు వచ్చినా.. డీలిమిటేషన్ జరిగినా.. పేదవాడి జీవితం మారకపోతే అది పూర్తి ప్రజాస్వామ్యం కాదు.

- డాక్టర్. కేశవులు బి. ఎండీ (సైకియాట్రీ)

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Next Story