- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టమే ఆమోదించాలా! ప్రత్యాహ్నయం లేదా?
మనమేమైనా ఉపాధ్యాయులు బెత్తం ఝలిపిస్తే తప్ప పాఠం వినని విద్యార్థులమా? నాకు అలాగే అనిపిస్తోంది. వెనుకబడిన తరగతుల

మనమేమైనా ఉపాధ్యాయులు బెత్తం ఝలిపిస్తే తప్ప పాఠం వినని విద్యార్థులమా? నాకు అలాగే అనిపిస్తోంది. వెనుకబడిన తరగతుల వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయమై నడుస్తున్న చరిత్రను చూస్తే. ఇదే అనిపిస్తోంది. ఈ తతంగమంతా ఎందుకు? ఆహారం సిద్ధంగా ఉంది. గరిట మన చేతుల్లోనే ఉంది. వడ్డనకు ఇతరుల అనుమతితో పనేమిటి? అన్ని పార్టీలూ కూడబలుక్కుని రాజ్యాంగ సవరణలతో పని లేకుండా బీసీలను 42 స్థానాల్లో అభ్యర్థులను నిలిపితే చాలు కదా..
వెనకబడిన తరగతుల అభివృద్ధి, గ్రామీణ వికాసం ప్రధాన రాజకీయ పక్షాల లక్ష్యమైతే, 42 శాతం రిజర్వేషన్ చట్ట ప్రమేయం లేకుండా రాజకీయ పార్టీలే అమలు పరిచి, సత్వరమే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లవచ్చు కానీ కాంగ్రెస్ మినహా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అందుకు పూనుకోలేదు.
చట్టబద్ధంగా కావాలంటే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. తద నుగుణంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (ఏ) లో సవరణకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్‌కు పంపింది. వారేమో రాష్ట్రపతి పరి శీలనకు పంపించారు. తర్వాత చర్య ఆమోదం అంటూ వస్తే నోటిఫికేషన్ జారీ చేయడమే. ఐతే ఇక్కడో తిరకాసు ఉంది. చట్టబద్ధంగా వెనుకబడిన తరగతులకు 42 శాతం స్థానాలు కేటాయించాలంటే, రాజ్యాంగ సవరణలు అవసరం. అందుకే నోటిఫికేషన్ విడుదలతో సరిపెట్టుకోకుండా ఉన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలన్న వాదన కూడా తెర మీదకు వచ్చింది.
వడ్డనకు ఇతరుల అనుమతి ఏల?
ఈ తతంగమంతా ఎందుకు? ఆహారం సిద్ధంగా ఉంది. గరిట మన చేతుల్లోనే ఉంది. వడ్డనకు ఇతరుల అనుమతితో పనేమిటి? స్థానిక సంస్థలలో వారికి ఇతోధిక ప్రాధాన్యం ఉండాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం అభ్యర్థులుగా వెనకబడిన తరగతుల వారినే వారు నిలిపితే ఎవరాపగలరు? ఇందుకోసం ఆందోళనలు, నిరసన దీక్షలు పిలుపులతో పనేముంది? బీసీ సంఘాలు ఈ నిరసనలు చేస్తే, గీస్తే ఈ ఉద్యమాలన్నీ ఆయా రాజకీయ పక్షాల ప్రధాన కార్యాలయాల ముందు చేయాలి.
అభ్యర్థుల గెలుపుపై అపనమ్మకమా?
ఇప్పటికీ అన్ని రాజకీయ పక్షాలు అభ్యర్థుల నిర్ణయంలో ఆయా శాసనసభ స్థానాలలో కులాల (తప్పు! సామాజిక వర్గాల)లెక్కలు గుణించుకుంటున్నది వాస్తవమే కదా. రిజర్వేషన్స్ ఉన్నాయనే ఇన్నాళ్లుగా జరిగిన ఎన్నికల్లో అగ్రవర్ణాల అభ్యర్థులను అధిక శాతం స్థానాలలో నిలబెడుతున్నది వాస్తవం కదా? ఎందుకు వెనకబడిన తరగతుల అభ్యర్థులను నిలబెట్టడం లేదు. అగ్రవర్ణాల అభ్యర్థులతో పోటీపడి విజయం సాధించలేరని భయమా? ఏ ఎన్నికల ఫలితం చూసినా, అవకాశం ఇచ్చిన కొన్ని చోట్ల ఆ భయం అర్థ రహితమని తెలుస్తూనే ఉంది కదా.
ప్రాంతీయ పార్టీలే మెరుగు..
ఐతే, ఇది పగటికలే. ఎందుకంటే దాదాపు మూడు దశాబ్దాల గుంజాటన తర్వాత, మహిళల రిజర్వేషన్ గెజిట్ నోటిఫికేషన్ 29-9-23న జారీ అయ్యింది. ఇది జనాభా గణన చేపట్టి, పూర్తి చేసి, అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) తర్వాతే అమలులోకి వస్తుంది. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్‌ని సమర్థించినా, ఆ తర్వాత 2024లో లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 8337 అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో కేవలం 797 మంది, అంటే 9.6 శాతమే మహిళలు. ఏ ప్రధాన జాతీయ రాజకీయ పక్షమూ 33 శాతం మహిళా అభ్యర్థులను పోటీలో నిలపలేదు. భారతీయ జనతా పార్టీ స్కోరు 16% కాగా, భారత జాతీయ కాంగ్రెస్ 13%. ఈ విషయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలే మెరుగు. ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జాతీయవాద కాంగ్రెస్ పార్టీలు చెరో 40% మహిళా అభ్యర్థులను నిలపగా, జార్ఖండ్ ముక్తి మోర్చా, బిజూ జనతాదళ్‌లు రిజర్వేషన్ బిల్లులో పొందుపరిచిన విధంగా 33% స్థానాలు మహిళలకు కేటాయించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల మార్గం మట్టుకు వేరు. తెలుగుదేశం కూటమి పక్షాల లెక్క 24%. వైయస్సార్ కాంగ్రెస్ 20%.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిరాశాజనకమే!
ఇక శాసనసభ ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల ప్రధాన పక్షాల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి అధికార పక్షం వైసీపీ 13% స్థానాల్లో మహిళలను నిలబెట్టగా, కూటమి పార్టీల శాతం 10. అటు తెలంగాణలో 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేనలు ఉమ్మడిగా 11, కాంగ్రెస్ 10 శాతం మహిళాభ్యర్ధులను నిలబెట్టాయి. జాగృత మహిళా నాయకులున్న భారతీయ రాష్ట్ర సమితి మహిళలకు 6.7 శాతం స్థానాలు మాత్రమే విదిల్చింది.
చట్టంతో పని లేకుండా అమలుపర్చలేరా?
తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి 18 నెలలు దాటింది. ఒకవైపు 2025 సెప్టెంబర్ 30 లోగా ఆ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వు. మరోవైపు, స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలక మండలులు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ స్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు గాను, ఆర్థిక కమిషన్ విడుదల చేయాల్సిన నిధులు రూ.1,500 కోట్లు పైగా నిలిచిపోయాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి, గ్రామీణ వికాసం ప్రధాన రాజకీయ పక్షాల లక్ష్యమైతే, 42 శాతం రిజర్వేషన్ చట్ట ప్రమేయం లేకుండా తామే అమలు పరిచి, సత్వరమే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లవచ్చు. ఏ రాజకీయ పక్షమైనా అందుకు కట్టుబడకపోతే, వెనుకబడిన తరగతుల సంక్షేమ విషయంలో వారి డొల్లతనమే బయటపడుతుంది. తక్కిన రాజకీయ పక్షాలకు అదొక బ్రహ్మాస్త్రం కూడా అవుతుంది.
-మల్లాప్రగడ రామారావు
99898 63398






