రిజర్వేషన్‌ల పితామహుడు సాహు

by Ravi |   (  Updated:2023-05-10 23:46:14  IST  )

Shahu Maharaj is the king of the Backwards and Dalits

రిజర్వేషన్‌ల పితామహుడు సాహు
X

భారతదేశ చరిత్రలో దళిత, బహుజనులను విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా మహాత్మ జ్యోతిబాఫూలే, ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసిన మహానీయుడు రాజర్షి ఛత్రపతి సాహుమహారాజ్‌. 1874లో జన్మించిన యశ్వంతరావు ఘాట్గేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్‌గా ప్రసిద్ది చెందాడు. ఘాట్గేలు మహారాష్ట్రలో వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కి చెంది, వ్యవసాయం చేసుకొని జీవించే 'కున్భీ' కాపు కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్‌ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణి ఆనందబాయి తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంత్‌రావు ఘాట్గేకి ముద్దుగా 'సాహు' అని పేరు పెట్టుకుంది. మూడేండ్లకే తల్లిని కోల్పోయిన సాహు, 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏండ్లకే తల్లిదండ్రులిద్దరూ లేని వాడైనాడు. దీంతో సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగింది. అందుకే ఆయన ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు.

ఆయన సంస్కరణలు..

తనకి యుక్తవయసు రాగానే సింహాసనం అధిష్టించిన సాహు ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా బ్రాహ్మణ పురోహితుడు సాహు శూద్రుడైనందున ఈసడింపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక మంత్రాలు చదివి అవమానిస్తాడు. ఈ సంఘటనే సాహు మహారాజ్‌ని మార్చివేసింది. తర్వాత ఆయన మహాత్మా జ్యోతిబాఫూలే సత్యశోధక సమాజ్‌(బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణ) ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలిగాడు. తన ఉద్యోగి ఒకరికి సత్యశోధక్ సమాజ్ నడిపే బాధ్యతలు అప్పజెప్పి మరాఠ దీనబంధు పేరుతో సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించాడు. కొల్హపూర్‌ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు, వేడుకలు సత్యశోధక్‌ సమాజ్‌ పద్ధతిలో జరిగాయి.

తను సింహాసనం అధిష్టించే నాటికే తన రాజ్యంలో అన్ని రంగాల్లో బ్రాహ్మణులు నిండిపోవడం చూసిన సాహు బ్రాహ్మణేతరులని ఉన్నత ఉద్యోగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పురాదని భావించి వారికి స్కూల్స్, హాస్టల్స్ ప్రారంభించి విద్యని ఉద్యమంగా నడిపాడు. కొల్హాపూర్‌ పట్టణంలో అన్ని కులాల వారికి హాస్టల్స్‌ నిర్మించిండు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాల నేర్పరచి అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనందించాడు. పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని ఆలయాలను, చావడీలను పాఠశాలలుగా వాడాలనీ, గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీగా ఉన్నారో ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమించాడు. ముస్లింలకు వాళ్ల మాతృ భాషలోనే పాఠశాలలు ప్రారంభమయినా, ఆ తర్వాత కొంతమార్పు రాగానే కులపరమైన విద్యాసంస్థలను రద్దుచేసి ఎక్కడైనా చదవొచ్చని ఆదేశాలు ఇచ్చాడు. వ్యవసాయం ఇతర వత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పరచాడు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో వెనకబడిన కులాలు అంటే బ్రాహ్మణ, ప్రభు, షెన్వీ, పార్శీ ఇతర అభివృద్ధి చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారికి రిజర్వేషన్‌ అందించాడు. గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్‌ (పాటిల్‌), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని రద్దు చేసిండు. ఉపాధ్యాయులు వారసత్వంగా పనిచేయడాన్ని రద్దు చేసిండు. కేవలం విద్యారంగంలోనే కాక సంగీత, సాహిత్య, నాటక ప్రక్రియలన్నింటిని ప్రోత్సహించిండు. భారతదేశంలో మొట్ట మొదటి మహిళా నాటక సమాజమైన 'శేషశాని స్త్రీ సంగీత నాటక మండలి' కొల్హాపూర్‌కి చెందినదే. దేశంలో మొదటిసారి అంటరానితనం నేరమని ప్రకటించి నేరస్థుల మీద చర్యలు తీసుకోవడానికి అధికారాలిచ్చాడు. అలాగే వెట్టిచాకిరిని రద్దు చేశాడు. ఆదివాసీ తెగలకు, అంటరాని వారికి బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన 'నేరస్థ కులాల చట్టాన్ని రద్దుచేశాడు. అలాగే అంబేద్కర్‌ మూక్ నాయక్ కోసం ఆర్థిక సహాయం చేశాడు. అలాగే బాలిక విద్య కోసం ప్రోత్సహాకాలు, బహుమతులు, ఉచిత భోజనం ఏర్పాటు చేశాడు. అలాగే బాల్య వివాహాల రద్దు చట్టం తెచ్చాడు. స్త్రీల నిర్ణయానికి ప్రాధాన్యతనిస్తూ విడాకుల చట్టం తెచ్చాడు. అలాగే జోగిని, దేవదాసి వ్యవస్థను రద్దు చేశాడు. కరువు వస్తే రైతులు కట్టాల్సిన అన్ని పన్నులను, రుణాలని మాఫీ చేశారు. తన రాజ్యంలో ఓ అణగారిన సామాజిక వర్గం అయిన చమార్‌ను మేయర్‌గా చేసి ...అణగారిన వర్గాల్లో ఆత్మస్థైర్యంతో పాటు...సామాజిక సమానత్వాన్ని కల్పించడానికి ఛత్రపతి సాహుమహారాజ్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. పాలనలో ఇన్ని సంస్కరణలు తెచ్చిన సాహు మహారాజ్ 1922 మే 6న పరమపదించారు. అతని మరణానంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతరుల ఆధ్వర్యంలో జరిగాయి.

సంపత్ గడ్డం

78933 03516

Next Story