బడిగంట మోగింది... అభ్యసనమే అసలు పరీక్ష!

by Ravi |   (  Updated:2026-06-23 01:00:29  IST  )

పాఠశాలలు కేవలం విద్యాబోధన కేంద్రాలు మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, సామాజిక విలువలు, బాధ్యతాయుత పౌరసత్వానికి పునాదులు వేస్తాయి. అభ్యసన సంక్షోభం, కార్పొరేట్ విద్య సవాళ్లు, తెలంగాణ విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల పాత్రపై విశ్లేషణాత్మక కథనం

బడిగంట మోగింది... అభ్యసనమే అసలు పరీక్ష!
X

పాఠశాల అనేది కేవలం విద్యాబోధన జరిగే స్థలం మాత్రమే కాదు.. వ్యక్తిత్వ వికాసం, సామాజిక విలువలు, బాధ్యతాయుత పౌర సత్వానికి పునాది వేసే కేంద్రం. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే నేటి పోటీ ప్రపంచంలో విద్య క్రమంగా మార్కులు, ర్యాంకులు, ఉద్యోగ అవకాశాలకే పరిమితమవుతుండగా, అభ్యసన నాణ్యత, విద్యార్థుల సమగ్ర వికాసం వంటి అంశాలు సవాళ్లుగా మారుతున్నాయి..

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇది పిల్లల కొత్త ఆశలు, కలలు, అవకాశాలకు నాంది. చాలా మంది పిల్లలు సెలవులంటే మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్, సోషల్ మీడియా, యూట్యూబ్‌లకే పరిమితమవుతున్నాయి. ఇలాంటి పరి స్థితుల్లో పాఠశాలల ప్రాముఖ్యత మరింత పెరిగింది. బడుల్లో పాఠాలు నేర్చుకోవడంతో పాటు సమయపాలన అలవర్చుకొంటారు. సకాలంలో భోజనం చేయడం, తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం, క్రమశిక్షణ పాటిం చడం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటి అనేక జీవన నైపుణ్యాలను అలవర్చుకుంటారు. పాఠశాల పిల్లల సామాజిక, మానసిక, భావోద్వేగ వికాసానికి కేంద్రంగా నిలుస్తుంది.

సవాల్‌గా మారిన అభ్యసన సంక్షోభం!

నేటి విద్యా వ్యవస్థలో పోటీతత్వం విపరీతంగా పెరిగింది. ఈ పోటీ వాతావరణం కొంతమందిలో విద్యార్థుల్లో ఆందోళన, భయం, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలకు కారణమవుతోంది. ఇక కార్పొరేట్ విద్యా వ్యవస్థ విద్యా ర్థులపై మరింత ఒత్తిడి పెంచడంతో పాటు తల్లిదండ్రులను గందరగోళంలోకి నెడుతోంది. భారీ ఫీజులు, ఆకర్షణీయ ప్రకటనలు, అత్యుత్తమ ఫలితాల హామీలు, ప్రత్యేక కోచింగ్ పేరుతో అనేక పాఠశాలలు పోటీ పడుతున్నాయి. దీంతో తమ పిల్లలకు ఏ విద్యా విధానం సరైనదోననే విషయంలో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 35 శాతం మంది 2వ తరగతి స్థాయి పాఠ్యాంశాన్ని కూడా సరిగా చదవలేక పోతున్నారు. అలాగే దాదాపు 60 శాతం మంది సాధారణ భాగహార సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు కొంత మెరుగ్గా ఉన్న ప్పటికీ ప్రాథమిక అక్షరాస్యత, గణిత నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో లేవని నివేదిక పేర్కొంది. మొత్తంగా విద్యలో నాణ్యత అసలు పరీక్షగా మారింది.

బలోపేతం దిశగా విద్యావ్యవస్థ..

తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థ గతంతో పోలిస్తే.. బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదు పాయాల అభివృద్ధి, డిజిటల్ తరగతులు, మధ్యాహ్న భోజన పథకాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, ఆంగ్ల మాధ్య మం, ప్రీప్రైమరీ వంటి అనేక సంస్కరణలతో ముందుకు సాగుతుంది. ప్రభుత్వం నియమించిన అకునూరి మురళి కమిషన్ విద్య వ్యవస్థపై సమగ్రమైన నివేదికను సమర్పించింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్– కార్పొరేట్ విద్యకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు గురుకుల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం ఉంటుంది. ఈ సంస్కరణలతో అట్టడుగు వర్గాల పిల్లలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి ఆచ రణలో ఏ మేరకు ముందుకు పోతాయో చూడాలి?

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే..

ప్రస్తుత విద్యా వ్యవస్థ వేగంగా మారుతోంది. ఒకప్పుడు విద్య అంటే జ్ఞానం సంపాదించడం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలను నేర్చుకోవడం అనే భావన ఉండేది. కానీ నేడు విద్య అనేది మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్ష లు, ఉద్యోగ అవకాశాల చుట్టూ తిరుగుతోంది. ఫలితంగా పిల్లల్లో చదువుపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరి స్థితుల్లో పిల్లల విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల పాత్ర గతంతో పోలిస్తే మరింత కీలకంగా మారింది. విద్య వ్యవస్థలో ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పడమే కాదు, విద్యా ర్థులకు మార్గదర్శి, ప్రేరణదాత, సలహాదారుగా వ్యవహ రించాలి. ప్రతి విద్యార్థి మానసిక స్థితిని అర్థం చేసుకుని, వారి ప్రతిభను గుర్తించి, చదువుపై ఆసక్తి పెంచే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. మార్కులకే పరిమితం కాకుండా విలువలు, సామాజిక స్పృహ, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించడం కూడా వారి బాధ్యత. ఇందులో తల్లి దండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. పిల్లలతో మాట్లాడడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, చదువుకు అనుకూల వాతావరణం కల్పించడం, అవసరమైన ప్రోత్సాహం అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. ఇతర పిల్లలతో పోల్చడం, మార్కుల ఆధారంగా మాత్రమే పిల్లలను అంచనా వేయడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ప్రతి బాలుడి భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగస్వాములుగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి.

-సంపతి రమేష్

79895 79428

Next Story