- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రాప్ అవుట్ విద్యార్థి.. జీవిత ప్రయాణం
నా సాహిత్య మిత్రుడు, ఉపాధ్యాయుడు మద్దికుంట లక్ష్మణ్ గత మే నెల చివరలో మా ఇంటికి వచ్చి ఈ జూన్ నెల 30న పదవీ విరమణ

నా సాహిత్య మిత్రుడు, ఉపాధ్యాయుడు మద్దికుంట లక్ష్మణ్ గత మే నెల చివరలో మా ఇంటికి వచ్చి ఈ జూన్ నెల 30న పదవీ విరమణ చేస్తున్నానని చెప్పాడు.. కేవలం ఆయన ఉపాధ్యాయ వృత్తి గురించి మాత్రమే రాస్తే పాక్షికమవు తుంది.. వృత్తి చేపట్టడానికి ముందు వెన్నుదన్నుగా నిలిచిన జీవితాన్ని తడిమితేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన జీవితాన్ని ఇక్కడ రేఖామాత్రంగా ఉల్లేఖిస్తున్నాను..
మద్దికుంట లక్ష్మణ్, శ్రమ పట్టుదల మాత్రమే కాకుండా డ్రాప్ అవుట్ అయిన విద్యార్థిగా చాలా సంవత్సరాల తర్వాత తిరిగి తన చదువును కొనసాగించిన తీరు, ఉద్యోగ సాధన, ఉద్యోగ నియామకం, రిటైర్మెంట్ అంతా నా కళ్ల ముందు ఒకసారి గిర్రున తిరిగసాగాయి.. అతను అంచలంచెలుగా ఎదిగి వచ్చిన బతుకు చిత్రం విభిన్నంగా విలక్షణంగా ఉండడం వలన, తర్వాతి తరం యువకులకు అతని జీవిత వికాసం ఒక కరదీపికగా ఉపయోగపడుతుందనే యోచనతో ఆయన గురించి రాయడానికి పూనుకున్నాను..
ఇక్కడ బతకలేక..
1960వ దశకం చివరలో అన్ని కులవృత్తులు జీర్ణ దశకు చేరుకుంటున్న దశలో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపెల్లి గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించిన వాడే మద్దికుంట లక్ష్మణ్. కుల వృత్తులు వెంటిలేటర్ మీదికి చేరిన ఆ వాతా వరణంలో అన్ని కుటుంబాల లాగే లక్ష్మణ్ వాళ్ల తండ్రి కూడా ఇక్కడ బతకలేక మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు వలస పోయాడు. దీంతో ఐదవ తరగతి మధ్యలో ఆపివేసిన పిల్లవాడు తన తండ్రి, తల్లి వెంట నడిచాడు. సరిగ్గా భాష తెలియని ప్రజలతో తెలియని ఊరిలో చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ అరుస్తూ గ్లాసు కల్లును 10 పైసలకు అమ్మే వాడు.. అక్కడ కూడా కల్లు (మామ్ల) కాంట్రాక్టులో సరిగ్గా నడవక నష్టం రావడం వలన తిరిగి గొల్లపెల్లికి కుటుంబం చేరింది.
కల్లు అమ్ముకుంటూ..
అనంతరం స్కూల్లో చేరిన లక్ష్మణ్ చదువు ఏడో తరగతి పూర్తి కావడంతోనే అర్ధాంతరంగా ఆగిపోయింది కారణం వారి నాన్న హఠాత్తుగా చనిపోవడం. దీంతో లక్ష్మన్ సమీపంలో ఉన్న బండ లింగంపల్లి గ్రామంలో సారా దుకాణంలో 70 రూపాయలకు జీతం ఉన్నాడు.. అది కూడా సరిగ్గా కుదరకపోవడంతో, మిత్రుల సహాయంతో గొల్లపల్లి బస్టాండ్ వద్ద ఒక పాన్ షాప్ డబ్బా పెట్టాడు.. మిత్రులు ఉద్దెర పెట్టడం వల్ల పాన్ షాప్ దివాలా తీసి మూతపడింది. చివరకు సత్యనారాయణ స్వామి అనే ఎంబిబిఎస్ డాక్టర్ వాళ్ల ఊర్లో ప్రైవేటు ఆసుపత్రి పెట్టడంతో ఆయన వద్ద వైద్యం నేర్చుకోవడానికి కాంపౌండర్‌గా చేరాడు. తర్వాత అలా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆర్ఎంపీ డాక్టర్‌గా గొల్లపల్లి బొప్పాపూర్ జంట గ్రామాలలో ప్రాక్టీస్ చేశాడు.
నలిమెల భాస్కర్ మార్గదర్శకత్వంలో..
లక్ష్మణ్‌కి అప్పటికే అంతో ఇంతో సాహిత్య వాసన కలిగి ఉండడం వలన పత్రికలలో వచ్చిన వ్యాసాలను, పుస్తకాలను చదివేవాడు. నలిమెల భాస్కర్ ఎండాకాలం సెలవుల్లో వాళ్ల ఊరు నారాయణపూర్‌కు వచ్చాడు. సావిత్రికి కాల్షియం ఇంజక్షన్ ఈయడానికి అక్కడ ఎవరూ సాహసించకపోవడంతో, లక్ష్మణ్ దగ్గరికి ఇంజక్షన్ ఇవ్వమని పోయాడు. అలా అలా రాకపోకల ఆ పరిచయం భాస్కర్‌కు, లక్ష్మణ్ మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరిచింది. అదే మధ్యలో వదిలేసిన చదువును తిరిగి ప్రైవేటుగా పదవ తరగతి పరీక్ష రాయడానికి ఉపయోగపడింది. ఆ క్రమంలోనే 1985 ప్రాంతంలో లక్ష్మణ్‌తో నా ఆత్మీయ మిత్రుడు నలిమెల భాస్కర్ ద్వారా పరిచయం ఏర్పడింది. మా భాస్కర్ కవి. స్వతహాగా టీచర్ కావడం వలన ఆయన మార్గదర్శకత్వంలో ప్రేరణతో లక్ష్మణ్ ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైపోవడమే కాకుండా హను మకొండ ప్రభుత్వ కళాశాలలో బి.ఎడ్ చదువు పూర్తి చేశాడు. అప్పటికే లక్ష్మణ్‌కు పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు..
ఎన్నో ఎత్తుపల్లాలను చూసి..
బి.ఎడ్ అయ్యాక 1995లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. లక్ష్మణ్ ఆ సమయంలో అప్పుడు సిరిసిల్లలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్ ఇంట్లో ఉండి పట్టుదలతో, దీక్షతో చదివి 1995 జూన్ 16న డీఎస్సీ రాసి సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్‌గా నియామకం పొంది సిరిసిల్ల పక్కన తాడూరు గ్రామం హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు.. జీవితంలోని అనేక ఎత్తుపల్లాలను, కష్ట సుఖాలను, చూసిన లక్ష్మణ్ పట్టుదలతో శ్రమించి ఉపాధ్యాయుడిగా నియామకం పొందాడు.. ఉపాధ్యాయుడిగా మొదటి వేతనం ఏక మొత్తం 1500 రూపాయలు మాత్రమే ఉండేది.
ఎన్నో అంశాలపై చర్చించేవాళ్లం!
సిరిసిల్లలో మేము పక్కపక్కన ఉన్నప్పుడు ముగ్గురం సాయంత్రం కలిసి అనేక సాహిత్య అంశాలతో పాటు, చదివిన పుస్తకాలపైన సమాజం స్థితిగతుల పైన వాటి ప్రభావాలపైన, వ్యక్తుల ప్రలోభాలపైన స్వార్థాల పైన చర్చించుకునే వాళ్లం. ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా ఎవరికి వారు దూరంగా ఉన్నం. ఈ మధ్య లక్ష్మణ్ ధర్మారం నుంచి రాజన్నపేట ఉన్నత పాఠశాలకు చివరికి ఆవునూరు గ్రామంలో హైస్కూల్‌లో పదవీ విరమణ వరకు పి.జి. హెచ్.ఎం.గా పనిచేసి జూన్ 30న రిటైర్ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగం చేయడం కన్నా ఎక్కువగా అధికారుల నుంచి వచ్చే మెసేజ్‌లకు నివేదికలు పంపడానికి సరిపోతుందని ఉపాధ్యాయ మిత్రులు బాధపడుతుంటారు.. పోనీ ఇంత చేసి పంపిస్తే విద్యారంగంలో వాటి ప్రయోజనం ఏమైనా జరుగుతుందంటే ఏమి లేకపోవడం విచారకరం..
( జూన్ 30న రిటైర్ అయిన ఉపాధ్యాయుడు, కవి మిత్రుడు మద్దికుంట లక్ష్మణ్‌కు శుభాకాంక్షలతో...)
-జూకంటి జగన్నాథం
94410 78095






