- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు సినీ జగత్తు మహానటి.. సావిత్రి
సినిమా హాల్లో తెర వెలిగిన క్షణం, కథ మొదలుకాకముందే మన హృదయాల్లో మొదట వెలిగేది సావిత్రి కళ్ల మెరుపే. ఆమె పాత్రలో నటించలేదు.. జీవించింది. నవ్వు, బాధ, అమాయకత్వం, బలహీనత…

సినిమా హాల్లో తెర వెలిగిన క్షణం, కథ మొదలుకాకముందే మన హృదయాల్లో మొదట వెలిగేది సావిత్రి కళ్ల మెరుపే. ఆమె పాత్రలో నటించలేదు.. జీవించింది. నవ్వు, బాధ, అమాయకత్వం, బలహీనత… ప్రతీ భావానికీ ఆమె కళ్లే అక్షరాలు. సినిమా ఆమెకు వృత్తి కాదు.. స్వయం ఆవిష్కరణ. తెర కరిగినా కాలం గడిచినా, సావిత్రి మాత్రం మన జ్ఞాపకాల అద్దంలో శాశ్వతంగా నిలిచిపోయిన శ్వాస.
సినిమా హాలులో తెర వెలిగిందంటే మొదట వెలిగే మెరుపు సావిత్రి కళ్లది, కథ మొదలవకముందే ఆమె కళ్లలోని నవ్వులు, వేదనలు మన గుండెల్లో చోటు చేసుకున్నాయి. పాత్రల్ని ఆమె ధరించలేదు, ఆమె ఆ పాత్రగా శ్వాసించింది. ‘మాయాబజార్‌లో చిరునవ్వు మన పండుగల దివిటీ. ‘మిస్సమ్మ లో నడక మన పెరట్లో మనం జారి పడకుండా మన చిన్నప్పుడు అమ్మ పట్టుకున్న చేయి. దుఃఖం ఆమెకు అలంకారం కాదు జీవితపు నిజం.
కొద్దిమందికే సాధ్యమైన నటన..
ఆమె కళ్లలో ప్రతి నీడ స్త్రీ ఓర్పు, మౌనం, పగలు రాత్రి.. తెరకరిగిపోయినా, కాలం దూరమైనా, సావిత్రి ఇంకా మనలో ఉంది. సావిత్రి తెరపై కాదు, మన జ్ఞాపకాల అద్దంలో నిలిచిపోయిన శ్వాస. నాకయితే స్కీన్ ప్రజెన్స్‌లో స్మితాపాటిల్ తర్వాతి స్థానం సావిత్రిదే. నటిగా ఆమెది గొప్ప భావస్పోరకమయిన ముఖం. పాత్రల భావాల్ని వ్యక్తీకరించడంలో ఆమె చూపిన ప్రతిభ స్మితాపాటిల్, మీనాకుమారి లాంటి కొద్దిమందికే సాధ్యమయింది. సావిత్రి తన కళ్లతో ప్రకటించిన భావాలు గులాబీలు విచ్చుకున్నంత సహజంగానూ, పరిమళాలు విస్తరించినంత హాయిగానూ ఉంటాయి. ఇక సావిత్రి మూతి విరుపులో ఆమె చూపిన విన్యాసం ఎన్నో భావాల్ని అలవోకగా ఆవిష్కరించేవి. నటించింది 80 పైచిలుకు సినిమాలే అయినప్పటికీ ఆనాటి తెలుగు తమిళ ప్రేక్షకుల్లో చిరస్థాయిగా సావిత్రి నిలిచిపోయింది. నటనే తన జీవితం అనుకుంది కానీ జీవితంలో నటించలేక సావిత్రి గెలిచి ఓడింది, ఓడి గెలిచింది.
పాత్రల్లోకి పరకాయ ప్రవేశం..
అందగత్తెగా రెండు భాషల ప్రేక్షకుల మనస్సులో సావిత్రి స్థానం సుస్థిరం. మహానటిగా ఆమె అభినయం అజరామరం. కొమ్మారెడ్డి సావిత్రిని ఏదో ఒక చిత్రం తోనో ఒక రకం పాత్రలతోనూ గుర్తుంచుకోలేం. తన పాత్రల నిర్వహణలో చూపిన వైవిధ్యం అద్భుతమైంది. భావి తరాల నటులకు ఆమె ఒక మోడల్. సంభాషణలు చెప్పడంలో ఆమె చూపిన సరళత్వం, భావ ప్రకటనలో కనిపించే సహజత్వం ఆమె సొంతం. మూతి విరిచినా, వెక్కిరించినా, సంతోషమైనా, దుఃఖమైనా, అమాయక పాత్ర అయినా, చలాకీ పాత్ర అయినా సావిత్రి, సావిత్రి అభినయం విస్తృతమయింది. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకత. అలవోకగా కనిపించడం నటిగా ఆమె సాధించిన విజయం.
జీవన సంక్లిష్టతలకు కళారూపం..
మిస్సమ్మ, బతుకుతెరువు, దేవదాసు, అర్ధాంగి, దొంగరాముడు, మాయాబజార్, మాంగల్యబలం, నర్తనశాల ఇట్లా సాంఘిక, పౌరాణిక ల్లాంటి అనేక జానర్లల్లో ఆమె ఒదిగిపోయింది. Her art is far more than the art. సావిత్రి నిజానికి తన జీవితంలో ఎదుర్కొన్న సంక్లిష్టతలను దుఖాలను, స్వీకరించి వాటిని కళగా మార్చి నటిగా నిరూపించుకుంది. 1935 డిసెంబర్ ఆరో తేదీన సావిత్రి కృష్ణా జిల్లా చిర్రావూరులో జన్మించింది. ఆర్థికంగా మెరుగైన కుటుంబంలో జన్మించిన సావిత్రి తన అక్షరాభ్యాసంతో పాటు నృత్యంలో కూడా ప్రవేశించింది. 1950లో గోపాలకృష్ణా పంపిణీ సంస్థకు చెందిన కృష్ణమూర్తి ప్రేరణతో సావిత్రి పెదనాన్న తోడుగా మద్రాస్ చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
దేవదాసు నుంచి మాయాబజార్ వరకూ..
సావిత్రి తన నటన ప్రతిభను నిరూపించుకోవడానికి నృత్యరూపకుడూ, దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ సినిమా సమున్నతంగా నిలిచింది. అదే సమయంలో ‘పల్లెటూరు’, ‘మేనరికం’, ‘సంక్రాంతి’, ‘ప్రతిజ్ఞ’, ‘చంద్రహారం’, ‘బ్రతుకుదెరువు’, ‘జ్యోతి’ తదితర సినిమాలు పరంపరగా వచ్చాయి. ఇక ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో మొండితనం, వ్యక్తిత్వం వున్న మేరీ పాత్రతో సావిత్రి కెరీర్ వేగం పుంజుకుంది. నిజానికి ‘మిస్సమ్మ’లో మొదట భానుమతి కథానాయిక. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న తర్వాత అనివార్యమైన కారణాల వల్ల ఆ పాత్ర సావిత్రికి లభించింది. సావిత్రి తొలి రోజుల్లోనే కన్యాశుల్కంలోని ‘మధురవాణి, తర్వాత ‘మిస్సమ్మ’ లో మేరీ, ‘మాయాబజార్’లో శశిరేఖ పాత్రలలో ఆమె నటన మకుటాయమానమైంది.
జీవితంలో నటించలేక.. సెలవు
‘సంసారం సినిమాలో పనికిరావని ప్రకటించిన సినిమా రంగం.. దేవదాసు, మిస్సమ్మ లాంటి సినిమాలతో ఆమెకు పెద్ద పేట వేసింది. అద్భుతమయిన సావిత్రి ఎదుగుదల తనకు తానే సాటి అన్నంతగా ఒక ఒరవడిగా నిలిచిపోయింది. సావిత్రి నటించిన ‘చివరకు మిగిలేది’, ‘వెలుగు నీడలు’, ‘మూగమనసులు’, పూజా ఫలం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘నాదీ ఆడజన్మ’, ‘నవరాత్రి’, ‘రక్తసంబంధం’, ‘మనసే మందిరం’, మంచి మనసులు’, ‘ సుమంగళి’ ... ఇలా ఎన్నో సినిమాలు ఆమె నటనకు గీటురాళ్ళుగా మిగిలాయి. ఓ పక్క నటిగా ఎదుగుతూనే దర్శకత్వ బాధ్యతల వైపునకు మొగ్గు చూపింది. దర్శకురాలిగా చిన్నారి పాపలు, కుళందై ఉళ్ళం (తమిళం), మాతృదేవత, చిరంజీవి, వింత సంసారం, ప్రాప్తం (తమిళం) సినిమాలను రూపొందించింది. తర్వాత నిర్మాతగా ‘వింత సంసారం’, ప్రాప్తం (తమిళం) సినిమాలు తీశారు. నటనను జీవితంగా చేసుకున్న సావిత్రి జీవితంలో నటించలేక వెళ్లిపోయింది. అలా ఒక మహా నటి, వ్యక్తిత్వమున్న మహామనిషి సెలవంటూ వెళ్లిపోయారు.
-వారాల ఆనంద్
94405 01281






