- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలలకు స్వపర భేదాల్లేవు..
నగరాల్లో కలల కోసం పోరాడే యువత జీవితాలను హృద్యంగా చూపించిన ‘సప్నే వర్సెస్ ఎవ్రీవన్’ వెబ్‌సిరీస్ కలలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు, విజయాల మధ్య నేటి యువత మౌన సంఘర్షణను ఆవిష్కరించే కథ..

నగరాల్లో కలల్ని సాకారం చేసుకోవడానికి యువత పడే సంఘర్షణ ఇతివృత్తంగా “సప్నే వర్సెస్ ఎవ్రీవన్” సిరీస్ రూపొందింది. కొన్ని వెబ్‌సిరీస్‌లు వినోదం కోసం వస్తాయి. కొన్ని కథలు టైమ్‌పాస్ కోసం చూస్తాం. కానీ కొన్ని మాత్రం మన లోపల దాచిపెట్టుకున్న గాయాలను మెల్లగా తడుముతాయి.
నగరానికి నిలకడ లేదు. సహనం తెలీదు, పట్నం కళ్లు తెరిచే కలలు కంటుంది, నిలబడే పరుగులు తీస్తుంది, పెదవులు విప్పకుండానే పాటందుకుంటుంది, అరచేయి చాపకుండానే వైకుంఠం చూపిస్తుంది, వ్యామోహాన్ని విసిరి వ్యాకోచం చెందుతుంది, వ్యాపారాన్ని శ్వాసిస్తుంది మనిషన్నవాడిని గొయ్యి తవ్వకుండానే పాతరేస్తుంది. పట్నానికి స్వపర భేదాల్లేవు, అలాంటి పట్నాలే ఇవ్వాళ మనుషుల బతుకు, బతుకు తెరువు. ఆ పట్నాల్లో కొత్త తరానికి అనేక కలలున్నాయి. అసలు కలల్లెకుండా మనిషి మనుగడే సాధ్యం కాదు. అయితే ఆ కలల్ని సుసాధ్యం చేసుకోవడానికి పడే కష్టాలు బాధలు చేయాల్సిన పోరాటాలు అనేకం.
నగర జీవితంలో ప్రతిరోజూ సాగే మౌన పోరాటం!
నేటి యువత జీవితంలో “కల” అనే పదం ఒక ఆశ మాత్రమే కాదు. ఒక ఒత్తిడి కూడా. పెద్ద నగరాలు, స్టార్టప్ సంస్కృతి, సోషల్ మీడియా విజయ గాథలు, కార్పొరేట్ ప్రపంచపు మెరుపులు ఇవన్నీ కలిసి ప్రతి యువకుడి మనసులో ఒక అసాధ్యమైన జీవితాన్ని చిత్రిస్తుంటాయి. ఆ కలల వెనుక దాగి ఉన్న వాస్తవాన్ని ఆవిష్కరించే సిరీసే “సప్నే వర్సెస్ ఎవ్రీవన్.” ఈ సిరీస్ కేవలం ఇద్దరు యువకుల కథ కాదు. భారతీయ మధ్యతరగతి గుండెల్లో నగర జీవితాల్లో ప్రతి రోజు నడిచే మౌన పోరాటం. ఒకవైపు వెంటాడే కలలు. మరోవైపు కుటుంబం, బాధ్యతలు, అద్దె ఇళ్లు, ఈఎంఐలు, ఉద్యోగ భయాలు, సమాజపు తీర్పులు. ఇవ్వాల్టి సామాజిక నేపధ్యంలో సాధారణంగా పేదరికం కంటే కూడా ప్రమాదకరమైనది “సేఫ్‌గా బతుకు” అనే సలహా. అది చిన్నప్పటి నుంచి నూరి పోస్తూనే వుంటారు “కలలు బాగానే ఉంటాయి.. కానీ ముందుగా స్థిరపడు.” అని. ఆ ఒత్తిడిల్లో లక్షలాది మంది తమకిష్టమైన అభీష్ట మయిన జీవితాన్ని మొదలు పెట్టకముందే ముగించేస్తారు.
కలలని కుంగదీసే సకల భయాలు..
ఈ సిరీస్ ఇద్దరు యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ప్రశాంత్ నరులా నటుడిగా ఎదగాలనే కలతో జీవించే మధ్యతరగతి యువకుడు. అతనికి ప్రతిభ ఉంది, భావోద్వేగం ఉంది. కానీ ప్రతి ఆడిషన్లో తిరస్కారం, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ భయాలు అతని కలలను మెల్లగా కుంగదీస్తూ వుంటుంది. అతని కళ్లలో, ఆశల్లో అమాయకత్వం ఉంటుంది. ప్రతి ఆడిషన్ తర్వాత ఓడిపోతూనే మళ్లీ లేస్తాడు. ఎందుకంటే కళాకారుడి కలలు అంతం కావడం అంత సులువు కాదు. మరో యువకుడు జిమ్మీ మెహతా చాలా తెలివైన, దూకుడున్న యువకుడు. ఢిల్లీలో రియల్ ఎస్టేట్ అనే క్రూర ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అక్కడ నీతి నిజాయితీ కంటే బతుకుదెరువు ముఖ్యం. భావోద్వేగాలకు అక్కడ విలువ లేదు. జిమ్మీ పరిస్థితి నిర్దాక్షిణ్య మయిన నిజం. అంతకంటే కూడా ఇవాల్టి కఠిన వాస్తవం. అతని అనుభవంలో తెలుసుకున్న అర్థం చేసుకున్న‘నిజం’ చాలా క్రూరమయింది. ఆ నిజమేమిటంటే ఈ ప్రపంచం మంచివాళ్లను కాదు.. గెలిచిన వాళ్లను మాత్రమే గుర్తుంచుకుంటుంది.
యువత నిస్సహాయతకు చిత్రరూపం!
ప్రశాంత్ తనను తాను కోల్పోకుండా విజయాన్ని కోరుకుంటాడు. అనారోగ్యంతో వున్న తల్లి తనని హీరో పాత్రలో వేదిక మీద చూడాలన్నది ఆయన కోరిక. ప్రశాంత్ తనను కోల్పోకుండా విజయాన్ని కోరుకుంటాడు. జిమ్మీకి మాత్రం బ్రతకడమే నీతి. అతని శక్తి దూకుడు. వీరిద్దరి ప్రయాణాలు వేర్వేరు అయినా, వారి గమ్యం ఒకటే “సక్సెస్”. కానీ ఆ ప్రయాణంలో ఎదురయ్యేవి అవమానాలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, కుటుంబ ఒత్తిళ్లు, సంబంధాల విరుపులు. ముఖ్యంగా సోషల్ మీడియా సృష్టించే కృత్రిమ విజయ ప్రపంచం యువతలో కలిగించే నిస్సహాయతను సిరీస్ ఎంతో సహజంగా చూపిస్తుంది. ఇద్దరిలో ఎవరు సరైనవారు ఈ సిరీస్ సమాధానం చెప్పదు. అట్లని వాళ్ల జీవితం కూడా చెప్పదు.
నీలోకి డ్రీమ్ పిశాచం దిగితే..
ఇందులో కథ కథనం ఆసక్తిగా సాగుతాయి. వీటికి తోడు సిరీస్‌లో సంభాషణలు చాలా బాగా రాసారు. కొన్నింటి చెప్పుకుంటే ‘కథ నీది.. సాధ్యమైతే అద్భుతంగా రాయ్’, “ఇది ఇప్పటికీ అడవే... తేడా ఒక్కటే.. నువ్వు ఎలుగుబంటి అయి తినేస్తావా లేక కుందేలు అయి ఆహారమవుతావా”. “జీవితపు బాధ్యతల మధ్య ఆనందం ఎక్కడ పోయిందో కూడా తెలియలేదు.”. “నా వైఫల్యానికి నేను ఎందుకు భయపడాలి”. “నిజమైన ప్రతిభావంతుడు ట్రోఫీ వైపు నడుస్తుంటాడు.. కానీ ట్రోఫీని తీసుకెళ్లేది చాలాసార్లు తక్కువ ప్రతిభ ఉన్నవాడే.”. “చూడు.. నీలోకి డ్రీమ్ పిశాచం దిగుతోంది.” ఈ సిరీస్ మేకింగ్‌లో ఫాస్ట్ పేస్ ఉన్నప్పటికీ గ్లామర్ కంటే నిజాయితీ ఎక్కువ అనిపిస్తుంది. పాత్రలు కేవలం సినిమాటిక్ హీరోల్లా కనిపించవు. మన చుట్టూ తిరిగే సాధారణ యువకుల్లానే ఉంటారు. అందుకే వారి బాధ మన బాధలా అనిపిస్తుంది. నగర జీవితం మనిషిని ఎలా ఒంటరివాడిని చేస్తుందో, కలలు ఎలా భారంగా మారుతాయో, విజయం అందుకోవడానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతో ఈ కథ ప్రేక్షకుల మనసును కదిలించేలా చెబుతుంది.
పరాజితుల నిశ్శబ్దం వినేదెవ్వరు?
‘ప్రతి ఒక్కరూ విజేతలుగా కనిపించే ఈ కాలంలో, ఓడిపోతున్న వారి నిశ్శబ్దాన్ని ఎవరు వింటారు” అనే ప్రశ్నను మన ముందుంచే సిరీస్ ఇది. కలలు కనడం అవసరం. కానీ ఆ కలల వెనుక మనిషి తనను తాను కోల్పోకూడదని హెచ్చరించే సిరీస్ ఇది. ఆధునిక యువత జీవన ప్రతిబింబం ఈ వెబ్ సీరీస్.
-వారాల ఆనంద్
94405 01281






