సమాజ సేవకుడు సంత్ సేవాలాల్

by Ravi |   (  Updated:2026-02-15 00:30:28  IST  )

సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు.. ఆయన జ‌యంతిని పండుగలా జ‌రుపుకొంటారు. గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్పద‌నం, విశిష్టతల‌ను తెలియ‌జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారు..

సమాజ సేవకుడు సంత్ సేవాలాల్
X

సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు.. ఆయన జ‌యంతిని పండుగలా జ‌రుపుకొంటారు. గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్పద‌నం, విశిష్టతల‌ను తెలియ‌జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు.. దీంతో ఆయన ఇత‌ర కులాలవారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు. 1739లో జన్మించిన ఈయనకు చిన్నతనం నుంచే సేవాగుణం ఉండేది. ఆవులు కాయడానికి వెళ్లేటప్పుడు తల్లి కట్టియిచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టేసేవాడు.. జాతర్ల సమయంలో జంతుబలిని ఒప్పుకునేవాడు కాదు.. 'ఒకవేళ అమ్మవారికి బలి ఇష్టమైతే నేనే బలై పోతాను' అని సేవాలాల్ జగదాంబ అమ్మవారి కాళ్ల దగ్గర తన తలను ఉంచుతాడు. 'నా రక్తాన్ని నైవేద్యం‌గా స్వీకరించి బంజారాలకు వరాలు ఇవ్వమ'ని ప్రార్థిస్తాడు. అమ్మవారు కరుణించి 'నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు. అతని నాయకత్వంలో ప్రయాణించండి' అని ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి అమ్మవారినే తన గురువుగా స్వీకరించాడు. అన్ని విద్యలను నేర్చుకొని బంజా రాల సేవలో నిమగ్నమయ్యాడు. ఈయన ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో 'పెరిఫర్' ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం, ధూమపానం శాపమని హితవు పలికాడు. ఒకప్పుడు హైదరాబాదులో మశూచి వ్యాధి ప్రబలింది. అయితే, ఈయన ఉన్న బంజారాహిల్స్ ప్రాంతానికి ఈయన మహత్యం వల్లే ఆ వ్యాధి సోకలేదని నమ్ముతారు. లంబాడీలు, బంజారాలు, సుగాలీలు, గ్వార్ భాయ్ అని పిలవబడుతున్న ఈ గిరిజనులు ప్రపంచవ్యాప్తంగా గోర్ బంజారాలుగా పేరుపొందారు.. వీరు ఎవరికీ హాని తలపెట్టేవారు కాదని, సహాయ గుణం విరివిగా కలవారని, ధైర్యసాహసాలకు ప్రతీకలనీ చరిత్ర ద్వారా తెలుస్తుంది. తరతరాలుగా జాతి వివక్షకు గురవుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిలో వెనుకబడి ఉన్న లంబాడాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.

- సంపత్ గడ్డం,

78933 03516

Next Story