- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాదేది వ్యాపారానికి అనర్హం.. వృద్ధాశ్రమాల యదార్థ స్థితి ఇదే!
వృద్ధులకు ఆశ్రయం ఉన్నా, ఆదరణే కరువు' అనే పేరిట దిశలో తాజాగా వచ్చిన ఆర్టికల్ నిజంగానే కొన్ని వృద్ధాశ్రమాల యదార్ధ స్థితిని

'వృద్ధులకు ఆశ్రయం ఉన్నా, ఆదరణే కరువు' అనే పేరిట దిశలో తాజాగా వచ్చిన ఆర్టికల్ నిజంగానే కొన్ని వృద్ధాశ్రమాల యదార్ధ స్థితిని అద్దంలో చూపించిన భావనను కలిగించింది. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యాక వృద్ధులకు నిజంగా కుటుంబంలో, సమాజంలో ఆదరణ కరువైంది. అన్ని రకాల ఒంటరితనం పాలైన వృద్ధులను మానవతా దృక్పథంతో సాకాలని, ఆదుకోవాలని ఏర్పడిన వృద్ధాశ్రమాలు మొదట్లో నిబద్ధతతో పని చేసినప్పటికీ, వీటిలోకి కూడా స్వార్థ చింతన దూరటంతో వృద్ధుల పరిస్థితి రోట్లో పడిన రోకలిలాగా తయారైంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్లని ఓ పెద్దదిక్కుగా చూసి వాళ్లని కాలు కింద పెట్టకుండా ఆత్మీయత, అనురాగాలతో చూసుకునేవారు. ఎంతో కొంత సమయం వారితో గడిపేవారు. ఆ పలకరింపులకు పులకరించిన ఈ వయోవృద్ధులు మానసికంగా బాల్యాన్ని అనుభవిస్తూ మరికొన్ని దినాలు హాయిగా గడిపేవారు. కాలానుగుణంగా వివిధ కారణాలవలన, ఈ ఉమ్మడి కుటుంబముల వ్యవస్థ చిన్నా భిన్నం అయి వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ సమయంలో చుట్టాలు, చుట్టుపక్కల వారి ఆదరణకు కూడా నోచుకోని వీరిని, ఆదరణతో, మానవతా దృక్పథంతో సాకాలనే తపన గల కొందరు ఆదర్శవంతుల మస్తిష్కం నుంచి ఉద్భవించిన ఆలోచనల భౌతిక రూపమే ఈ వృద్ధాశ్రమాల ఆవిర్భావం. కొంతకాలం ఈ ఆశ్రమాలు నిబద్దతతో నిర్వహించారు. అయితే కాలక్రమేణా ఈ వృద్దాశ్రమాల అవసరం, ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో, శ్రీ శ్రీ గారి ‘కాదేదీ కవిత కనర్హం’ అనే ప్రబోధాన్ని ‘కాదేదీ అక్రమార్జనకు అనర్హం’ అని అన్వయించుకుని, నయవంచకుల మస్తిష్కం నుంచి కొన్ని వృద్ధాశ్రమాల రూపకల్పనకు అంకురార్పణ జరిగింది. ఇందులో అనర్ధాలకు అడ్డుకట్ట వేయాలని కొన్ని చట్టాలు ఆవిర్భవించాయి. అయితే చట్టాలు అమలు పరిచే వారు, వృద్ధాశ్రమాలను నిర్వహించేవారు ధనార్జన దుర్బుద్ధితో, వృద్దుల సేవను పక్కన బెట్టారు. మానవత్వం మరుగున పడి, ఆర్జనే లోకమైన వేళ, చట్టాలను చుట్ట చుట్టి మట్టిలో పాతరవేసిన దుర్దినాలు దాపురించాయి. ఈ పరిస్థితి మారాలంటే భగవంతుని ప్రార్ధించడం తప్ప, వారు వేరే ఏమీ చెయ్యలేని భౌతిక పరిస్థితి.
-చాగంటి శాంతారాం
99495 41679






