- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు భద్రతే.. ప్రాణ రక్షణ!
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రమాదాల ప్రధాన కారణాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, ప్రభుత్వ చర్యలు, రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశ్లేషణ.

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఒక్క ప్రమాదం ఒక కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందువల్ల రోడ్డు భద్రతపై ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం సమాజానికి ఎంతో అవసరం.
ఈ తరహా మరణాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ విపరీతంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ‘ఎరైవ్-ఎలైవ్’ నిర్వహించినట్లు అలాగే ప్రమాదాలకు కారణాలు, పరివ్యసానాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
నిబంధనలు సొంతంగా పాటించాలి!
దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరును విశ్లేషిస్తున్నప్పుడు.. స్వీయ తప్పిదాల వల్లనే అధికంగా జరిగినట్లు గుర్తించారు. మితిమీరిన వేగం, రాంగ్ సైడ్ ఓవర్ టేక్ చేయడం, తాగి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘలను జరిగినట్లు గుర్తించారు. ఇక బైక్ ప్రమా దాల్లోనైతే హెల్మెట్ ధరించి, సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ప్రమాదాలు జరిగినా.. ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చు. ఇలాంటివి ఎవరో అమలు చేయాల్సిన పనిలేదు, ఎవరికి వారే సొంతంగా పాటించాలి. ఇక రోడ్డు ప్రమాదాల పెరగడంలో వ్యవస్థాపరమైన లోపాల విషయంలో చూస్తే.. చాలాచోట్ల వాహనదారులకు మార్గదర్శకం చేసే సైన్ బోర్డులు లేవనేది వాస్తవం. ఫీడర్ రోడ్డు ప్రధాన రహదారిని కలిసే చోట.. వాహనాల వేగం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ‘ముందు ప్రధాన రహదారి ఉంది’ అనే సూచన సైన్ బోర్డు ఉండాలి. ఇవి లేక పోవడం వలన వాహనదారులు దాన్ని గమనించక ఫీడర్ రోడ్ నుంచి ప్రధాన రహదారి పైకి వేగంగా వస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. అందుకే బోర్డులను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టాలి. ఇక ట్రాఫిక్ నిబంధనలను అతి క్రమించిన వాహనదారులపై ప్రభుత్వం అప్పుడప్పుడూ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఇవ్వడంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని భావించి, ఆ రాయితీలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రోడ్ల పక్కన వాహనాలు ఆపడంతో..
సుప్రీంకోర్ట్ నేషనల్ హైవేలపై మృత్యువు కేళిని నివారించేందుకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజల జీవన హక్కును చిదిమ్మెస్తున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే న్యాయపాలిక ఆదేశాలు ప్రభుత్వాలు తు.చా తప్పక అమలు చేయాలి. జాతీయ రహదారుల నిర్వహణ, విస్తరణ అవసరాలకు సేకరించిన 'రైట్ ఆఫ్ వే' పరిధిలో హోటల్స్, దాబాలు ఇతర వాణిజ్య నిర్వహణలో కోకొల్లలు వెలుస్తున్నాయి.. దారుల పొడవునా ఎక్కడికి అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా భారీ వాహనాలు నిలిచిపోయి కనిపిస్తుంటున్నాయి. ఈ అడ్డగోలు పార్కింగ్ పోకడలను అడ్డుకునే వారు కరువయ్యారు. అందుకే హైవేలపై ట్రాక్ పార్కింగ్ సదుపాయం కచ్చితంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి. మరోవైపు దేశవ్యాప్తంగా 16 వేలకు పైగా బ్లాక్ స్పాట్లను (దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను) గుర్తిస్తే, వాటిలో సగానికంటే తక్కువ చోట్ల మాత్రమే శాశ్వత నష్ట నివారణ చర్యలు చేపట్టడం రహదారి భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇక హైవేల పక్కన మద్య విక్రయాలు, భారీ గోతులు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ తదితరాల మూలంగానూ రోడ్ ఎక్కిన వారు క్షేమంగా ఇంటికి చేరుతారన్న భరోసా లేకుండా పోతోంది!
ప్రభుత్వాలు సమిష్టిగా వ్యవహరిస్తేనే..
మనదేశంలో ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాద మరణాలు 11.89గా లెక్క తేలుతుంటే, చైనాలో అవి 4.3 మాత్రమే. మనతో పోలిస్తే మిగిలిన దేశాల్లోనూ రహదారులపై నరమేధం కాస్త తక్కువే. రోడ్డు ప్రణాళిక దశలోనూ, నిర్మాణ దశలోను లొసుగులు ఇంజనీరింగ్ వైఫల్యాలే రోడ్లను రక్తసిక్తం చేస్తున్నాయని తెలుస్తుంది. ఇలా లోపభూయిష్ట రహదారుల నిర్మాణాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించి సంబంధిత కాంట్రా క్టర్లపై, ఇంజనీర్లపై తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వాలు న్యాయపాలికల సూచన, ఆధునిక సాంకేతిక సహాయంతో నిఘాను కట్టిదిట్టం చేయాలి. ఉల్లంఘనలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ బాధ్యులను కఠినంగా శిక్షించాలి. హైవేలపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పరిచి, క్షతగాత్రులకు తక్షణ చికిత్సలు అందించాలి. వాహన దారులు కూడా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన స్వీయతప్పిదాలు, సామాజిక(సివిక్ సెన్స్) స్పృహ లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించక పోవడం లాంటి నిర్లక్ష్యాన్ని వీడి, తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించాలి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా సమర్థంగా వ్యవహరిస్తేనే ప్రజానీకానికి, దేశ ఆర్థికానికి తీరని హాని చేస్తున్న రోడ్డు ప్రమాదాలు తగ్గి ప్రయాణాలు సురక్షితం అవుతాయి.
- మేకిరి దామోదర్
95736 66650






