ఎమ్మెల్సీ పాఠం చెప్పిన ఫలితం

by Disha edit |
ఎమ్మెల్సీ పాఠం చెప్పిన ఫలితం
X

పీఠం కిందకు నీళ్లొచ్చి తడి తగిలే వరకు ప్రజావ్యతిరేకతను గ్రహించడానికి, గుర్తించినా అంగీకరించడానికి పాలకులు సిద్ధంగా ఉండరు. గ్రహించక మరింత ప్రజాగ్రహానికి గురవుతారా లేక తప్పు దిద్దుకొని ప్రజల్ని మచ్చిక చేసుకోవడం ద్వారా పరిస్థితి మెరుగుపరచుకుంటారా అన్నది వేరే విషయం! కానీ, వ్యతిరేకతే లేదని ఓటమికి కుంటి సాకులు వెతకటం అధికారపక్షీయుల రాజకీయ అంధత్వం! పాలనపై వ్యక్తమయ్యే వ్యతిరేకత, దాని తాలూకు సంకేతాలు కనబడగానే... ఇదంతా తమ ప్రయోజకత్వమే అనుకొని, ఇక తమ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టేనని సంబరాల్లో పడే విపక్షాలదీ గుడ్డితనమే! ఎన్నికలు ఏవైనా ఫలితాలు -కారణాలు, వాటి కార్యకారణ సంబంధాల్ని తగు విధంగా విశ్లేషిస్తే తప్ప నిజాలు నిగ్గుతేలవు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల పాలకపక్షాలకు ఓటర్లు బుద్ధి చెప్పారు. ముఖ్యంగా పట్టభద్రుల, బడిపంతుళ్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఫలితాల సరళి జనాభిప్రాయానికి స్థూల సంకేతం. గ్రహించడానికి సిద్ధంగా ఉంటే, ఈ ఫలితాలు పాలక-విపక్షాలకు కనువిప్పు, ఒక రకంగా అందరికీ గుణపాఠమే!

న్నం ఉడికిందీ లేనిదీ ఒక మెతుకును బట్టి చెప్పగలం. ఏపీలో సర్కారుపై ప్రజావ్యతిరేకత క్రమంగా పెరుగుతోందనడానికి ప్రస్తుత పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎదురైన ఓటమి మరో సంకేతం మాత్రమే! ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తూ, రాష్ట్రంలోని అత్యధికులు లబ్దిదారులుగా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నా... ప్రజాస్వరంలో తేడా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఎక్కువ మందే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేమిటో! నిర్దిష్ట నిర్వచనం లేని బ్రహ్మపదార్థం లాంటి ‘అభివృద్ధి లేద’నే మాట చాలా చోట్ల వినిపిస్తోంది. కంపెనీలు, పరిశ్రమలు రాక పెరుగుతున్న నిరుద్యోగిత, మరమ్మత్తులకు నోచని రోడ్లు, అడ్డంగా పెరిగిన నిత్యావసరాల ధరలు తదితరాలను జనం తరచూ ఉటంకిస్తున్నారు. ‘ప్రభుత్వం మాకు నగదు ఇస్తున్న మాట నిజమే, కానీ......’ అనే మాట దాదాపు అంతటా వినిపించడాన్ని గడచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో విస్తృత పర్యటనలు, ప్రజా పలకరింపులు, ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసిన ‘పీపుల్స్‌ పల్స్‌’ సర్వే సంస్థ గమనిస్తూ వస్తోంది. ఏడాదిలో ఉత్తరాంధ్ర మూడు, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా, ఇతర జిల్లాల్లో పాక్షికంగా ఈ సంస్థ పర్యటించి, అధ్యయనాలు చేసింది.

రాష్ట్రంలోని ఏడు ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో జరిపిన శాంపిల్‌ సర్వేలో, ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ ఫలితాల్లోనూ వ్యక్తమైన అభిప్రాయం ‘జనంనాడి’తో సరిపోయింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ 7 స్థానాలకు ఎదిగినట్టు ఒకసారి, 10కి ఎదిగినట్టు మరోమారు ఇండియాటుడే సర్వేలో వెల్లడవడం, వారి గ్రాఫ్‌ ఊర్ద్వముఖంగా సాగుతున్నట్టు స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో లభించిన ఓటు శాతాలతో పోల్చి చూస్తే... సర్వేల్లో, తాజా ఫలితాల్లోనూ పాలక వైఎస్సార్సీపీ ఓట్ల శాతం తగ్గితే, ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ ఓటు శాతం స్వల్పంగా పెరిగింది. కనుక, ఈ ఎమ్మెల్సీ ఫలితాల సరళిని వారు తీసి పారవేయడానికి లేదు, అలా అని వీరు చంకలు గుద్దుకోవడానికీ లేదు.

కళ్లు మూసుకుంటే... సరిపోదు

కళ్లు మూసుకున్నంత మాత్రాన ఇష్టంలేని పరిణామాలు జరుగకుండా ఆగిపోతాయా? వాస్తవాలు గ్రహించడానికి, అంగీకరించడానికి పాలకులు సిద్ధంగా ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి, పాలకపక్షం కాంగ్రెస్‌ నెగ్గింది. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడటానికి వెళ్తూ కారు ఎక్కగానే ముఖ్యమంత్రి డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డి, ‘మనకు డిస్టింక్షన్‌ రాలేదు, బోటాబోటి పాస్‌ మార్కులే వచ్చాయి, ఎందుకిలా జరిగిందో... నియోజకవర్గాల వారీ సమాచారం తెప్పించి సమీక్షించుకోవాలి’ అని తనవారికి పురమాయించారు. ప్రజాకోణంలో చూసినపుడు ఎన్నికలు రెండు రకాలుగా జరుగుతాయి. పార్టీల, అభ్యర్థుల మంచి-చెడుల బేరీజుతో ఓటు వేసే సాధారణ ఎన్నికలు ఒక రకం. పాలకపక్షాన్ని, వారి అభ్యర్థుల్ని ఓడించాలనే కసితో ఓటు వేసే మరో రకమైనవి అసాధారణ ఎన్నికలు. వైఎస్సార్సీపీ ఓడిపోయిన మూడు ప్రాంతాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు పట్టభద్రులు, బడి పంతుళ్లు. సాధారణ ఓటర్లకు వీరు భిన్నమే అయినా... సరళిని బట్టి చూసినపుడు, పాలకపక్షానికి ఓటింగ్‌ శాతం తగ్గింది.

ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ) పరిధిలో 2019 తో పోలిస్తే 18.89 శాతం ఓట్లు కోల్పోయింది. తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) పరిధిలో 19.10 శాతం ఓట్ల వ్యత్యాసం నమోదయింది. ఇక పశ్చిమ రాయలసీమ (కడప, అనంతపురం, కర్నూలు) పరిధిలోనూ 13.37 శాతం ఓట్ల తగ్గుదల కనిపించింది. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవీ చూడమని విస్పష్టంగా ప్రకటించిన వారు, ‘ఈ పరిమిత ఎన్నికల్లో పాల్గొన్నవారు అసలు మా ఓటర్లు కారు, మా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు, కనుక మాది ఓటమి కాదు’ అని ఓ వింత అన్వయం చెబుతున్నారు. అధినేతకు పార్టీ శ్రేణులకు మధ్య లింకు తెగింది. అసాధారణ కేంద్రీకృత నాయకత్వానికి తోడు మరో మూడో, నాలుగో ‘పవర్‌ సెంటర్లు’ రాజ్యమేలటం సామాన్యులకే కాదు కార్యకర్తలకూ మింగుడు పడటం లేదు. ఈ ఓటమితోనైనా నాయకత్వానికి బుద్దిరావాలని కొన్ని చోట్ల పార్టీశ్రేణులే బలంగా భావిస్తున్నాయి. కానీ, పొగడ్తలు, భజన తప్ప నిజాల్ని నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లని తమ వైఫల్యాన్నీ వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాలి.

కళ్లు తెరవకుంటే... లాభం లేదు

‘కాగల కార్యం గంధర్వులే తీరుస్తార’నే నింపాదితనం విపక్షాలకు పనికిరాదని గతంలో ఎన్నో ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. ‘మూడు ఎమ్మెల్సీ స్థానాల ఓటమితో పాలకపక్షం మాడు పగిలింది, ఇంకేముంది, మేం వచ్చేసినట్టే అధికారంలోకి’ అని టీడీపీ జరుపుకుంటున్న సంబరాలొక అతి! ఇందుకు అనుకూలమైన విశ్లేషణలు, కథనాలు, ప్రచారం ఒక మైండ్‌ గేమ్‌ తప్ప వేరేమీ కాదు. నిజానికి టీడీపీ పెద్దగా సాధించిందేమీ లేదని, కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ఫలితాలే చెబుతాయి. 2019 పైన, ప్రస్తుత ఓట్ల శాతాల్ని పోలిస్తే, ఉత్తరాంధ్రలో టీడీపీకి పెరిగింది 4.27 శాతం. తూర్పు రాయలసీమ పరిధిలో 5.28 శాతం, పశ్చిమ రాయలసీమ పరిధిలో 3.78 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది! 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ-టీడీపీ మధ్య 10 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది. అప్పుడైనా, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల శాతం వైఎస్సార్సీపీకి (56-37 శాతాలు) అనుకూలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి (44-35 శాతాలు) అనుకూలించిందని ‘సీఎస్డీఎస్‌’ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవాలు మరచి గొప్పలు ప్రచారం చేసుకుంటే ఎవరికైనా తిప్పలు తప్పవు! ఒక మున్సిపాలిటీ గెలిచి వైఎస్సార్సీపీ, ‘ఇక వచ్చే ఎన్నికల్లో కుప్పం మాదే’ అనటం లాంటిదే, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులివెందుల నుంచి కనుక, ‘వచ్చే ఎన్నికల్లో పులివెందులా మేమే గెలుస్తాం’ అనే మాటలు టీడీపీ బీరాలు! పైగా ఓట్లన్నీ కలిపి లెక్కిస్తారు కనుక, ‘పులివెందులలోనూ మాకు ఆధిక్యత’ అనే వాదన గాలి ముచ్చట! మొత్తమ్మీద టీడీపీ కార్యకర్తల నైతిక స్థయిర్యం పెంపునకు ఈ ఫలితం దోహదపడుతుంది.

ఏపీలోని 7 ఎస్టీ నియోజకవర్గాల్లో జనవరిలో ‘పీపుల్స్‌ పల్స్‌’ నిర్వహించిన సర్వేలోనూ 2019తో పోల్చినపుడు 4.9 శాతం ఓట్లను వైఎస్సార్సీపీ కోల్పోతుంటే, టీడీపీ 9.69 శాతం ఓట్లను మెరుగుపరచుకుంటున్నట్టు వెల్లడైంది. టీడీపీ గ్రహించాల్సిన ఇంకో విషయం 3 స్థానాల్లోనూ రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేల్చాల్సి వచ్చింది. అంటే, ప్రజలు వైఎస్సార్సీపీని పూర్తిగా ‘ఛీ’ కొట్టనట్టే, టీడీపీకీ పూర్తిగా ‘జై’ కొట్టలేదు. విశాఖకు రాజధాని బదిలీని ప్రజలు హర్షించలేదనే అన్వయం చెప్పే ముందు, 2019 మంగళగిరిలో లోకేష్‌నూ ఓడించడం ద్వారా ‘అమరావతి’ని ప్రజలు తిరస్కరించారని ఒప్పుకుంటారేమో టీడీపీ చెప్పాలి. అకాలవర్షంలా అయాచితంగా లభించిన ప్రజాతీర్పుగానే ఈ 3 స్థానాల్లో గెలుపును గ్రహించకుండా, ప్రచారానికి మొదట ముఖం చాటేసిన టీడీపీ పెద్ద నాయకులు కూడా ఇప్పుడు గెలుపును తమ ఖాతాలో వేసుకునే యత్నం చేస్తున్నారు. ప్రచారం కింది స్థాయిలో మాత్రమే జరిగింది.

తెలంగాణలోనూ తేటతెల్లం

‘గెలుపుకు అందరూ మొగుళ్లే, ఓటమి ఎప్పటికీ అనాథే!’ అన్నది ఓ పాత, మొరటు సామెత! తెలంగాణలో ఒకే ఒక టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు బీజేపీ ఖాతాలో పడింది. మునుపు రెండు ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రత్యక్ష మద్దతు ప్రకటించిన పాలక బీఆర్‌స్‌ పార్టీ ఈ సారి అలా చేయలేదు. పీఆర్టీయూటీఎస్‌ అభ్యర్థికి పరోక్షంగా మద్దతిచ్చింది. అయినా, అతడు ఓడిపోయి, బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి అతనిపై 1150 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. యూటీఎఫ్‌ అభ్యర్తి 3వ, కాంగ్రెస్‌ బలపరచిన అభ్యర్థి 4వ, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి 5వ స్థానాలు దక్కించుకున్నారు. మేం అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు, ప్రచారం చేయలేదని పాలకపక్షం ఎన్ని దాటవేత మాటలు చెప్పినా... అది ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చజాలదు. జీవో 317, టీచర్ల బదిలీలు-ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోవడం వంటివి ప్రతికూలించాయి. టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాసినా, కాంగ్రెస్‌ బలపరచిన అభ్యర్థికి 4వ స్థానం తప్పలేదు.

ఇంత జరిగినా, ఎమ్మెల్సీ ఫలితాలకు తప్పుడు అన్వయం చెబుతూ... వ్యతిరేకతే లేదని పాలకపక్షం భావించడం ఎంత తప్పో, సదరు వ్యతిరేకత సహజంగానే గెలుపును తమ ఖాతాలో పడేస్తుందని విపక్షం నిమ్మకు నీరెత్తినట్టుండటం అంతే తప్పవుతుంది. జననాడి సంకేతాలు సరిగా గ్రహించి, నడత మార్చుకుంటేనే ఎవరికైనా రాజకీయ ప్రయోజనం!

-దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected]

99490 99802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story

Most Viewed