బాధ్యత.. వ్యక్తిత్వ వికాసానికి తొలి మెట్టు!

by Ravi |   (  Updated:2025-11-14 01:00:57  IST  )

పిల్లల జీవితానికి వెలుగు ప్రసాదించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులూ ఇద్దరూ రెండు కళ్ల వంటివాళ్లు. వారు ప్రయోజకులు కావాలంటే, చదువుతో పాటు కేరక్టర్ కూడా అంతే ముఖ్యం. కాలం మారుతోంది.

బాధ్యత.. వ్యక్తిత్వ వికాసానికి తొలి మెట్టు!
X

పిల్లల జీవితానికి వెలుగు ప్రసాదించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులూ ఇద్దరూ రెండు కళ్ల వంటివాళ్లు. వారు ప్రయోజకులు కావాలంటే, చదువుతో పాటు కేరక్టర్ కూడా అంతే ముఖ్యం. కాలం మారుతోంది. పిల్లలకు పాఠాలు కాకుండా ఎక్కువగా ఏ విషయాలు చెప్పినా కాకమ్మ కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారనే అభిప్రాయం తల్లిదండ్రులకు కలుగుతోంది. కానీ అది తప్పు..

పిల్లలు స్వచ్ఛమైన వారు. పెరిగే క్రమంలో వాళ్లను మనమే చెడగొడుతున్నాం. వాళ్లకు అబద్ధాలు చెప్పడం అలవాటు చేస్తున్నాం. పొరపాటున ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తున్నాం. కానీ అదే తప్పు మనం చేస్తే ఆ పిల్లల ముందు ఆ తప్పును ఒప్పుకోవడానికీ నామోషి పడి, చాలా తేలిగ్గా, తెలివిగా పెద్దరికంతో ఆ తప్పును ఇతరుల మీదకు తోసి కప్పిపుచ్చుకుంటున్నాం. తప్పును సులభంగా ఇతరుల మీదకు ఎలా తోయాలో మనకు తెలియకుండానే పిల్లలకు పలాయనవాదం, బాధ్యతా రాహిత్యం నేర్పిస్తున్నాం.

బుద్ధిగా చదువుకోవడమేనా బాధ్యత?

నేనొకసారి హై స్కూలు విద్యార్థుల కోసం ‘కథల ద్వారా వ్యక్తిత్వ వికాసం’ అనే అంశం మీద మాట్లాడుతూ, పిల్లలను బాధ్యత అంటే ఏమిటి? అని ప్రశ్నించాను. దానికి వాళ్లు బాధ్యత అంటే బాధ్యతగా ఉండటం, బుద్ధిగా చదువు కోవడం, పెద్దలు చెప్పినట్టుగా వినడం. మన పని మనం చేసుకోవడం.. ఇలా రకరకాల సమాధానాలు ఇచ్చారు. అందులో కొన్ని నవ్వొచ్చే సమాధానాలు కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్లకు ఒక చందమామ కథ చెప్పాను.

బాధ్యత విలువ తెలియజేసే కథ!

ఒక జమీందారు తన తల్లి జ్ఞాపకార్థం, ఒక వైద్యశాలను నిర్మించాలనుకొని ఆ పని దివానుకు అప్పగించాడు. ఆ నిర్మాణం పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి జమీందారు వచ్చి, ఒకసారి వైద్యశాలను తిరిగి చూసి, ‘దీని నిర్మాణం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? రోగుల పడక గదులలో అసలు గాలి రావడం లేదు. అన్నాడు కోపంగా. అందరూ గజగజ వణికి పోయారు. ‘ఈ నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక అధికారికి అప్పగించాను’ అన్నాడు దివాను. ప్రత్యేక అధికారి, ‘భవన నిర్మాణం పనులు చూసే అధికారే ఈ బాధ్యతలు వహించాడు’ అన్నాడు. అలా వాళ్లు ఆ బాధ్యతను వారిపై వేసుకోక మరొకరిని చూపిస్తూ వెళ్లారు. చివరికి ఆ వరుసలో మణికంఠుడు అనేవాడు మిగిలాడు. అతడు ‘ప్రభువులు క్షమించాలి. ఈ వైద్యశాలకు రూప కల్పన చేసిన రోజు నుంచి, పెద్దల పర్యవేక్షణలో వందలాది మంది రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశాం. నాకు తెలిసినంత వరకు నిర్మాణంలో ఎలాంటి లోపాలూ లేవు. ఉన్నట్టు ప్రభువులకు అనిపిస్తే అందుకు పూర్తి బాధ్యత నేనే వహి స్తున్నాను. ఎలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను' అన్నాడు. ఆ మాటతో జమీందారు ముఖం వికసించింది. ‘పొగడ్తలకయితే అందరూ ఎగబ డతారు. విమర్శలను ఎవరూ సహించరు. ఒక పని చేసినపుడు మంచి జరిగితే తన గొప్పతనంగా చెప్పుకోవడం, తప్పు జరిగితే చాలా సులభంగా అవతలివారి మీదకు తోసేయడం చేస్తుంటారు. వాస్తవానికి వైద్యశాల అద్భుతంగా కట్టించారు. ఈ భవన నిర్మాణానికి బాధ్యతాయుతంగా పనిచేసిన వారెవరో తెలుసుకోవాలనే అలా చేశాను’ అంటూ జమీందారు మణికంఠుణ్ణి ఘనంగా సత్కరించాడు. ఇదీ బాధ్యత విలువను తెలియజేసే గొప్ప కథ అని పిల్లలకు చెప్పాను.

తప్పులకు బాధ్యులను చేయాలి..

బాధ్యత అనేది చాలా శక్తిమంతమైన పదం. ‘హితం మనోహారి చ దుర్లభం వచః’ (కిరాతార్జునీయం 1-4) లోకంలో హితాన్ని, సంతోషాన్ని ఏక కాలంలో కలుగజేసే మాట ఉండదు. బరువును భుజానికెత్తుకోగానే కాసేపటికి భుజం నొప్పి పుడుతుంది. కిందికి దించేయమని లోపల నుండి ఒక గొంతుక మొత్తుకుంటుంది. ఇదెక్కడి దరిద్రం.. వదిలించుకోమని గోల పెడుతుంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా మోసే కొద్దీ అది అలవాటవుతుంది. బరువులు మోసే కొద్దీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. బాధ్యత మోసే కొద్ది బుద్ధికి అనుభవం వస్తుంది. ఆ అనుభవం డబ్బు సంపాదించడానికి ఉపయోగపడితే, ఆరోగ్యం ఆ డబ్బును ఆనందంగా ఆస్వాదించడానికి ఉపయోగపడుతుంది. కానీ బాధ్యతను స్వీకరించడానికి మనిషికి చాలా అర్హతలు ఉండాలి. ఓర్పు, సహనం, శాంతి, మంచితనం, మానవత్వం, ఇలా ఎన్నో మనసు నిండా మౌలిక గుణాలుండాలి. బాధ్యత అంటే చేసేపని మంచి చెడ్డలకు తామే బాధ్యులమని ప్రకటించడం. పిల్లలకు బాధ్యత అలవాటు చేయడం వ్యక్తిత్వ వికాసంలో మొదటి మెట్టు.

-డా. దాసరి వెంకట రమణ

బాలసాహితీ వేత్త

90005 72573

Next Story